Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 మండలాల్లోని రూ.500 కోట్ల భూములకు స్కెచ్
- ఐదుగురు అరెస్టు
తిరుపతి: చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం బయటపడింది. 13 మండలాల్లోని సుమారు రూ.500 కోట్ల విలువైన భూములకు స్కెచ్ వేసిన వ్యవహారంలో ఐదుగురిని ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సీఐడీ డీఎస్పీ రవికుమార్ ఆదివారం తన కార్యాలయంలో మీడియాకు తెలియజేసిన వివరాల ప్రకారం... చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం 184 గొల్లపల్లి గ్రామనివాసి, మాజీ విఆర్ఒ మోహన్ గణేష్ పిళ్ళై 2009లో తన కుమారుడు మధుసూధన్ సహాయంతో ఒక తప్పుడు పత్రాన్ని సృష్టించాడు. 1981లో తన తండ్రి శ్రీనివాస పిళ్ళైకు వారసత్వంగా సంక్రమించిన చిత్తూరు జిల్లాలోని సోమల, పుంగ నూరు, పెద్దపంజాణి, బంగారుపాళ్యం, యాదమర్రి, చిత్తూరు, కెవి పల్లి, గుర్రంకొండ, చంద్రగిరి, ఏర్పేడు, సత్యవేడు, రామచంద్రాపురం, తంబళ్లపల్లిలలోని 18 గ్రామాల్లో 93 సర్వే నంబర్లలోగల 2,320 ఎకరాల భూములు ఉన్నట్లు, వాటిని తన తల్లి అమతవళ్లమ్మకు బదలాయిస్తున్నట్లు కొత్త పత్రాల్లో చూపాడు. తాను వీఆర్వోగా పని చేస్తున్న సమయంలో 2005-2010 మధ్యలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ఎన్ఐసీ వారి ఆధ్వర్యంలో రెవెన్యూ రికార్డులను (అడంగల్) అక్కడకు రప్పించాడు. వాటిని కంప్యూటరీకరించే సమయంలో హక్కు విడుదల పత్రంలో కనబరిచిన భూములను కంప్యూటరు పరిజ్ఞానం కలిగి ఉన్న తన కుమారుడు మధుసూదన్ ద్వారా 2009లో ఎల్అర్ ఎంఐఎస్ సాప్ట్‌వేర్‌లో 2019 జులై ఒకటిన తన నలుగురి పిల్లలు కోమలి, ధరణి, మధుసూదన్, నటరాజన్ ఏ.రాజన్ల పేరిట జిల్లాలోని తొమ్మిది మండలాల్లోగల 59 సర్వే నంబర్లలోని 1,577 ఎకరాల భూములను నమోదు చేయించాడు. తరువాత మీ-సేవా కేంద్రాల ద్వారా ఆ భూముల అడంగల్, 1-బీ కాపీలను పొందాడు. చాలా కాలంగా నేరచరిత్ర కలిగిన చౌడేపల్లి మండలం దారాల గ్రామానికి చెందిన కె.రమణ (అడవి రమణ)తో మోహన్ గణేష్ పిళ్ళై పరిచయం చేసుకున్నాడు. వారిద్దరూ కుమ్మక్కై ఆ భూములను అమ్మకానికి పెట్టారు. శ్రీకాళహస్తికి చెందిన నాగమోహన్రెడ్డికి ఏర్పేడు, సత్యవేడు మండలాల్లో భూములకు విక్రయ అగ్రిమెంటు రాయించి రూ.55.60 లక్షలు తీసుకున్నారు. భూకబ్జా వ్యవహారంలో ఈ నెల రెండున మోహన్ గణేష్ పిళ్ళైను, ఆయన ముగ్గురు కుమారులను,, అడవి రమణను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలను, నేరానికి ఉపయోగించిన ఇతర పత్రాలను, సీళ్లను మోహన్ గణేష్ పిళ్ళై ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం ప్రయత్నించినప్పుడు వాస్తవ విస్తీర్ణానికి మించి ఆన్లైన్ రికార్డుల్లో చూపించడంతో సోమల తహ శీల్దారు ఎ.శ్యాంప్రసాద్‌రెడ్డి ఫిర్యాదు మేరకు తాము చేసిన సమగ్ర దర్యాప్తులో భారీ భూకుంభకోణం బట్టబయలు అయిందని సీఐడీ డీఎస్పీ తెలిపారు.