Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియంత ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారు
- రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, కార్మికవర్గ భవిష్యత్తు కోసం ఐక్య పోరాటం
- ప్రగతిశీల, ప్రజాస్వామ్య విలువల్ని నాశనం చేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ
- ఎర్ర జెండాను నిర్మూలించడం ఎవరి తరం కాదు : సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర మహాసభల్లో ఏచూరి
న్యూఢిల్లీ : దేశంలో పోరాటం చేస్తున్న రైతుల త్యాగాలు వృథా కావని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ, దేశంలోని శ్రామిక ప్రజల భవిష్యత్తు కాపాడటానికి ఐక్య పోరాటం, సమీకరణ చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. దేశ ప్రగతిశీల, ప్రజాస్వామ్య విలువలను నాశనం చేయడానికే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయనీ,అందువల్ల నేడు దేశాన్ని కాపాడటానికి పోరాడాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర 16వ మహాసభలు హిసార్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఇంద్ర జిత్ సింగ్, శకుంతల జాఖర్ అధ్యక్షతన జరిగిన పాల్గొన్న వారిని ఆహ్వానం సంఘం చైర్మెన్ బల్బీర్ నంబర్దార్ స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఏచూరి పాల్గొని ప్రసంగించారు. రైతుల ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన సుమారు 700 మంది రైతులకు నివాళులర్పిస్తూ, వారి త్యాగం వృథా కాదని అన్నారు. ప్రజలు ఈ నియంత ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. 1916 నాటి రైతుల ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ ఆ సమయంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడి రైతులను నాశనం చేసి, నీలిమందు పండించాలని అనుకున్నదనీ, ప్రస్తుతం మోడీ సర్కార్ తీసుకొచ్చిన చట్టాలతో దేశీయ, విదేశీ పెద్ద కార్పొరేట్ సంస్థలు దేశంలోని రైతులతో అదే చేయాలనుకుంటున్నాయని తెలిపారు. మహత్మాగాంధీ అభివృద్ధి చేసిన విలువల ఆధారంగా రాజ్యాంగాన్ని కాపాడటమే గాంధీకి నిజమైన నివాళి అని ఆయన అన్నారు. నేడు ఆర్ఎస్ఎస్ నియంత్రణలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్నదనీ, ఆర్ఎస్ఎస్ దేశ రాజ్యాంగాన్ని ఎన్నడూ గుర్తించలేదని చెప్పారు. అసమానత్వం గురించి ఎలాంటి ఆందోళన లేదని అన్నారు. అందుకే నేడు ప్రజా వ్యతిరేక చట్టాలు రూపొందించారనీ, పార్లమెంటులో వాటిపై చర్చ జరగటంలేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారనీ, ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను వ్యతిరేకించే ఎవరైనా ఉపా వంటి చట్టాల కింద జైలు పాలవుతున్నారనీ, వేలాది మంది అమాయకులను జైళ్లలో పెట్టారని అన్నారు.
ఎర్ర జెండాను నిర్మూలించడం అసాధ్యం
రైతు, కార్మిక ఉద్యమాల వెనుక ఎర్ర జెండాకు చెందిన వారే ఉన్నారనీ, తాము వారిని నిర్మూలిస్తామని హర్యానా సీఎం ఖట్టర్ నిరంతరం చెబుతున్నారనీ, అయితే ఎర్ర జెండాను నిర్మూలించడం ఎవరితరం కాదని ఏచూరి హితవు పలికారు. జర్మనీ నియంత హిట్లర్ కూడా ఎర్ర జెండా నిర్మూలించినట్టు ప్రకటించాడనీ, ఈ ఎర్ర జెండా అతని ఫాసిస్ట్ నియంతృత్వాన్ని నాశనం చేసిందని గుర్తు చేశారు. జర్మనీ పార్లమెంటుపై ఎర్ర జెండాను ఎగురవేసిందని తామేనన్న విషయాన్ని గమనించాలంటూ.. హర్యానా సీఎం ఖట్టర్‌ను హెచ్చరించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రస్తుత విధానాలకు ప్రత్యామ్నాయం, బీజేపీ నియంతృత్వానికి సమాధానం ఎర్ర జెండా మాత్రమే ఇవ్వగలదనీ. ఆ విషయం బీజేపీకి బాగా తెలుసన్నారు. అందుకే వామపక్షాలపై దాడి చేస్తున్నదనీ, త్రిపురలో సీపీఐ(ఎం) కార్యాలయాలపై దాడి చేసి, ధ్వంసం చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర కార్యదర్శి సురేందర్ సింగ్ మాట్లాడారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు నీలోత్పల్ బసు, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జోగేంద్ర శర్మ, కేంద్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ హేమలత, పార్టీ నేతలు సురేష్ కుమార్, జై భగవాన్, సుఖ్బీర్ సింగ్, దేశ్ రాజ్, దినేష్ సివాచ్, రోహ్తాస్ రాజ్లి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ, షహీద్ భగత్ సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్ విగ్రహాలకు సీపీఐ(ఎం) నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభలో రోV్ాతక్ జిల్లా సాంస్కృతిక బృందం గీతాలపన, నాటికలతో పాటు వివిధ ప్రజా కళను ప్రదర్శించింది.