Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూత్వం, విభజనవాదంతో పెరిగిన ప్రమాదం
- పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్తో దెబ్బతిన్న సంబంధాలు
- కేంద్రంలో అధికార పార్టీ రాజకీయాలే కారణం : కేంద్ర ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు
న్యూఢిల్లీ : భారత్లో ప్రజాస్వామ్యం మునుపెన్నడూ లేనంతగా బలహీనపడిందని కేంద్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన పలువురు మాజీ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్కు ఇంటా, బయటా సమస్యలు పెరిగాయని వారు అభిప్రాయపడ్డారు. మెజార్టీవాదం, హిందూత్వం, విభజనవాదంతో భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ మసకబారుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా భారత ప్రజాస్వామ్యం బలహీనపడిందని వారు వ్యాఖ్యానించారు. మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ప్రకాశ్ మీనన్, వాతావరణ మార్పుపై ప్రత్యేక దూతగా పనిచేసిన మాజీ ఉన్నతాధికారి శ్యాం సరన్, విద్యావేత్తలు సునీల్ ఖిల్నానీ, శ్రీనాథ్ రాఘవన్, విశ్లేషకులు యామినీ అయ్యర్, నితిన్ పారు, అజిత్ రణడే..మొదలైనవారు రాసిన వ్యాసాల్ని 'ఇండియా పాథ్ టు పవర్ : స్ట్రాటజీ ఇన్ వరల్డ్ అడ్రిఫ్ట్' అనే పేరుతో న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ఇందులో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి..
అధికార పార్టీ రాజకీయ విధానాలు, సిద్ధాంతాలే కారణం
ప్రస్తుతం భారత ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి విధానాలతో జీడీపీ దారుణంగా పడిపోయింది. ఈ విధానాలపై అనేక అనుమానాలున్నాయి. రక్షణాత్మక ఆర్థిక విధానాలు, పర్యావరణ మార్పు, సైబర్ పాలసీలపై నిపుణులు, మాజీ ఉన్నతాధికారులు ఎక్కువగా విమర్శలు చేశారు. ముఖ్యంగా మోడీ సర్కార్ పాలనలో ప్రజాసామ్యం బలహీనపడిందని వ్యాసకర్తలందరూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కేంద్రంలోని అధికార పార్టీయే కారణమని వారు విమర్శించారు. గతంతో పోల్చితే భారత ప్రజాస్వామ్యం బలహీనపడిందని, అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని వ్యాసకర్తలు పేర్కొన్నారు. అమెరికా-చైనా మధ్య నెలకొన్న సంబంధాలు ఇండో పసిఫిక్ ప్రాంతంపై తప్పక ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ ఎంత దగ్గరైతే..చైనాకు అంత దూరమవుతుంది. చైనాతోనే కాదు..పొరుగు దేశాలతోనూ భారత్ సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. దేశీయంగా అధికార పార్టీ రాజకీయ సిద్ధాంతం, రాజకీయ విధానాలు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్తో సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయని వ్యాసకర్తలు అభిప్రాయపడ్డారు.