Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో రైతులపై కేంద్ర మంత్రి తనయుడి ఘాతుకం
- కాల్పుల్లో ఒకరు, కాన్వారు దూసుకెళ్లి ముగ్గురు మృతి
- పెల్లుబికిన నిరసనలు
- అనంతరం హింసలో మరో నలుగురు హతం
- నేడు దేశవ్యాపిత నిరసనలు : ఎస్కేఎం
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత పది మాసాలుగా ఉద్యమిస్తున్న రైతులపై కేంద్రంలోను, యూపీలోని బీజేపీ ప్రభుత్వాల నిరంకుశత్వం పరాకాష్టకు చేరింది. ఇప్పటి వరకు లాఠీచార్జీ, జలఫిరంగులతో రైతులపై ఉక్కుపాదం మోపుతున్నది. తాజాగా బీజేపీ బరితెగించింది. యూపీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజరు మిశ్రా తనయుడు ఆశిష్ (సోను) మిశ్రా కాల్పులు జరిపి, ఆ పై కారుతో తొక్కించి నలుగురు అన్నదాతలను అమానుషంగా పొట్టన పెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ కిరాతక ఘటన దేశాన్ని నివ్వెరపరచింది. ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా యూపీ అంతటా నిరసనలు పెల్లుబికాయి. రైతులకు సంఘీభావంగా ప్రజలు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఘటనా స్థలిలో కారును తగులబెట్టారు. పలు చోట్ల హింస చెలరేగింది. లఖింపూర్ ఘటన, ఆ తరువాత చోటు చేసుకున్న హింసలో మొత్తం ఎనిమిది చనిపోయారు. ఇంకా అనేక మంది గాయపడ్డారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత పది మాసాలుగా సాగిస్తున్న రాజీలేని పోరును అపహాస్యం చేసేలా ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే లఖింపూర్‌లో రైతుల శాంతియుతన నిరసనను రక్తపుటేరుల్లో ముంచడం గమనార్హం. బీజేపీ ప్రభుత్వ ఫాసిస్టు చర్యకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం దేశవ్యాపిత నిరసనలకు పిలుపునిచ్చింది.
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో ఆదివారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి అజరు మిశ్రా తనయుడు క్రూరాతి క్రూరమైన దాడికి తెగబడ్డారు. కాల్పులు జరిపి, ఆ తరువాత కారుతో తొక్కించి నల్గురు రైతులను పొట్టనపెట్టుకున్నారు. అతని మామ, ఇతర గూండాలతో సంబంధం ఉన్న వాహనాల కాన్వారు రైతులపైకి దూసుకెళ్లింది. రైతుల్లో ఒకరిని అజరు మిశ్రా టెని కుమారుడు ఆశిష్ (సోను) మిశ్రా కాల్చి చంపాడు. వాహనాల కాన్వారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు రైతులు మరణించారు. ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసు పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌కెఎం నేతలు తజీందర్ సింగ్ విర్క్, తేజిందర్ ఎస్ విరాక్ తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి కుమారుడి ఘాతుకంపై భగ్గుమన్న ప్రజలు బీజేపీ నాయకుల వాహనాలను తగుల బెట్టారు. ఇదే అదనుగా కొన్ని మూకలు హింసను రెచ్చగొట్టాయి. లఖింపూర్‌లో కిరాతక దాడి, తదనంతర హింసతో యూపీ భగ్గుమంది.
హత్య కేసులు నమోదు చేయండి : ఎస్కేఎం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అజరు మిశ్రా టెని, ఆయన కుమారుడు, ఆయన మామ ఇతర అనుచరులతో పాటు రైతులపై దాడికి పాల్పడిన వారందరిపై హత్యా నేరాలతో కూడిన కేసులను వెంటనే నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. కేంద్ర హోం సహాయ మంత్రి పదవి నుంచి అజరు మిశ్రా టెనిని వెంటనే తొలగించాలని, రాష్ట్రంలోని రైతులను రెచ్చగొట్టడాన్ని ఆపాలని డిమాండ్ చేసింది. ఎస్కేఎం నేతలు వివిధ ప్రాంతాల నుండి లఖింపూర్ ఖేరీకి చేరుకున్నారు.
హెలిప్యాడ్ దిగ్బంధం : ముందుగా ప్రకటించినట్లుగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో ఆందోళన చేసేందుకు లఖింపూర్ ఖేరి జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు సమావేశమయ్యారు. వేలాది మంది రైతులు నల్ల జెండాలతో మహారాజా అగ్రసేన్ మైదానంలో హెలిప్యాడ్‌ను దిగ్బంధించారు. డిప్యూటీ సీఎంను అక్కడ దిగకుండా అడ్డుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా టెని ఇటీవల బహిరంగ సభలో రైతు నాయకులపై బహిరంగ బెదిరింపులకు దిగారు. అందులో భాగంగానే ఆదివారం రైతులపై దాడికి పాల్పడ్డారు. రైతులు చెల్లాచెదురుగా నిరసన స్థలం నుండి పరుగులు తీశారు. వెళ్లిపోతున్న రైతులపై దారుణమైన దాడికి పాల్పాడ్డారు. కేంద్ర మంత్రి కుమారుడు, మామయ్య, ఇతర గూండాలు నల్ల జెండాలతో రోడ్లపై నిలబడి ఉన్న నిరసనకారులపైకి వాహనాలతో దూసుకెళ్లారు. ఇద్దరు రైతులు అక్కడికక్కడే మరణించారు. ఇంకా చాలా మంది ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. మరణించిన రైతులు వీరే : తాజా ఘటనలో ప్రాణాలను కోల్పోయిన రైతులను లవ్‌ప్రీత్ సింగ్ (20), దల్జీత్ సింగ్ (35), నచత్తర్ సింగ్ (60), గుర్వీందర్ సింగ్ (19)గా గుర్తించారు. దాదాపు 12 నుంచి 15 మంది గాయపడి ఆసుపత్రి పాల య్యారు. రైతులపై ఈ దాడిలో పాల్గొన్న ఆశిష్ మిశ్రా టెని ఇతరులపై వెంటనే 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేయాలని ఎస్‌కెఎం డిమాండ్ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్‌ని సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాలని ఎస్కేఎం రైతు సంఘాలకు పిలుపునిచ్చింది. రైతులపై కాల్పులకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నటు ఏఐకేఎస్‌సీసీ కన్వీనర్లు టీ సాగర్, పశ్య పద్మ, రాయల చంద్రశేఖర్, వల్లపు ఉపేందర్‌రెడ్డి, అచ్చుత రామారావు, కన్నెగంటి రవి, సాయన్నలు తెలిపారు.