Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నేతలు డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాతో రాజీనామా చేయించండి...లేదంటే పదవి నుంచి ఆయనను తొలగించాలని ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నాడిక్కడ ఎఐకెఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలో ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఎఐకెఎస్ సహాయ కార్యదర్శి ఎన్కె శుక్లా, కోశాధికారి కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. కేంద్రంలో మోడీ, యూపీలో యోగి, హర్యానాలో ఖట్టర్, హేమంత్ బిశ్వ శర్మ ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు తీవ్రంగా కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. మోడీ, యోగి ప్రభుత్వాల పతనం ఖాయమని హెచ్చరించారు. త్వరలో జరగబోయే యుపి అసెంబ్లీ ఎన్నికల్లో, తరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు ప్రభుత్వాలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రైతులను కొట్టండి, నేనున్నాను, చూసుకుంటానని కార్యకర్తలను ఉసిగొల్పిన తరువాత కూడా ఆయనను ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగించగలుగుతున్నారని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా మద్దతు లేకుండా ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడం రాజ్యాంగ కల్పించిన హక్కు అని, వాజ్పేయి, అద్వానీ, బీజేపీ నేతలు కూడా నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు చేశారని తెలిపారు. కేంద్ర మంత్రులను అడ్డుకొని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరటమా రైతులు చేసిన తప్పు అని అన్నారు. నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్నారని, చాలా మందికి గాయాలు అయ్యాయని తెలిపారు. కేంద్ర మంత్రి కుమారుడికి ఎంత అహంభావమని విమర్శించారు. రైతలను కాన్వారు తో తొక్కించి చంపిస్తాడా? అని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వానికి ఎంత కండకావరం వచ్చింది, ఎంత మదమెక్కిందనిఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మృతి, మోడీ, యోగి హత్యలని అన్నారు. పథకం ప్రకారం జరిగిన హత్యలని విమర్శించారు. 11 నెలలుగా జరుగుతున్న రైతు ఉద్యమాన్ని హత్యల ద్వారా అణచివేయాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. అయితే ఇది సాధ్యం కాదని అన్నారు. యూపీ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని, అక్కడ రాజ్యాంగం అమలవ్వటం లేదని, అధికారులు, ప్రభుత్వం ప్రజల పక్షాన పని చేయటం లేదని, కనుక సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని, సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేల్కొనాలని, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంత మంది రైతులు మరణిస్తుంటే, ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిచారు. రైతు పోరాటంలో భాగస్వామ్యం కావాలని, రైతులపై జరుగుతున్న దాడులను ఖండించాలని కోరారు. రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయాలను కేంద్రాన్ని ప్రశ్నించాలని, అందుకు జరుగుతున్న ఉద్యమంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావాలని కోరారు. అలా చేయకపోతే బీజేపీ పాపాల్లో మీరు కూడా భాగం పంచుకున్నట్లు ప్రజలు భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.