Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- వారంరోజుల్లో రూ.2.15 పెరిగిన డీజిల్
- రూ.1.25 పెరిగిన పెట్రోల్
న్యూఢిల్లీ : లీటర్ పెట్రోల్, డీజిల్ ధర వంద రూపాయలు దాటినా..ధరల పెంపు ఆగటం లేదు. ఇటీవల మూడు రోజులు వరుసగా ఇంధన ధరలు పెరిగాయి. ఆల్ టైం రికార్డ్ స్థాయికి ఇంధన ధరలు చేరుకున్నాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ.102,39, డీజిల్ రూ.90.77కాగా, హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.106.51, డీజిల్ రూ.99.04కు చేరుకున్నాయి. నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఈ ధరల పెంపు సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యావసర సరుకుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇది సగటు కుటుంబంపై, వాహనదారులపై మోయలేని భారంగా మారుతోంది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఇంధన ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 24 తర్వాత 8మార్లు ఇంధన ధరలు పెరిగాయి. వారం రోజుల్లో లీటర్ డీజిల్ ధర రూ.2.15, పెట్రోల్ ధర రూ.1.25 పెరిగింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినవేళ దేశీయంగా చమురు కంపెనీలు ధరలపై నిర్ణయం తీసుకుంటున్నాయని, ఇందులో కేంద్రం జోక్యం లేదని పెట్రోలియం కార్యదర్శి తరుణ్ కపూర్ తాజాగా మీడియాకు తెలిపారు.