Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల 'ఆర్థిక రహస్యాలు' బహిర్గతం
- వీరిలో పలు దేశాల అధినేతలు కూడా..!
- విడుదల చేసిన ఐసీఐజే
- భారత్ నుంచి 380 మంది పేర్లు
న్యూఢిల్లీ : భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ధనవంతులు, శక్తిమంతులు, రాజకీయనాయకులు సహా పలువురు ప్రముఖుల రహస్య, అక్రమ, అనైతిక ఆర్థిక లావాదేవీలు, ఆస్థులు, కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని 'పండోరా పేపర్స్' లీక్ చేసింది. ఇందులో పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు మొదలు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులకు చెందిన రహస్య లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఉన్నది. ప్రముఖుల ఆర్థిక అవకతవకలు, లావాదేవీలకు సంబంధించి ఇప్పటి వరకు లీకైన అతిపెద్ద సమాచారంగా నిపుణులు దీనిని భావిస్తున్నారు. ఈ రహస్య డాక్యుమెంట్లను ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) బయటపెట్టింది. ఈ పేపర్లలో దాదాపు 380 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలే కావడం గమనార్హం. దీంతో ఈ పండోరా పేపర్స్ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది.
1.20 కోట్ల పత్రాలు పరిశీలన
పన్నుఎగవేతకు స్వర్గధామమైన పనామా, దుబారు, మొనాకో, స్విట్జర్లాండ్, సెమన్ ఐలాండ్స్ సహా పలు ప్రాంతాలలోని 14 కంపెనీలు, 29వేల ఆఫ్‌షోర్ కంపెనీలు, ట్రస్టుల యజమానులకు సంబంధించిన సమాచారంతో కూడిన దాదాపు 1.20 కోట్ల (12 మిలియన్ల డాక్యుమెంట్లు) పత్రాలను (దీని పరిమాణం 2.94 టెరాబైట్లు) రెండు ఏండ్ల క్రితం ఐసీఐజే సేకరించి పరిశీలించింది. ఇక భారత్‌కు సంబంధించిన సమాచారాన్ని ' ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఒక ఏడాది పాటు దర్యాప్తు చేసింది. ఐదేండ్ల క్రితం 'పనామా పేపర్లు' ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ఆర్థిక అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టిన విషయం తెలి సిందే. అయితే, 'పండోరా పేపర్స్' లీక్ మాత్రం అంతకు మించిన సమాచారాన్ని బహిర్గతం చేసినట్టుగా ఆర్థిక నిపు ణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లోని 150కి పైగా వార్తసంస్థల్లోని 600 మంది జర్నలిస్టులు ఇందులో భాగమయ్యారు. కాగా, భారత్‌కు చెందిన 380 మంది పేర్లలో 60 మంది ప్రముఖ వ్యక్తులు, కంపెనీల 'ఆఫ్‌షోర్ హౌల్డింగ్స్' దర్యాప్తుతో పాటు ధృవీకరించబడ్డాయి. వీటి వివరాలు రానున్న రోజుల్లో బహిర్గతం కానున్నాయి.
- పండోరా పేపర్స్ వెల్లడించిన పేర్లలో రిలయన్స్ ఏడీఏ గ్రూపు (అడాగ్) చైర్మెన్ అనిల్ అంబానీ, ఆయన ప్రతినిధుల పేర్లు ఉన్నాయి. వీరికి జెర్సీ, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ), సైప్రస్ లలో కనీసం 18 ఆఫ్‌షోర్ కంపెనీలు కలిగి ఉండటం గమనార్హం. కాగా, గతేడాది ఫిబ్రవరిలో చైనాకు చెందిన మూడు ప్రభుత్వ నియంత్రిత బ్యాంకులతో వివాదం సమయంలో తన నెట్‌వర్త్ సున్నా అని లండన్కోర్టుకు అనిల్ అంబానీ పేర్కొన విషయం తెలిసిందే.
- ఇక పరారీలో ఉన్న పన్ను ఎగవేతదారు, ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోడీ సోదరి పేరు పండోరా పేపర్లో ఉన్నది. ఆయన భారత్‌ను వీడటానికి నెల ముందు ఆయన సోదరి ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు.
- బయోకాన్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందర్ షా పేరు కూడా ఉన్నది. ఇన్సైడర్ ట్రేడింగ్ అభియోగాలపై సెబీ నిషేధాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తితో కలిసి ఆయన ట్రస్టును నెలకొల్పారు.
- ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు కూడా వినిపించింది. అయితే, విదేశాల్లో ఆయన పెట్టుబడులన్నీ చట్టబద్ధమైనవేననీ, పన్ను సంస్థలకు అన్ని విరాలు సమర్పించారని స్పష్టం చేశారు.
- భారత బిలియనీరు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ షా అదానీ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఒక కంపెనీని 2018లో ఏర్పాటు చేశారు. ఇప్పటి పండోరా పేపర్లలోనే కాదు, 2016లో వెలువడిన పనామా పత్రాల్లోనూ ఆయన పేరు వినబడటం గమనార్హం. వీరితో పాటు కార్పొరేటు లాబీయిస్ట్ నీరారాడియా, గాంధీ కుటుంబ సన్నిహితుడు కెప్టెన్ సతీశ్ శర్మ, ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌తో పాటు పలువురు పేర్లు ఇందులో ఉన్నాయి.
- బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆయన భార్య లండన్‌లో కార్యాలయం కొనుగోలు సమయంలో రూ. 3.14 కోట్ల ప్రయోజనాన్ని పొందినట్టు పండోరా పేపర్స్ వివరించింది.