Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ మారణహోమంపై ప్రజాగ్రహం
- లఖింపూర్‌లో ఆంక్షలు...144 సెక్షన్ విధింపు
- ఇంటర్ నెట్ నిలివేత..ముఖ్యమంత్రులకు అనుమతి నిరాకరణ
- మృతుల కుటుంబాల పరామర్శకు అడ్డగింత
- అఖిలేశ్ యాదవ్, ప్రియాంక తదితరులు నిర్బంధం
- రాష్ట్రపతికి ఎస్కేఎం లేఖ
- రైతు ఉద్యమానికి దిగొచ్చిన యోగి సర్కార్
- రాజీనామా చేయించండి...లేదంటే తొలగించండి : ఎస్కేఎస్, ఏఐఎడబ్ల్యూయూ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులను బీజేపీ నేతలు హత్య చేసిన ఘటనను ఖండిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చిన దేశవ్యాప్త ఆందోళనలు అన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా జరిగాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాలుగు ప్రధాన డిమాండ్ల కోసం అన్ని రాష్ట్రాల్లో కలెక్టర్ కార్యాలయాలు, అనేక చోట్ల ఇతర ప్రదేశాల్లో నిరసనలు జరిగాయి. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆందోళన జరిగాయి. ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘు వద్ద మౌన నిరసన కవాతు నిర్వహించారు. హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర, చండీగఢ్‌తో పాటు ఇతర ప్రదేశాలలో కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. పురన్పూర్తో పాటు ఇతర ప్రాంతాల్లో రైతుల నిరసనలతో రహదారులు కిటకిటలాడాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న పౌరులు బీజేపీ నేతలు అనుసరిస్తున్న హింస పూరిత రైతు వ్యతిరేక వైఖరిని ప్రశ్నించారు. కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాని తక్షణమే తొలగించాలని, మంత్రి కుమారుడిని, అతని సహచరులను తక్షణమే అరెస్టు చేయాలని, సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా టెనితో పాటు మరో 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, ఎవరినీ అరెస్టు చేయలేదని ఎస్కేఎం విమర్శించింది. రైతుల పోరాటంలో శాంతి, అహింసను పాటించాలని పౌరులందరికి ఎస్కేఎం విజ్ఞప్తి చేసింది. హింస, మతపరమైన రాజకీయాలు తీసుకురావడం ద్వారా ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి బీజేపీ వేసిన ఉచ్చులో పడొద్దని నిరసనకారులను ఎస్కేఎం కోరింది. రైతులపై హంతక దాడికి యూపీ పోలీసుల సహకారంతోనే ముందుగానే ఎలా ప్లాన్ చేశారో తెలుస్తుందని ఎస్కేఎం పేర్కొంది. స్వయంగా మహీంద్ర థార్ కారును నడుపుతున్న మంత్రి కుమారుడి వాహనాల శ్రేణికి, రైతులను విచక్షణారహితంగా కొట్టడానికి అనుమతిస్తూ పోలీసులు బారికేడ్లను తొలగించారని ఎస్కేఎం స్పష్టం చేసింది. ఆ తరువాత రైతులు ప్రతీకారం తీర్చుకున్నారని సమాచారం పోలీసుల వద్ద ఉన్నదనీ, ఘటనా స్థలం నుంచి తప్పించుకోవడంలో ఆశిష్ మిశ్రా టెనిని పోలీసులు రక్షణగా నిలిచారని తెలిపింది. అతను తప్పించుకున్నందున అతను కాల్పులు జరిపినట్టు చిత్రీకరించారని ఎస్కేఎం నేత తజీందర్ సింగ్ విర్క్ తెలిపారు.
లఖింపూర్‌కు వెళ్లకుండా అడుగడుగునా ఆంక్షలు...
యూపీలోని లఖింపూర్ ఖేరీలో రైతులపై బీజేపీ నేతల దాడిని నిరసిస్తూ ఆందోళన కొనసాగింది. నలుగురు రైతుల మృతదేహాలను ఆదివారం రాత్రి వందలాది మంది రైతులు మృతి చెందిన రైతుల వారి కుటుంబాలు టికునియా కళాశా ల మైదానంలో ఉంచారు. రైతులపై దాడి జరిగిన ప్రాంతం లో అమరవీరులైన రైతుల.....మృతదేహాలు ఉంచి వేలాది మంది రైతులు ఆందోళన చేపట్టారు. హర్యానా, యూపీలోని ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు అక్కడికి చేరు కొని జరుగుతున్న రైతు ఆందోళనకు సంఘీభావం ప్రకటిం చారు. వివిధ రైతు సంఘాల నేతలు అక్కడి చేరుకొని ఆందోళనలో భాగస్వామ్యం అయ్యారు. మరోవైపు యోగి ప్రభుత్వం లఖింపూర్ ఖేరి వివిధ ఆంక్షలు విధించింది. ఇంట ర్నెట్ సర్వీసును నిలిపిచేసింది. 144 సెక్షన్ విధించింది. పంజాబ్ నుంచి లఖింపూర్ కు ఎవరూ రాకుండా అనుమతి నిరాకరించింది. కొంతమంది విమానాశ్రయాల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినా..అనుమతిఇవ్వలేదు. రైతులపై కాల్పులు, వాహనాలతో తొక్కించడంతో నలుగురు రైతులు...మృతి చెందిన లఖింపూర్ ఖేరి ను సందర్శించేందుకు ప్రయత్నించిన సామాజిక కార్యకర్తలను, రాజకీయ నేతలను అడ్డుకునేందుకు అప్రజాస్వామ్య విధానాలను యూపీ ప్రభుత్వం అవలంభించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజ్యసభ ఎంపీ దీపేంద్ర హుడా,కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆప్ రాజ్యసభ పక్ష నేత సంజరు సింగ్, భీం ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్, ఎఐకెస్ ముగ్గురు సభ్యులబృందం నేతలు డిపి సింగ్, ముకుల్ సింగ్, చంద్రపాల్ సింగ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్కేఎం నేతలు గుర్నమ్ సింగ్ చాదుని, బూటా సింగ్ బుర్జ్‌గిల్ వంటి నేతలు లఖింపూర్ ఖేరీ లోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. గుర్నామ్ సింగ్ చాదుని మీరట్లోనే అరెస్టు చేశారు. పంజాబ్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు చరణ్ జిత్ చన్ని, భూపేష్ భగేలా, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్ జంధర్లకు యోగి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ''నేను అరెస్టు అయ్యా. కానీ నిందితులు ఫ్రీగా తిరుగుతున్నారు'' అని ప్రియాంక గాంధీ అన్నారు.
యూపీభవన్ వద్ద ఆందోళన... ప్రజా సంఘాల నేతలు అరెస్టు
లఖింపూర్ ఆందోళనను నిరసిస్తూ ఢిల్లీలోని ఉత్తరప్రదేశ్ భవన్ వద్ద వివిధ ప్రజా సంఘాలు, యూత్ కాంగ్రెస్ ఆందోళన నిర్వహించాయి. తొలుత అసోం భవన్ నుంచి ఉత్తరప్రదేశ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. మార్గ మధ్యలో నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా, నిరసనకారులు వాటిని నెట్టుకుంటూ ఉత్తరప్రదేశ్ భవన్ కు చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేపట్టారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. రైతుల హత్యలను ఆపాలని, రైతులకు న్యాయం చేయాలని, యూపీ సీఎం రాజీనామా చేయాలని, కేంద్ర హౌం మంత్రి అజరు మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డు చేబూని పెద్ద పెట్టున నినాదాలు హౌరెత్తించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ప్రజా సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిఆర్పిఎఫ్, ఢిల్లీ పోలీసులు అరెస్టులకు పూనుకున్నారు. దీంతో ప్రతిఘటించిన నేతలను, కార్యకర్తలను రోడ్డుపైన ఈడ్చుకుంటూ పోలీసు వాహనాల్లోకి విసిరిపారేశారు. వాహనాల్లో ఉన్న అరెస్టు అయిన వారిని కూడా వదలకుండా కుక్కి కుక్కి వదిలారు. దీంతో పోలీస్ దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. అరెస్టు చేసిన వారిని మందిర్ మార్గ పోలీసు స్టేషన్ కు తరలించారు.అరెస్టు అయిన వారిలో ఎఐకెఎస్ కోశాధికారి పి కృష్ణ ప్రసాద్, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, ఐద్వా ఢిల్లీ కార్యదర్శి ఆశా శర్మ, ఎస్ఎఫ్ఐ నేతలు ప్రతీష్, యుట్కర్ష్, డివైఎఫ్ఐ నేతలు అమన్ సాయిని, మనోజ్ కుమార్ లతో పాటు వంద మంది వరకు ఆయా సంఘాల కార్యకర్తలు ఉన్నారు. మరోవైపు దాదాపు వంద మంది యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే సీపీఐ కార్యాలయం నుంచి యూపీ భవన్‌కు ర్యాలీ చేపట్టిన సీపీఐ నేతలను ఐటీఓ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎఐకెఎస్ (అజరు భవన్) ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్, రాజ్యసభ ఎంపీ బినరు విశ్వం, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్, సీపీఐ కార్యదర్శులు కె.నారాయణ, బాల చంద్ర కాంగో, ఎఎఫ్ఐడబ్ల్యు ప్రధాన కార్యదర్శి అనీ రాజా, సీపీఐ యూపీ, ఢిల్లీ కార్యదర్శులు గిరీష్ శర్మ, దినేష్ తదితరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సీఎం యోగికి బీజేపీ ఎంపీ లేఖ
లఖింపూర్ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌కు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ లేఖ రాశారు. రైతులను చంపిన నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో నిర్ణీత సమయంలో సిబిఐ విచారణ జరపాలని కోరారు. మరణించిన రైతులకు సంతాపం తెలపాలని, బాధిత రైతు కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని కోరారు. వెంటనే అనుమానితులను గుర్తించాలని, అలాగే హత్య కేసు నమోదు చేయాలని కోరారు.
జోక్యం చేసుకోండి... ఎస్కేఎం లేఖ
రాజ్యాంగ విఘాతం కలిగించే విధంగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో జరిగిన ఘటనపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కోరింది. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎస్‌కెఎం లేఖ రాసింది. వాహనాలతో కుమ్మించి రైతులను దారుణంగా చంపిన ఘటనతో దేశం మొత్తం ఆగ్రహానికి గురైందని, కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి, ఆయన కుమారుడు గూండాలతో ఈ దారుణమైన దాడికి పాల్పడ్డారని పేర్కొం ది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాల కుట్రను స్పష్టం చేస్తుందని, అజరు మిశ్రా ఇప్పటికే రైతులను హెచ్చరిస్తూ ప్రసంగాలు చేశారని, అందులో భాగంగానే ఈ దాడి జరిగిందని తెలిపింది. అదే రోజు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పార్టీ కార్యర్తలను లాఠీలు తీసుకొని రైతులపై హింసకు పాల్పడటానికి బహిరంగా ప్రేరేపించారని ఎస్కేఎం పేర్కొంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆందోళన చేస్తున్న అన్నదాతలపై ప్రణాళికాబద్ధమైన హింస కోసం తమ స్థానాలను ఉపయోగించారని స్పష్టమవుతుందని, దేశంలోని చట్టాల ప్రకారం ఇది నేరమని, అందువల్ల ఎస్కేఎం నాలుగు అంశాలను డిమాండ్ చేస్తుందని రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొంది. కేంద్ర హౌం మంత్రి అజరు మిశ్రా టెనిని తక్షణమే తన పదవి నుండి తొలగించాలి, హింసను ప్రేరేపించినందుకు, మత విద్వేషాన్ని వ్యాప్తి చేసినందుకు అతనిపై కేసు పెట్టాలి. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా, అతని సహచర గూండాలపై వెంటనే హత్య కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలి. ఈ సంఘటనపై దర్యాప్తును సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు వేయాలి. రాజ్యాంగ పదవిని నిర్వహిస్తూ హింసను ప్రేరేపిస్తున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను పదవి నుండి తొలగించాలని కోరింది.
రైతుల ఉద్యమానికి దిగొచ్చిన యోగి ప్రభుత్వం
రైతుల ఉద్యమానికి యోగి ప్రభుత్వం దిగొచ్చింది. ప్రభుత్వంతో రైతు సంఘాల నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రైతు ఉద్యమ తీవ్రత నేపథ్యంలో రైతుల డిమాండ్లకు యోగి ప్రభుత్వం అంగీకరించింది. పోస్ట్‌మార్టం తరువాత అమరులైన రైతుల అంత్యక్రియలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మృతి చెందిన నలుగురు రైతు కుంటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.45 లక్షల పరిహారం, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు యోగి ప్రభుత్వం అంగీకరించింది. అలాగే గాయపడిన రైతులకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చేందుకు సమ్మతించింది. కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా టెనిపై సెక్షన్ 120 బి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అంగీకరించింది. కేంద్ర మంత్రి తనయుడు ఆశీష్ మిశ్రా టెని, మరో 15 మంది అనుచరులపై సెక్షన్ 302, 120 బి కింద కేసు నమోదు చేసేందుకు అంగీకారం తెలిపింది. లఖింపూర్ ఘటనపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేందుకు అంగీకరించింది. కేంద్ర మంత్రి పదవి నుంచి అజరు మిశ్రా టెని తొలగించాలనే డిమాండ్ పెండింగ్‌లో ఉంది.