Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏడాది అక్టోబర్ 14 నుంచి 18 వరకు
- మీడియా సమావేశంలో ప్రకటించిన సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
న్యూఢిల్లీ : సీపీఐ 24వ అఖిల భారత మహాసభలు 2022 అక్టోబర్ 14 నుంచి 18 వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనున్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. ఈ నెల 2 నుంచి 4 వరకు మూడు రోజుల పాటు సీపీఐ ప్రధాన కార్యాలయం (అజరు భవన్)లో మాజీ ఎంపి నరేంద్రనాథ్ ఓజా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ నేషనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ ఎంపీ బినరు విశ్వం, జాతీయ కార్యవర్గ సభ్యులు అతుల్ కుమార్ అంజన్తో కలిసి ప్రధాన కార్యదర్శి డి.రాజా నేషనల్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలను వెల్లడించారు. తమ పార్టీ అఖిల భారత మహాసభలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంతకు ముందు క్షేత్రస్థాయి శాఖ నుంచి రాష్ట్ర మహాసభల వరకు నిర్వహించనున్నామని చెప్పారు. అలాగే రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కూడా చర్చించామనీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవాల్లో తమ పార్టీ రాజకీయ పంథాకు అనుగుణంగా ఎన్నికల పొత్తులు ఉంటాయని తెలిపారు.
తమ ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించడమేనన్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వం చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించిందని, లఖింపూర్ సంఘటనే యోగి అసమర్థతను స్పష్టం చేస్తుందని విమర్శించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఈ నెల 11 వరకు ఆందోళనలకు తమ పార్టీ పిలుపు ఇచ్చిందని అన్నారు. అక్టోబర్ మహా విప్లవం (నవంబర్ 7) సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ అన్ని యూనిట్లు విప్లవ దినోత్సవం నిర్వహించాలని కౌన్సిల్ నిర్ణయించిందని తెలిపారు. అలాగే రాజ్యంగం, సామాజిక న్యాయం పరిరక్షణకు నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు దేశవ్యాప్త ప్రచారోద్యమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.