Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఖేరి ఘటనలో బీజేపీ నేతల కండకావరం
- వీడియో ఫుటేజీల్లో తేటతెల్లం
- కారును నడిపింది మంత్రి కుమారుడే : గాయపడిన రైతు వెల్లడి
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీలో రైతులపై దాడి ఒక పథకం ప్రకారం జరిగిందేనని తాజాగా వెలుగుచూసిన వీడియో ఫుటేజీల్లో తేటతెల్లమైంది. నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న రైతులను వెనుకవైపు నుంచి కారుతో తొక్కించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా తనయుడి ఘాతుకాన్ని కండ్లకు కట్టినట్టు చూపిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా కండకావరాన్ని 25 నిమిషాల నిడివి కలిగిన ఆ వీడియో బయటపెట్టింది. వెనుక నుంచి ఢకొీట్టడంతో రైతులు తప్పించుకునేందుకు వీల్లేక కారు చక్రాల కింద పడి నలిగిపోవడం, ఊహించని ఈ పరిణామంతో మిగతావారు చెల్లాచెదురై అటు ఇటు పరుగులు తీస్తున్న దృశ్యాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంత్రి తనయుడి ఎస్యూవీ కారును సైరన్ మోగిస్తూ మరో వాహనం అనుసరించడాన్ని అందులో చూడొచ్చు. ఘటనా స్థలిలో ఏం జరిగింది..? అనే విషయమై రైౖతులు ఎన్డీటీవీకి వివరించిన అంశాలకు ఈ వీడియో మరింత బలం చేకూర్చింది. కారు అకస్మాత్తుగా వెనక నుండి ఢ కొట్టిందని మీడియాతో రైతులు చెప్పారు. లెడ్ కలర్లో ఉన్న ఎస్యూవీ వాహనం అని రైతులు చెప్పగా, ఈ వీడియోలో కూడా ఆ వాహనం కూడా అదేరంగుతో ఉన్నది. అలాగే శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న రైతులపై ఈ రెండు వాహనాలు ఆగకుండా దూసుకెళ్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. ఊహించని ఈ పరిణామంతో రైతులంతా చెల్లాచెదురైనట్టు నమోదయింది. ఈ వీడియోను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే రైతులను తొక్కించి చంపేసిన బీజేపీ నేతల కండకావరంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కారును నడిపిందే మంత్రి కుమారుడే
లఖింపూర్ ఖేరీలో రైతులపై దూసుకొచ్చిన కారును డ్రైవ్ చేసిందని కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశీషేనని ఆ ఘటనలో గాయపడ్డ రైతు ఒకరు స్పష్టం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తెజిందర్ విర్క్ ప్రస్తుతం మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగి 72 గంటలు గడిచినా ఆశీష్ను పోలీసులు అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని విర్క్ అన్నారు. లఖింపూర్ ఖేరీలో ఆందోళనకు నాయకత్వం వహించినవారిలో విర్కే ఒకరు. ఈ ఘటన గురించి విర్క్ మీడియాకు వివరిస్తూ 'మమల్ని చంపడానికి కుట్ర పన్నారు. లఖింపూర్తో సహా ఉత్తరప్రదేశ్లోకి రైతుల్ని అనుమతించమని కేంద్ర మంత్రి అజరు మిశ్రా బెదిరిస్తూ గత నెలలో ఒక ప్రకటన చేశారు. దీనికి వ్యతిరేకంగా మేం వ్యతిరేకించాం. అతను వెళ్లే మార్గం వెంబడి నల్లజెండాలతో నిలబడిఉన్నాం. అయితే మార్గం మార్చుకున్నట్టు మధ్యాహ్నం 3 గంటల సమయంలో తెలిసింది. దీంతో మేం వెనక్కి వెళుతున్నాం. ఇంతలోనే వేగంగా వచ్చిన కార్లు మమల్ని వెనక నుంచి ఢ కొట్టాయి.ఆ కారులో మంత్రి కుమారుడు, అతని అనుచరులు ఉన్నారు. తరువాత నేను స్పృహ కోల్పోయాను' అని విర్క్ చెప్పారు. అజరు మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.