Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యత కలిగిన హోదాలో నేరపూరిత కుట్ర
- ప్రధాని మోడీకి సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం లేఖ
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరిలో నలుగురు రైతులు హత్యకు గురైన నేపథ్యంలో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోడీని సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని మోడీకి కరీం లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు అత్యంత దారుణ హత్యకు గురైన వార్త విని యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైందని పేర్కొన్నారు. కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా టెని, ఆయన కుమారుడి వాహన శ్రేణి దూసుకెళ్లడంతోనే అన్నదాతలు చనిపోయారని తెలిపారు. మంత్రి కాన్వారు దూసుకెళ్లినట్టు స్పష్టమైన వీడియో ఆధారాలు ఉన్నాయనీ, సైరన్లు మోగిస్తూ రైతుల ఆందోళనపైకి దూసుకెళ్లి వారిని చంపారని పేర్కొన్నారు. ప్రజల జీవితాలను కాపాడాల్సిన బాధ్యత కలిగిన ఒక కేంద్ర మంత్రి, తన కొడుకుతో కలిసి రైతులపై వాహనాలు నడుపుతూ వారిని హత్య చేసే నేరపూరిత కుట్రలో భాగం కావడం దురదృష్టకరం, ఖండించదగినదని ప్రస్తావించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై సెప్టెంబర్ 25న బెదిరింపులు, హింసను ప్రేరేపించడం ద్వారా అజయ్ మిశ్రా టెని అన్ని ప్రజాస్వామ్య నిబంధనలను, దేశ ప్రజల పట్ల తన బాధ్యతను నిర్మోహమాటంగా ఉల్లంఘించారని స్పష్టమయిందని తెలిపారు. అతని కుమారుడు హత్యకాండ తర్వాత కూడా మంత్రి ఈ దారుణాన్ని సమర్థించుకున్నాడనీ, రైతులను నిందించాడని వివరించారు. గాయపడిన, చంపిన రైతులను ''బయటి వ్యక్తులు'' అని ఆరోపించాడనీ, తనను, తన మద్దతుదారులను రక్షించడానికి ''ఖలిస్తానీ'' అంశాల ప్రమేయం ఉన్నదని చెప్పాడని తెలిపారు. హౌం శాఖ సహాయ మంత్రిగా అతని ఉండటంతో ఎటువంటి విచారణ అయినా నిష్పాక్షికంగా ఉండదనీ, అందువల్ల కేంద్ర మంత్రిగా ఆయనను తక్షణమే తొలగించాలని కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. .