Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగారాన్ని అమ్మి..కడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు
- కోవిడ్ సంక్షోభం తర్వాత పెరిగిన బంగారంపై రుణాలు
- బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్..రూ.3.54లక్షల కోట్లు
- కొత్త బ్రాంచ్లు తెరుస్తున్న ప్రయివేటు కంపెనీలు
దేశంలో ప్రజల్ని కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక అవసరాలు, అప్పుల బాధ నుంచి బయటపడటానికి పేద, మధ్య తరగతి కుటుంబాలు బంగారాన్ని కుదవపెడుతున్నాయి. గత రెండేండ్లలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో, ఎన్బీఎఫ్సీ కంపెనీల్లో(ముత్తూట్, మణప్పురం, బజాజ్ ఫైనాన్స్..) గోల్డ్ లోన్ ఖాతాలు భారీగా పెరిగాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
న్యూఢిల్లీ : గత ఏడాది తొలి అర్థభాగంలో బంగారంపై ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు ఇచ్చిన రుణాల మొత్తం రూ.1.9లక్షల కోట్లుకాగా, ఈ ఏడాది (2021)లో అలాంటి రుణాలు రూ.3.54లక్షల కోట్లుకు పెరిగాయి. మణప్పురం, ముత్తూట్..తదితర ఎన్బీఎఫ్సీ కంపెనీల్లో తీసుకున్న బంగారు రుణాల ఎంతున్నాయన్న సమాచారం ఇంకా బయటకు రాలేదు. మార్కెట్ నిపుణుల ప్రకారం, మొత్తం బంగారం రుణాల్లో 65శాతం వాటా ఎన్బీఎఫ్సీ కంపెనీల(ముత్తూట్, మణప్పురం..మొదలైనవి)దేనని తెలిసింది. అంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వద్ద బంగారు రుణాలు పరిగణనలోకి తీసుకుంటే భారీ మొత్తమే ఉంటుందని అర్థమవుతోంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక అవసరాల్ని తీర్చుకోవడానికి నేడు అనేకమంది బంగారాన్ని కుదవపెట్టాల్సి వస్తోంది.
ఇంటి కిరాయి, ఈఎంఐ కట్టాలన్నా..
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో చాలామటుకు కనీసం ఇంటి కిరాయిని సైతం కట్టలేక అప్పులు చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. నెల దాటేసరికి..చేతిలో డబ్బులు లేక బంగారాన్ని కుదవపెట్టి లేదా అమ్మేసి ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతున్నారు. ఇంటి కిరాయి చెల్లించేందుకు, వ్యక్తిగత రుణం ఈఎంఐ కట్టేందుకు, డయాలసిస్ చేసుకునేందుకు.. బంగారం రుణం తీసుకునేవారున్నారని సర్వేలో తేలింది. గతంతో పోల్చితే దేశంలో గోల్డ్ లోన్ ఖాతాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
పోటీ పడుతున్న కంపెనీలు
బంగారంపై రుణాలు ఇచ్చేందుకు పలు ప్రయివేటు కంపెనీలు పోటీ పడుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ముత్తూట్ ఫైన్కార్ప్ కొత్తగా 100 బ్రాంచ్లను ప్రారంభించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే బజాజ్ ఫైనాన్స్ తన శాఖల సంఖ్యను 480 నుంచి 700కు పెంచింది. రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించటంలో విఫలమైతే, కుదవపెట్టిన బంగారాన్ని సదరు కంపెనీ వేలం వేస్తోంది. బ్యాంకులు, ప్రయివేటు సంస్థలు, ఎన్బీఎఫ్సీ కంపెనీలు బంగారాన్ని వేలంపాట వేయటం ఈమధ్యకాలంలో భారీగా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు మణప్పురం ఫైనాన్స్ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో 4.5టన్నుల బంగారాన్ని వేలంపాట ద్వారా అమ్మేసింది. తద్వారా సంస్థ రూ.1500కోట్లు రాబట్టుకుందని సమాచారం.తిరిగి చెల్లించే పరిస్థితి కూడా లేదు..
మార్కెట్లో ఆర్థిక నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, గోల్డ్ లోన్ తీసుకున్నవారిలో దాదాపు 30శాతం మంది తిరిగి రుణ మొత్తాన్ని చెల్లించలేకపోతున్నారని, కుటుంబాల ఆదాయం దెబ్బతినటమే దీనికి కారణమని వారు విశ్లేషించారు. రుణాన్ని చెల్లించ లేకపోతున్నవారిలో ఎక్కువగా ప్రయివేటు వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాలున్నాయి. రుణాన్ని తీసుకున్నాక అసలు, వడ్డీ కట్టడం..సమస్యగా భావించిన చిన్న చిన్న వ్యాపారాలు, మధ్య తరగతి బంగారాన్ని పూర్తిగా అమ్మేసేందుకు మొగ్గుచూపుతున్నారు.