Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం
- ఎన్జీటీ ముందు వాదనలు
న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై తమ వైఖరి ఏమిటో తెలపాలని కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. బుధవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. తాగునీటి కోసం అంటూ అధిక సామర్థ్యమున్న రిజర్వాయర్లను తెలంగాణ ప్రభుత్వం కడుతున్నదనీ, అయితే అసలు ఉద్దేశం మాత్రం సాగునీటి కోసమేనని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తన వైఖరి వెంటనే చెప్పాలని ఏజీ శ్రీరామ్ తెలిపారు. కేంద్రం వైఖరి చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ధర్మాసనానికి విజ్ఞప్తిచేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనమతులు లేవంటూ ఏపీ రైతులు డి.చంద్రమౌళీశ్వర రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు వాదనలు వినిపిస్తూ.. ఎన్జీటీలో పిటిషన్దాఖలుకు ఆరు నెలల కాలపరిమితి ఉంటుందనీ, ఆ సమయం మించి దాఖలు చేసిన పిటిషన్లను విచారించరాదని తెలిపారు. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసి కూడా ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామన్నారు.
పర్యావరణ అనమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్రావు తెలిపారు. వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేండ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్లు కడుతున్నదని చెప్పారు. ప్రాజెక్టు సమీప 13 మండలాలు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలనీ, భూగర్భజలాలు వినియోగం వల్ల ఇబ్బందుల వస్తున్న నేపథ్యంలోనే భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలుత అండర్టేకింగ్ ఇచ్చినట్టుగా తాగునీటి కోసమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని రాంచందర్రావు స్పష్టం చేశారు. ఈ కేసులో వైఖరి చెప్పాలన్న అంశంపై కేంద్రం తరపు న్యాయవాది స్పందిస్తూ.. ప్రాధమిక దశలోనే విచారణ ఉందని తుది విచారణలో తప్పకుండా వైఖరి వెల్లడిస్తామని ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం వింటామన్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.