Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల్లో వివాదాస్పదమవుతున్న 'సీఎస్' నియామకం
- నిబంధనలు పక్కకు పెడుతున్న పాలకులు
- జయలలిత నుంచి అమరీందర్ సింగ్ వరకూ అదే పంథా
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో...ఐఏఎస్ అధికారులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 310లో వీరి ప్రస్తావన స్పష్టంగా ఉంది. దేశ పాలనలో అత్యంత కీలకమైన 'కార్యనిర్వాహక శాఖ'ను చూసేది ఐఏఎస్‌లే. కేంద్రంలో కార్యనిర్వాహక శాఖకు నేతృత్వం వహించేది ప్రధాని, రాష్ట్రంలో సీఎం...వీరి ఆదేశాల్ని అమలుజేసేది ఐఏఎస్‌లే. రాష్ట్రాల్లో జిల్లా కలెక్టర్లను, 24శాఖల కార్యదర్శులను..అజమాయీషీ చేసే కీలకమైన స్థానం 'చీఫ్ సెక్రటరీ'(సీఎస్). అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారిని సీఎస్‌గా రాష్ట్ర సీఎం ఎంపిక చేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 310, అఖిల భారత సర్వీస్ నిబంధనలు కూడా అదే చెబుతున్నాయి. విచిత్రం ఏంటం టే..నిబంధనల ప్రకారం ఎక్కడా సీఎస్ ఎంపిక జరగటం లేదు. ప్రత్యక్ష ఉదాహరణ తాజాగా జరిగిన పంజాజ్ సీఎస్ నియామకమే! ఆ రాష్ట్రంలో అమరీందర్ సింగ్ పదవి నుంచి దిగిపోయి..మరో సీఎం రాగానే..ఆయకు ఇష్టుడైన ఐఏఎస్‌కు సీఎస్ పదవి కట్టబెట్టారు.
జయలలితతో ట్రెండ్ మొదలు
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో సీఎస్ ఎంపిక నిబంధనల ప్రకారమే జరిగేది. చాలా సీనియర్మోస్ట్ అధికారిని సీఎస్‌గా నియమించేవారు. ఈ ఆనవాయితీని (2011లో) తమిళనాడు సీఎం జయలలిత పక్కకు పెట్టడం ఓ ట్రెండ్‌గా మారింది. ఇతర రాష్ట్రాలకూ పాకింది. 1981, 82, 83, 84 ఐఏఎస్ బ్యాచ్‌లను కాదని, 22మంది సీనియర్ అధికారులను పక్కకుపెట్టి..1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పి.రామమోహన్‌రావును సీఎస్‌గా జయలలిత నియమించటం వివాదాస్పదమైంది. 2011-16వరకు ఆయన సీఎస్‌గా కొనసాగారు. ఈ ఏడాది జూన్‌లో పశ్చిమ బెంగాల్లోనూ ఇలాంటిదే జరిగింది. 9మంది సీనియర్ ఐఏఎస్‌లను కాదని హెచ్.కె.ద్వివేదిని సీఎం మమతా బెనర్జీ ఎంపికచేశారు. తాజాగా పంజాబ్‌లోనూ పునరావృతమైంది.
పంజాబ్‌లో ఎప్పట్నుంచో..
పంజాబ్‌లో ప్రకాశ్‌సింగ్ బాదల్ హయాం నుంచి వివాదం మొదలైంది. 1997లో సీనియార్టీ నిబంధనలు పక్కకుపెట్టి సీఎస్‌ను నియమించటం మొదలైంది. అదే ఆనవాయితీని కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా అనుసరించారు. మార్చి 2017లో అధికారం చేపట్టినప్పుడు తనకు నచ్చిన అధికారికి సీఎస్ పదవి కట్టబెట్టారు. నేడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ సీఎంగా వచ్చాక, సెప్టెంబర్ 23న ఆయన నియమించిన సీఎస్ అత్యంత సీనియర్ కాదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సీఎస్ ఎంపిక నిబంధనల ప్రకారం జరగటం లేదు. తనకు అత్యంత విశ్వసనీయుడైన అధికారికి సీఎం బాధ్యతలు అప్పగించొచ్చునేమోగానీ, 'సీఎస్' వంటి ఉన్నతాధికారి హోదా నిబంధనల ప్రకారమే జరగాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిజాయితీ, పక్షపాతం లేకుండుట..మొదలైనవి పరిగణలోకి తీసుకోవాలని వారు అన్నారు.