Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లలో రూ.4,445 కోట్ల వ్యయం
- కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
- ఏపీ, తెలంగాణ ఆసక్తి
న్యూఢిల్లీ: దేశంలో ఏడు మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్, అపెరల్ పార్క్‌లకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రి వర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2021-22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న ఏడు టెక్స్టైల్ పార్క్‌లకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడు టెక్స్టైల్ పార్క్‌లకు ఐదేండ్లపాటు కేంద్ర ప్రభుత్వం రూ.4,445 కోట్లు వ్యయం చేయనుంది. ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వృద్ధిని మరింతగా పెంచటంలో ఇది సహాయపడుతుందని కేంద్రం తెలిపింది. మన దేశం లాంటి పూర్తి వస్త్ర పర్యావరణ వ్యవస్థ ఏ ఇతర దేశానికి లేదని పేర్కొంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు వివాదాలులేని వెయ్యి ఎకరాలకు పైగా భూమితో పాటు ఇతర వస్త్ర సంబంధిత సౌకర్యాలు, పర్యావరణ వ్యవస్థతో సిద్ధంగా ఉన్న ప్రతిపాదనలు అందించాలని కోరింది. గ్రీన్‌ఫీల్డ్‌కు గరిష్టంగా డవలప్మెంట్ కాపిటల్ సపోర్టు (డీసీఎస్) రూ.500 కోట్లు, బ్రౌన్‌ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.200 కోట్లు అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఈ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. ఈ పార్క్‌ల ఏర్పాటుకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, అసోం, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి.
రైల్వే ఉద్యోగులకు బోనస్
నాన్ గజిటెడ్ రైల్వే ఉద్యోగుల బోనస్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2020-21 ఏడాదికి 78 రోజుల వేతనంతో సమానమైనటువంటి ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ)కు ఆమోదం తెలిపింది. దీనిప్రకారం ఉద్యోగులకు మొత్తం రూ.1,984.73 కోట్లు చెల్లింపులు ఉంటాయి. ఒక్కొ రైల్వే ఉద్యోగికి రూ.17,951 మొత్తం అందనుంది. ఈ నిర్ణయంతో సుమారు 11.56 లక్షల మంది నాన్ గజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి పొందనున్నారు. దసరా సెలవుల కంటే ముందే చెల్లింపులు జరుగుతాయి. ఇది ప్రతి ఏటా ఇచ్చేందేనని కేంద్రం తెలిపింది.