Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ మౌనం వీడాలి : ఎస్కేఎం
- అమరులైన నలుగురు రైతుల అంత్యక్రియలు పూర్తి
- వెల్లువెత్తిన జాతీయ, అంతర్జాతీయ ఖండన
- ఉత్తరాఖండ్, హర్యానాల్లో కిసాన్ మహా పంచాయత్
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి ఘటనపై రైతు నేతలపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతు నేత తజిందర్ సింగ్ విర్క్‌పై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఎస్కేఎం ఖండించింది. ఈ కేసును వెంటనే ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేసింది. వీడియో క్లిప్‌ల్లో స్పష్టంగా చూపిస్తున్నాయనీ, తాజిందర్ విర్క్ శాంతియుతంగా రోడ్డుపై నడుస్తున్నప్పుడు వెనుక నుంచి ''థార్'' వాహనం అతనిపై దాడి చేసిందని పేర్కొంది. ఆ తరువాత ఆయనకు తీవ్ర రక్తస్రావం జరిగిందనీ, రోడ్డుపై పడిపోయి ఉన్న ఆయనను సహచర రైతులు ఆస్పత్రికి తరలించారని తెలిపారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం క్రూరమైనదనీ, వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. లఖింపూర్‌లో రైతులను హత్య చేసిన ఘటనపై ప్రధాని మోడీ మౌనం వీడాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోడీ లఖింపూర్ ఖేరీలో దిగ్భ్రాంతికరమైన పరిణామాలపై మౌనం దాల్చడాన్ని ఎస్కేఎం తీవ్రంగా ఖండించింది. రైతుల హత్యలకు కారణమైన కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలని పునరుద్ఘాటించింది. కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాపై గతంలో క్రిమినల్ కేసుల్లో ఉన్నాయనీ, బెయిల్‌పై బయట ఉన్నారని తెలిపింది. మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఎస్కేఎం హెచ్చరించింది. అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను యూపీ పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు.
ఘటనను కవర్ చేయటానికి వెళ్లి...
జర్నలిస్ట్ రామన్ కశ్యప్ మరణం మిస్టరీగా మారింది. కశ్యప్ రైతు ఆందోళనలను కవర్ చేయటానికి వెళ్లాడు. ప్రదర్శన కొనసాగుతుండగా అమాంతంగా మంత్రి తనయుడు ఉన్న కారు ఒక్కసారిగా రైతులపైకి తొక్కించాడు. ఈ దృశ్యాలను కశ్యపు చిత్రీకరించాడు. ఇది చూసిన కేంద్రమంత్రి తనయుడు గన్‌తో కాల్చాడన్న వాదన వినిపిస్తున్నది. ప్రమాదవశాత్తు చనిపోలేదని అతను కాల్పుల్లో చనిపోయాడని జర్నలిస్ట్ తండ్రి చెబుతున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదును యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్గా నమోదు చేయడంలేదనీ వాపోయాడు. బుధవారం కశ్యప్ అంత్యక్రియలు నిర్వహించారు. అతని కుటుంబమంతా రోడ్డున పడిందనీ ఎడిటర్ గిల్ట్ పేర్కొన్నది. దీనిపై సిట్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది..
అమరులైన రైతుల దహన సంస్కారాలు పూర్తి
లఖింపూర్ ఖేరీ మారణకాండలో అమరులైన నలుగురు రైతులు దహన సంస్కారాలు జరిగాయి. బహ్రాయిచ్‌లో రెండో పోస్టుమార్టం నిర్వహించిన తరువాత గుర్వీందర్ సింగ్ అంత్యక్రియలు జరిగాయి. రెండవ పోస్ట్ మార్టం నివేదిక కూడా బుల్లెట్ గాయాలను నమోదు చేయలేదు. అయితే ఆదివారం జరిగిన ఘటనా స్థలంలో కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు.
వెల్లువెత్తిన ఖండనలు
లఖింపూర్ ఖేరీ మారణకాండపై దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు స్పందించాయి. తమిళనాడు, రాజస్థాన్, కేరళ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, పంజాబ్, జార్ఖండ్, మహారాష్ట్ర మొదలైనవి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖండించారు. బ్రిటన్, కెనడాలోని పార్లమెంటేరియన్ల కూడా లఖింపూర్ ఖేరీ ఘటనపై స్పందించారు. బ్రిటన్ ఎంపీ తన్మన్జీత్ సింగ్ ధేసీ ఖండించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యూకే కు చెందిన మరో ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ కూడా ఖండించారు. కెనడా ఎంపీలు టిమ్ ఉప్పల్, రూబీ సహౌత, మనీందర్ సిద్ధూ, రణదీప్ ఎస్ సరారు, సోనియా సిద్ధూ, జస్రాజ్ సింగ్ హల్లన్ తదితర ఎంపీలు లఖింపూర్ ఘటనను ఖండించారు. తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరారు. లఖింపూర్ ఘటనను నిరసిస్తూ ఛండీగఢ్ రాజ్ భవన్ ఎదుట నిరసన చేపట్టిన ఆప్ కార్యక్తలపై వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కాగా ఉత్తరాఖండ్, హర్యానాల్లో కిసాన్ మహా పంచాయత్ నిర్వహించారు. చంపారన్ నుంచి వారణాసి వరకు లోకనీతి సత్యాగ్రహ పాదయాత్ర బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. హర్యానాలోని భివానీలో హర్యానా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జెపి దలాల్ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల వెలుపల వందలాది మంది రైతులు ఆందోళన చేపట్టారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఉత్తరాఖండ్లోనానకమట్ట బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ ప్రేమ్ సింగ్ రాణా బిజ్తి గ్రామంలో స్థానిక రైతుల నుండి నిరసన ఎదుర్కొన్నారు. రైతులు నల్ల జెండాలతో ఆందోళనకు దిగారు.