Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి 11 నిమిషాలకు ఒకరి ఆత్మహత్య
- ఈ విషయాలను పంచుకోవడానికి 60 శాతం ఇష్టపడని భారతీయులు
- ఆందోళన వ్యక్తం చేసిన యూనిసెఫ్ నివేదిక
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇంటికే పరిమితం అయినప్పటికీ.. మానసికంగా అన్ని వయస్సుల వారినీ క్రుంగదీసిందని ఇప్పటికే పలు సర్వేలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా పసి హృదయాల్లో ప్రాణాలు తీసుకునే విధంగా మానసిక రుగ్మతలు అధికమవుతున్నా యనీ, రెండు పదుల వయసుకు ముందే తీవ్ర నిర్ణయం తీసుకొనేలా పురిగొల్పుతోందని తాజాగా యూనిసెఫ్ నివేదిక ఆందోళన వ్యక్త చేసింది. 'ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ చిల్డ్రన్స్-2021' పేరిట యూనిసెఫ్ వెల్లడించిన నివేదిక వివరాల ప్రకారం.. ప్రపంచంలో యేటా 45,800 మంది 10-19 ఏండ్ల లోపు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి 11 నిమిషాలకు ఒకరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వీరిలో ఆందోళనకర స్థాయిలో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న మానసిక రుగ్మతల వల్ల ప్రపంచ దేశాలు రూ.28.87 లక్షల కోట్ల విలువైన మానవ వనరులను నష్టపోతునాయి. పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్‌లో సమస్య తీవ్రత అధికంగా ఉంది. 13 శాతం మంది 10-19 ఏండ్ల మధ్య వయస్సు వారు మానసిగ రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. వీరిలో 8.9 కోట్ల మంది బాలురు కాగా 7.7 కోట్ల మంది బాలికలు న్నారు. మానసిక సమస్యలున్న పిల్లల్లో 40 శాతం మంది ఆందోళన, కుంగుబాటుతో బాధపడుతున్నారు. మిగిలిన వారిలో ఏకాగ్రత లోపించడం, హైపర్ యాక్టివిటీ, బైపోలార్, ఆహారం తీసుకోవడంలో సమస్యలు, ఆటిజం, మేధోపరమైన లోపాలు, స్కిజోఫ్రినియా, ఇతర పర్సనాలిటీ డిజార్డర్స్ కనిపిస్తున్నాయి. సమస్యలను తోటి వారితో పంచుకొని వారి మద్దతు తీసుకోవడం మంచిదని 21 దేశాల్లోని 15-24 ఏండ్ల వయస్సు పిల్లలు అభిప్రాయపడ్డారు. మిగతా దేశాలతో పోలిస్తే ఈ విషయంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇక్కడి పిల్లల్లో 41 శాతం మంది తమ ఇబ్బందులను సన్నిహితులతో పంచుకొని మద్దతు పొందగలుగుతున్నారు.
ఈ 21 దేశాల్లో 15-24 ఏండ్ల వయస్సు వారిలో 19 శాతం మంది కుంగుబాటు సమస్యను ఎదుర్కొంటున్నారు. భారత్‌లో ఇలాంటి వారు 14 శాతం మంది ఉన్నారు. మానసిక సమస్యల పరిష్కారానికి పెద్దఎత్తున మద్దతు కావాల్సి ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యరంగానికి చేసే ఖర్చులో 2.1శాతం మాత్రమే ఇందు కోసం కేటాయిస్తున్నాయి. కొన్ని పేద దేశాలు ఒక్కో వ్యక్తి కోసం రూ.75 కంటే తక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. కాగా, బాల్యంలో పౌష్టికాహార లోపం, హింసకు గురవడంలాంటి అంశాలు మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 29 శాతం మంది పిల్లలకు కనీస తిండి కరవైంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 83 శాతం మంది పిల్లలు తమ ఆలనాపాలనా చూసేవారి చేతుల్లో హింసకు గురవుతున్నారు. 22 శాతం మంది పిల్లలు బాలకార్మికులుగా కొనసాగుతున్నారు. మానసిక ఆరోగ్యానికి సమగ్ర విధానం అవసరముందని యూనిసెప్ నొక్కి చెప్పింది.