Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్యాస్, ఇంధన ధరల పోటు
- ఇంధన ధరల్ని భారీగా పెంచుతూ పోతున్న కేంద్రం
- బుధవారం పెట్రోల్ 32పైసలు, డీజిల్ 37పైసలు పెంపు
- హైదరాబాద్‌లో లీ.పెట్రోల్ 107.09, డీజిల్ రూ.99.75
- రూ.15 పెరిగిన ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్
- గృహ వినియోగదారులు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం
మొన్నటి వరకూ కరోనా వ్యాప్తి, వార్తలు ప్రజల్ని భయపెట్టాయి. ఇప్పుడు ఇంధన ధరల పెంపు సామాన్యుడ్ని హడలెత్తిస్తోంది. బుధవారం లీటర్ పెట్రోల్ 32పైసలు, డీజిల్ 37పైసలు పెరిగి..ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వాహనం బయటకు తీయాలంటే సామాన్యుడు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.15 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.952కు చేరుకుంది. కూరగాయలు, పప్పులు, వంటనూనె, గుడ్లు, చికెన్, మటన్..ఇలా అన్నింటి ధరలూ పెరుగుతూ సామాన్యుడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడే సూచనలు కనపడటం లేదు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభ్వుత్వం ప్రతి రోజూ ఇంధన ధరల్ని ఎంతో కొంత పెంచుతోంది. పైసల్లో పెంచుతూ..లీటర్ పెట్రోల్, డీజిల్ ధరల్ని రూ.100 దాటించిన మోడీ సర్కార్, ఇంకా అక్కడితో ఆగట్లేదు. మంగళ, బుధవారం రెండు రోజులు ఇంధన ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్, మోడీ సర్కార్ తీరు పరిగణలోకి తీసుకుంటే..ధరల పెంపు ఇలాగే కొనసాగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధన ధరలు దాదాపు రూ.110కు చేరుకున్నాయి. భోపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.45, డీజిల్ రూ.100.42 నమోదైంది. ధరల పెంపు కేవలం వాహనదారులపైనే కాదు, సరుకు రవాణా, ప్రయాణికుల రవాణాపై కూడా ప్రభావం పడుతుందన్నది తెలిసిందే. డీజిల్ ధరల పెరుగుదలతో సరుకు రవాణా, బస్సు రవాణా తీవ్రంగా ప్రభావితమైందని ప్రభుత్వ వర్గాలకు కచ్చితమైన సమాచారముంది. పప్పులు, వంటనూనె ధరలు భారీ ఎత్తున పెరగటంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక ముందూ తగ్గే సూచనలు కనపడటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధరల పెరుగుదల సర్వసాధారణమేనని కొట్టిపారేస్తున్నాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినవేళ ఆమేరకు ఇక్కడ ఇంధన ధరల్ని ఎందుకు తగ్గించటం లేదు? అన్న ప్రశ్నకు మోడీ సర్కార్ సమాధానమివ్వటం లేదు. బుధవారం గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 82.68 డాలర్లు ఉండగా, ఈ ఏడాది జూన్, జులై, సెప్టెంబర్‌లో బ్రెంట్ బ్యారెల్ ముడి చమురు 56 డాలర్లకు పడిపోయింది.
సిలిండర్ వెయ్యి దాటుతుందేమో!
ఇంధన ధరలేకాదు..వంటగ్యాస్ ధర కూడా భారీగా పెరుగుతోంది. బుధవారం సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.15 పెంచుతూ చమురు రంగ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధర వెంటనే అమల్లోకి రానున్నది. ఈమేరకు సబ్సిడీయేతర 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.952కు పెరిగింది. అక్టోబర్ 1న ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్‌పై కేంద్రం రూ.43.50 పెంచింది. దాంతో ధరల పెంపు అందరిపైనా పడింది. గృహ వినియోగదారులపై, చిన్న చిన్న హోటల్స్ నడుపుకునే వారిపై ధరల పెరుగుదల ప్రభావం చూపుతుంది. వంటగ్యాస్ ధరలు కూడా రూ.వెయ్యి దాటే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పటికే కరోనాతో దెబ్బతిన్నాం, అయినా తమపై ఈ ధరల పెంపుదల ఏంటి? అని సామాన్యుడు ఆవేదన చెందుతున్నాడు.