Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఖేరీకి చేరుకున్న రాహుల్
న్యూఢిల్లీ: అడుగడుగున అడ్డంకులు ఎదుర్కొన్న కాంగ్రెస్ నేతలు ఎట్టకేలకు లఖింపూర్‌కు చేరుకున్నారు. తొలుత లఖింపూర్‌ను సందర్శించి, రైతు కుటుంబాలను పరామర్శించేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ నేతృత్వంలోని బృందాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ రాహుల్ గాంధీ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు చరణ్‌జిత్ సింగ్ చన్నీ, భూపేశ్ బఘెల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా ఆందోళన చేపట్టారు. చాలా సేపు ఆపిన పోలీసులు ఎట్టకేలకు లక్నోకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఢిల్లీ నుంచి లక్నోకు చేరుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. తమ పోలీసు వాహనంలోనే వెళ్లాలని షరతు పెట్టారు. ఇందుకు రాహుల్, ముఖ్యమంత్రులు నిరాకరిస్తూ తన సొంత వాహనంలోనే వెళ్తానంటూ బైటాయించీ, ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు దిగి వచ్చిన పోలీసులు సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతించారు. అనంతరం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి, సొంత వాహనంలో అక్కడ్నించి బయలుదేరారు. సీతాపూర్‌లోని పీఏసీ గెస్ట్‌హౌస్‌లో పోలీస్ కస్టడీలో ఉన్న ప్రియాంక గాంధీని కలుసుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని ఐదుగురు ప్రతినిధుల బృందం లఖింపూర్‌లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించింది. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ను మొరాదాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
అనుమతి నిరాకరణ...తరువాత ఓకే ...
లఖింపూర్ ఖేరి జరిగిన ఘటనలో మరణించిన రైతులను పరామర్శించేందుకు రాజకీయ నేతలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించాలంటూ కాంగ్రెస్ రాసిన లేఖను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొంది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో రాజకీయ నేతలు పర్యటనకు అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీలకు ఉత్తరప్రదేశ్ హౌం శాఖ అనుమతి ఇచ్చింది.
రైతుల హక్కులను గుంజేస్తున్నారు: రాహుల్ గాంధీ
రైతుల హక్కులను లాక్కుంటున్నారనీ, ఒక పద్ధతి ప్రకారం వారిపై దాడులు జరుపుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం యూపీ వెళ్లిన ప్రధాని మోడీ లఖింపూర్‌ను ఎందుకు సందర్శించలేదు.. అంటూ ప్రశ్నించారు. తాము లఖింపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే.. 144 సెక్షన్ అమల్లో ఉన్నదని అడ్డుకుంటున్నారు. అలా అయితే కనీసం ముగ్గురు వెళ్లేందుకయినా అనుమతివ్వాలని రాహుల్ గాంధీ పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. ఒక పద్ధతి ప్రకారం రైతుల హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''రైతులపైనే వాహనాలు తోలుతున్నారు. హత్యలు చేస్తున్నారు. లఖింపూర్ ఘటనలో కేంద్ర మంత్రి, ఆయన కుమారుడి పేర్లు బయటకు వచ్చాయి. రైతులపై క్రమ పద్ధతిలో జరుగుతున్నా దాడి ఇది'' అని రాహుల్ విమర్శించారు. నిందితులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రతిపక్షాల బాధ్యత అనీ, ప్రతిపక్షాలు ఆ పని చేయకుంటే హత్రాస్ ఘటనను పట్టించుకునే వారే కాదని అన్నారు.
రూ.50 లక్షల చొప్పున పరిహారం
ప్రకటించిన పంజాబ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు
లఖింపూర్ బాధితులకు మహారాష్ట్ర మంత్రివర్గం సంతాపం తెలిపింది. పంజాబ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు మృతి చెందిన రైతులకు, జర్నలిస్టుకు చెరో రూ.50 లక్షలు పరిహారం ప్రకటించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చరణ్‌జిత్ సింగ్ చన్నీ, భూపేశ్ బఘెలా ప్రకటించారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మరణకాండను లఖింపూర్ ఘటన గుర్తుకు తెచ్చిందని చన్నీ పేర్కొన్నారు. యుపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆయన అన్నారు. లఖింపూర్ ఖేరీలో హింసకు వ్యతిరేకంగా పంజాబ్ కాంగ్రెస్ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పంజాబ్‌లోని మొహాలీ నుంచి ఊరీలోని లఖింపూర్ ఖేరికి మార్చ్ నిర్వహించనుంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో దాదాపు 10,000 వాహనాల కాన్వారు ప్రారంభమవుతుంది. పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొంటారు. అలాగే హర్యానా కాంగ్రెస్ కూడా గురువారం ఉదయం 8 గంటలకు హర్యానాలోని పానిపట్టులోని సంజరు చౌక్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు మార్చ్ నిర్వహించనుంది. టీఎంసీ ఎంపీల ప్రతినిధి బృందం లఖింపూర్ హింసలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించింది. టీఎంసీ ప్రతినిధి బృందంలో ఎంపీలు కాకోలి ఘోష్ దస్తీదార్, సుస్మితా దేవ్, అబీర్ రంజన్ బిశ్వాస్, ప్రతిమ మొండల్, డోలా సేన్ ఉన్నారు. యూపీ పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించారని టీఎంసీ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరణించిన రైతుల కుటుంబాలను కలవడానికి వెళ్లిన ఆప్ ఎంపీ సంజరు సింగ్, ఎమ్మెల్యే రాఘవ్ చద్దా సహా పలువురు ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ, బీఎస్పీ, ఆప్ నేతలు కూడా రైతు కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధమయ్యాయి. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ గురువారం రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.
లఖింపూర్‌లో ఆంక్షలు
లఖింపూర్ ఖేరిలో ఆంక్షలు కొనసాగాయి. ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేయడం, 144 సెక్షన్ విధించడం వంటి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. లఖింపూర్‌తో పాటు సితపూర్ ప్రాంతంలో కూడా ఇంటర్ నెట్ నిలిపివేశారు.
యూపీ సీఎంను ఆరా తీసిన ప్రధాని మోడీ
లఖింపూర్ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆ ఘటనకు సంబంధించి వాస్తవ వివరాలను సమర్పించాలని కోరారు. మరోవైపు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లఖింపూర్ ఘటనపై నివేదిక సమర్పించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ న్యాయ విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. ఒక సభ్యునితో కూడిన ఈ కమిటీ లఖింపూర్ ఘటనపై త్వరలోనే విచారణ ప్రారంభిస్తుంది.
కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోతే పోరాటం : రాకేష్ తికాయత్
''కేంద్ర మంత్రి రాజీనామా, ఆయన కుమారుడు అరెస్టును తాము డిమాండ్ చేస్తున్నాం. రైతులు అమాయకులు. కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోతే తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం'' అని రైతు నేత రాకేశ్ తికాయత్ అన్నారు. మంత్రి రాజీనామా చేయకపోయినా, ఆయన కుమారుడు, ఇతర అనుచరులను అరెస్టు చేయకపోయినా దేశవ్యాప్త ఆందోళన ప్రారంభిస్తామని తెలిపారు. రైతులను పరామర్శించేందుకు రాజకీయ నాయకులకు అనుమతి ఇవ్వాలనీ, వారు కూడా రైతులకు సాయం చేస్తారని కోరారు. ''పరిస్థితి అదుపులోకి వచ్చి, మృతదేహాల అంత్యక్రియలు జరగనివ్వండి. మేం రాజకీయ నాయకులను లఖింపూర్ ఖేరి వెళ్ళడానికి అనుమతిస్తాం'' అని యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు. లఖింపూర్ ఘటనపై ప్రధాని మోడీకి రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ లేఖ రాశారు. ''కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాను ఎలా కొనసాగిస్తుంది? వెంటనే రాజీనామా చేయమని ప్రధాని మంత్రి ఎందుకు ఆదేశించలేదు'' అని లేఖలో పేర్కొన్నారు.