Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంతికి బృందాకరత్ లేఖ
న్యూఢిల్లీ : అటవీ (పరిరక్షణ) చట్టం 1980 (ఎఫ్సీఏ)లో ప్రతిపాదిత సవరణలు ప్రయివేటు ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూర్ సభ్యులు బృందాకరత్ విమర్శించారు. ప్రతిపాదించిన సవరణలపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు బుధవారం ఆమె లేఖ రాసారు. ప్రతిపాదిత సవరణపై వ్యాఖ్యలు, సలహాలను ఆహ్వానిస్తూ ఈ నెల 2 మంత్రిత్వ శాఖ సర్కులర్ (ఎఫ్.నెం ఎఫ్‌సి-11/61/2021-ఎఫ్‌సి) పంపిందని, అయితే నిజమైన సవరణలు లేకుండా, ఒక జనరల్ నోట్‌ను మాత్రమే ఉంచారని తెలిపారు. ప్రతిస్పందనకు 15 రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారనీ, ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్ పాలసీ ప్రకారం 30 రోజులు కూడా ఇవ్వలేదని తెలిపారు.
అడవుల రక్షణ, ప్రస్తుత విలువుల పరిహారం, అటవీకరణ పరిహారం చెల్లింపులు.. వంటి అంశాలపై వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను నాశనం చేయడానికే ఈ ప్రతిపాదిత సవరణలన్నీ రూపొందించబడ్డాయి. అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాలకు ఉపయోగించుకునేటప్పుడు ప్రాజెక్టు ప్రతిపాదకులకు ఏదైనా 'అసౌకర్యం' కలిగితే ఎఫ్సీఏ దరఖాస్తును రద్దు చేసుకోవాలని ప్రతిపాదించారనీ, ఈ ప్రతిపాదనతో అటవీభూమిని హస్తగతం చేసుకునే సౌకర్యం ఇవ్వడమే కాకుండా, ప్రయివేటీకరణ ప్రయోజనాలు పొందాలనుకునే కార్పొరేట్లకు సులభంగానూ, చౌకగానూ దానిని అందిస్తుందని విమర్శించారు. పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికన్నా ప్రయివేటు ప్రాజెక్టులు, ప్రయోజనాలను రక్షించడానికే ప్రభుత్వం ఎక్కువ ఆందోళన చెందడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు లేఖలో తెలిపారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్రాల హక్కులను దిగజారుస్తాయని, కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని మరింత కేంద్రీకృతం చేస్తాయని విమర్శించారు.
ఈ ప్రతిపాదనల్లో కనీసం ఒక్కదానిలో గిరిజన తెగలు, ఇతర సాంప్రదాయ అటవీవాసుల హక్కుల రక్షణను ప్రస్తావించలేదు. పైగా అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం లభించిన హక్కులపై నేరుగా ప్రభావం చూపుతాయని విమర్శించారు. అలాగే ఈ ప్రతిపాదనల లక్ష్యం అటవీ భూములను నిర్వచనాన్ని సడలించడం, దీని ద్వారా గిరిజన తెగలు, అటవీ నివాసులపై పడే ప్రభావాన్ని ప్రతిపాదనల్లో ప్రస్తావించలేదు. ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించడానికి ఇది కూడా ఒక కారణంగా బృందకారత్ లేఖలో తెలిపారు. ఈ ప్రతిపాదనల్లో చట్టాలను ఉల్లంఘించే పెద్ద కంపెనీలు, ప్రైవేటు వ్యాపారాలపై భారీ జరిమానాలు విధించే అంశాలు ఉన్నా, ఈ ప్రతిపాదనల ఉద్దేశ్యం ఈ వర్గాల ప్రయోజనాలను కాపాడ్డమేని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలతో ముందుకు వెళ్లద్దని తాను అభ్యర్థిస్తున్నాననీ, ఇవి గిరిజన తెగలు, సాంప్రదాయ అటవీవాసులు ప్రయోజనాలు, పర్యావరణ సమస్యల కంటే ప్రైవేటు ప్రయోజనాలకు అనుకూలం కోసం సరళీకరణే అని బృందాకరత్ లేఖలో విజ్ఞప్తి చేశారు.