Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికంగా స్టిరాయిడ్స్ వాడకం, మధుమేహంతోనే..: అధ్యయనం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వెగులు చూసిన తర్వాత రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో అయితే ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రపంచంలోని బ్లాక్ ఫంగస్ కేసుల్లో 71 శాతం భారత్‌లోనే ఉన్నాయంటే మ్యూకోర్ మైసిస్ వ్యాప్తికి అద్దం పడుతోంది. అయితే, భారత్‌లో ఇంత ఆందోళనకర స్థాయిలో బ్లాక్ ఫంగస్ కేసులు రావడానికి కారణాలపై అధ్యయనం చేసిన పరిశోధకులు సంబంధిత నివేదికలను విడుదల చేశారు. ఛండీగఢ్‌కు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్), జర్మనీకి చెందిన లైబ్నిజ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రోపోస్పెరిక్ రీసెర్చ్ పరిశోధకుల నివేదిక ప్రకారం.. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా నమోదుకావడానికి డయాబెటిస్, అధిక స్టెరాయిడ్ వాడకం, అపరిశుభ్ర పరిస్థితులు, ఐరన్ మెటబాలిజంలో మార్పులు, నివాస ప్రాంతాల్లో సరైన వెలుతురు లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొంది. దీంతో మ్యూకోర్ మైసిస్ విజృంభణ కొనసాగి వైద్య సంక్షోభానికి కారణం అయిందని తెలిపింది. 2021 మే నాటికి భారత్‌లో దాదాపు 14,872 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. వీటిలో అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ యాక్టివ్ కేసులు, రికవరీలు నమోదవుతున్నాయి. ఈ పరిశోధనకు కోవిడ్ సంబంధిత బ్లాక్ ఫంగస్ డేటాను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సైతం అందించిందని పరిశోధకులు వెల్లడించారు.
భారత్‌లో బ్లాక్‌ఫంగస్ కేసులు అధికంగా పెరగడానికి గల కారణాల్లో మొదటిది మధుమేహం. ఈ అధ్యయనం ప్రకారం 50 శాతానికి పైగా బ్లాక్‌ఫంగస్ కేసుల్లో మధుమేహం ఉంది. 2019లో బ్లాక్ ఫంగస్‌పై జరిపిన అధ్యయనంలో 57 శాతం మంది రోగులకు అనియంత్రిత మధుమేహం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఆక్సిజన్‌పై ఉన్న కరోనా రోగులకు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల మరణ రేటు తగ్గిందన్న క్లినికల్ ట్రయల్స్ నేపథ్యంలో కోవిడ్ సెకండ్‌వేవ్‌లో స్టెరాయిడ్స్ వాడకం రికార్డు స్థాయిలో పెరిగింది. అవసరంలేని వారికి సైతం స్టెరాయిడ్స్ భారీ మోతాదులో ఇవ్వబడ్డాయని అధ్యయనం గుర్తించింది. ఇది బ్లాక్‌ఫంగస్ కేసులు పెరగడానికి దారితీసిందని వెల్లడించింది. కరోనా సెకండ్‌వేవ్ సమయంలో ఆస్పత్రుల్లో పడకలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది కరోనా రోగులు, సాధారణ రోగులు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే ఆక్సిజన్ వాడేప్పుడు ఆక్సిజన్ సిలిండర్‌కు స్వేదజలాన్ని తేమ వనరుగా ఉపయోగించాలి. ఇది సరియైనదిగా లేకపోతే బ్యాక్టీరియా వంటి ఫంగస్ వ్యాధికారక జీవులను అభివృద్ధికి దారి తీస్తుంది. ఈ కారణంగా కూడా బ్లాక్‌ఫంగస్ కేసులు ఎక్కువయ్యాయి. బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి మరో ప్రధాన కారణం సరైన వెలుతురు లేకపోవడం. దేశంలోని చాలా ఆస్పత్రులు, గృహాలు సరైన వెంటిలేటర్ లేని కారణంగా బ్లాక్ ఫంగస్ వ్యాప్తి జరుగుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది.