Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం
న్యూఢిల్లీ: ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలనేదానిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కచ్చితమైన గణాంకాలు లేకుండా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఏదైనా గుణాత్మకమైన సమాచారం ఉంటే తమ ముందు ఉంచాలని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్‌ను ఆదేశించింది. ''ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారు. అయితే ఇందుకోసంగాను కేంద్రం ఎలాంటి కసరత్తు చేసిందో చెప్పిండి. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిథ్యం తక్కువగా ఉందని చెప్పడానికి మీ దగ్గరున్న కచ్చితమైన గణాంకాలు ఇవ్వండి'' అని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గావీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అడిషనల్ సొలిసిటర్ జనరల్ బల్బీర్ సింగ్‌ను ప్రశ్నించింది.
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆగస్టు 13, 1997లో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీం, తాజాగా పై వ్యాఖ్యలు చేసింది.
''ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అనేదానికి ప్రాతిపదిక ఏంటి? రిజర్వేషన్లు ఇవ్వాలి..అనేందుకు న్యాయం చేసే విధంగా మీ దగ్గర సరైన సమాచారముందా? ఉంటే ఇవ్వండి'' అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి సమాధానంగా బుధవారం విచారణ ప్రారంభమయ్యాక, అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాట్లాడుతూ, '' 1965లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలు వరుసగా 3.34శాతం, 0.6శాతం ఉన్నారు. అదిప్పుడు 17.5శాతం, 6.82శాతానికి పెరిగింది. అయితే గ్రూప్-ఎ, గ్రూప్-బి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిథ్యం (జనాభా ప్రకారం) కన్నా తక్కువగా ఉంది'' అని చెప్పారు.