Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ''డాక్టర్లు చెప్పినదానితో మనం శాంతించడం తప్ప''
- 18 ఏండ్ల గుర్విందర్ సింగ్ను కాల్చి చంపారు : తండ్రి సుఖ్వీందర్ సింగ్
న్యూఢిల్లీ : ''మేం ఏం చేయగలం. డాక్టర్లం కాదు కదా. గుర్విందర్ సింగ్ను కాల్చి చంపారు. ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెబుతున్నారు. కానీ డాక్టర్లేమో అందుకు ఆధారాల్లేవంటున్నారు. ఏం చేస్తాం. వారి చెప్పిన దానితో గమ్మునుండటం తప్ప'' అంటూ లఖింపూర్ జిల్లాలో జరిగిన ఘటనలో అమరవీరుడైన 18 ఏండ్ల గుర్విందర్ సింగ్ తండ్రి సుఖ్వీందర్ సింగ్ కన్నీరు మున్నీరు అయ్యారు.''హమ్ క్యా కర్తే (మేం ఏమి చేయగలం)?'' 18 ఏండ్ల గుర్విందర్ సింగ్ అంత్యక్రియలు చేశాక.. ఆ యువకుడి తండ్రి సుఖ్వీందర్ సింగ్ మనోవేదన ఇది. లఖింపూర్ ఖేరిలో నిరసన తెలిపిన రైతులపైకి కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వారు దూసుకెళ్లడంతో వాటి చక్రాల కిందపడి 18 ఏండ్ల గుర్విందర్ సింగ్ మరణించాడని రెండో పోస్ట్మార్టం కూడా చెప్పిన తర్వాత.. ఆ యువకుడి అంత్యక్రియలు జరిగాయి. అప్పుడు సుఖ్వీందర్ సింగ్ను కలిసిన జాతీయ మీడియాతో ఇలా పేర్కొన్నాడు. ''వైద్యులు చెప్పిన దానితో మేం శాంతిని నెలకొల్పాలి. ఎందుకంటే మేం డాక్టర్లు కాదు. కానీ గోలీ తో లగిథీ (అతను కచ్చితంగా కాల్చి చంపబడ్డాడు)'' అని సుఖ్వీందర్ సింగ్ అన్నారు.బహ్రాయిచ్లోని మొహ్రానియా నవీపూర్ గ్రామంలో 4 బిగాల (ఒక ఎకర) వ్యవసాయ భూమిని కలిగి ఉన్న 48 ఏండ్ల వ్యక్తి ఇలా అన్నాడు. ''మేం మృతదేహాన్ని చూశాం. అతనికి తుపాకీ తగిలినట్టు స్పష్టమైంది. అతని తల వెనుక భాగంలో గాయం అయింది. నుదిటి కుడి వైపున గాయం ఉంది. కానీ రెండో పోస్ట్మార్టం నివేదిక కూడా అతను తుపాకీతో గాయపడలేదనీ, మరణం అనుకోకుండా జరిగిందని కూడా చెబుతోంది. కానీ ప్రత్యక్ష సాక్షులందరూ ఆయన కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ చేత కాల్చి చంపబడ్డారని చెబుతున్నారు. దాన్ని ఎలా నమ్మాలి? ఒకరు కాదు అందరూ చెబుతున్నారు'' అని పేర్కొన్నారు.ఈ ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడు కారు దూసుకెళ్లడంతో మరణించిన మరో ముగ్గురు రైతుల కుటుంబాల ఆందోళనతో పోస్టుమార్టం తరువాత అంత్యక్రియలు నిర్వహించగా, గుర్విందర్ కుటుంబం మళ్లీ పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేసింది. నలుగురు సీనియర్ వైద్యుల బృందం లక్నో నుంచి బహ్రాయిచ్కు వెళ్లి పోస్టుమార్టం చేసింది. తమకు ఎలాంటి తుపాకీ గాయాలు కనిపించలేదని చెప్పడంతో గుర్విందర్ మృతదేహాన్ని బుధవారం ఉదయం 6 గంటలకు కుటుంబ సభ్యులకు అప్పగించింది. కుటుంబ సభ్యులు, రైతులు ఉదయం 9 గంటలకు దహనం సంస్కారాలు చేశారు. వారి ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉన్న సొంత పొలం దగ్గర గుర్విందర్ సింగ్ అంత్యక్రియలు చేశారు.దహన సంస్కారాలు పూర్తయిన తరువాత మాత్రమే తమకు పోస్టుమార్టం నివేదిక ఇచ్చారని సుఖ్వీందర్ చెప్పారు. గుర్విందర్ సింగ్ ముగ్గురు పిల్లల్లో చిన్నవాడు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సందర్శనకు వ్యతిరేకంగా టికునియాలో జరిగిన ఆందోళనకు ఇతరులతో కలిసి గుర్విందర్ సింగ్ వెళ్లాడు. ''ఇక్కడ మా ప్రజలు (సిక్కులు) ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి. అందరూ వెళ్తున్నారు. కాబట్టి నా కొడుకు వెళ్తానని చెప్పాడు. అతను రైతు కుమారుడు. కాబట్టి అతను వెళ్ళవలసి వచ్చింది'' తెలిపారు.