Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు సామాన్యులను బలితీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ముగ్గురు పౌరులను కాల్చిచంపిన ఘటనలను మరవకముందే... తాజాగా మరోసారి శ్రీనగర్‌లో బీభత్సం సృష్టించారు. గురువారం ఉదయం స్కూల్లోకి చొరబడిన ఉగ్రవాదులు... భీకర కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు మరో ఉపాధ్యాయుడు మరణించారు. శ్రీనగర్‌లోని సఫాకాదాల్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ స్కూల్లో ఈ ఘటన జరిగింది. స్కూల్లోకి ఆయుధాలతో చొరబడిన ఉగ్రవాదులు.. ఇద్దరు ఉపాధ్యాయులు సతిందర్ కౌర్, దీపక్ చాంద్‌లపై తుపాకులతో కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారిద్దరు మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
మంగళవారం కూడా శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్ సమీపంలో ఓ మెడికల్ షాప్‌పై దాడి చేశారు. షాప్‌లో విధులు నిర్వర్తిస్తున్న మఖన్ లాల్ బింద్రూ అనే ఫార్మాసిస్ట్‌పై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించారు. ఆరోగ్య శిబిరాల పేరిట కాశ్మీర్ వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతున్నాడనీ, యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడని... అందుకే చంపేశామని రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ఘటన జరిగిన గంట తర్వాత లాల్ బజార్ ప్రాంతంలో ఓ వ్యక్తిని కూడా ఉగ్రవాదులు కాల్చిచంపారు. రోడ్డు పక్కన భెల్ పూరీ అమ్ముతున్న ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో అతడు అక్కకడికక్కడే మరణించాడు. బందిపోరాలో మరో వ్యక్తిని కాల్చి చంపారు. ఇలా పౌరులపై ఉగ్రవాదులు గన్ ఎక్కుపెడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.