Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బాలల హక్కుల కమిషన్ సీరియస్
న్యూఢిల్లీ : కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ డాక్టర్తో పాటు ఐదుగురు సభ్యుల బృందం ఐదేండ్లుగా 28 మంది చిన్నారులను అక్రమంగా రవాణా చేసిన ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది. ఈ కేసును క్షుణ్ణంగా విచారించి నివేదిక ఇవ్వాలని బెంగళూరు (దక్షిణం) డిప్యూటీ పోలీసు కమిషనర్ హరీశ్ పాండేకు లేఖ రాసింది. ఈ ఘటనపై ఎన్సీపీసీఆర్ సభ్యురాలు (జువెనైల్ జస్టిస్) ప్రజ్ఞా పరాండే స్పందించారు. ''జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అక్రమంగా దత్తత ఇవ్వడం, తీసుకోవడం తీవ్రమైన నేరం. ఓ చిన్నారిని దత్తత తీసుకునేటప్పుడు ఆ చిన్నారికి న్యాయబద్ధమైన భద్రత కల్పించేందుకు అవసరమైన విధివిధానాలను జువెనైల్ జస్టిస్ యాక్ట్ చెబుతుంది. దత్తత విధివిధానాలు కాస్త కఠినంగా ఉన్నట్టు కనిపించినా.. చిన్నారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ఈ చట్టం లక్ష్యం'' అని ఆమె అన్నారు. చిన్నారి శారీరక, మానసిక, సాంఘిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పించాల్సిందేనని, జువెనైల్ జస్టిస్ చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించేవారిని ఉపేక్షించబోమని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.