Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పర్యావరణ అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. నిర్మాణం నిలిపివేయాలంటూ ఏపి రైతు చంద్రమౌళీశ్వర రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్, ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్లను జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపు అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు కాలపరిమితి పరిధి, పిటిషన్లలో మెరిట్స్‌పై వాదనలు పూర్తి చేశారు. అనంతరం వాటికి ఏపీ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సమాధానమిస్తూ... టెర్మ్ ఆఫ్ రిఫరెన్స్ పేర్కొన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం పనులు లేవని తెలిపారు. పూర్తి సాగునీటి ఉద్దేశంతోనే ప్రాజెక్టు చేపడుతున్నారని తెలిపారు. వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.