Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీహార్ : అదొక రైల్వే స్టేషన్... అక్కడ ప్రయాణికుల కంటే విద్యార్ధులే ఎక్కువ... వారు కాలక్షేపం కోసం వచ్చేవారు కాదు... కన్న కలలను నిజం చేసుకోవడానికి వచ్చేవారు... చదువుకొని వారి లక్ష్యాలను చేరడానికి రైల్వే స్టేషన్‌కు రోజూ వస్తుంటారు... అవును.. అదొక కోచింగ్ సెంటర్.. స్టడీ సెంటర్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో గల సాసారాం రైల్వే జంక్షన్.. ఇది చుట్టుపక్కల ఊర్లలో చదువుకునే పిల్లలకు విద్యాలయం కంటే ఎక్కువ. సాసారాం జంక్షన్‌లోని రెండు రైల్వే ఫ్లాట్ ఫారాలపై సొంతగా చదువుకునే పిల్లలు కొందరైతే, కోచింగ్ తరహాలో గ్రూపులుగా ఏర్పడి చదివేవాళ్లూ మరికొందరు. సబ్జెక్టులో పట్టున్న, వయసులో పెద్దవాళ్లైన కొందరు.. మిగతా వాళ్లకు (బోర్డు లేకుండానే క్లాసులు) తీసుకునే దశ్యాలూ కపిస్తాయక్కడ. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత ఆ స్టేషన్ అచ్చంగా చదువుల కోవెలగా మారిపోతుంది. రైల్వే ఫ్లాట్ ఫారమే వారికి కోచింగ్ సెంటర్. ఉదయం, సాయంత్రం వేళలో కొన్ని వందల మంది యువతీయువకులు ఈ రైల్వేస్టేషన్‌కు క్యూ కడుతుంటారు. ఉన్న రెండు ఫ్లాట్ ఫారాలు విద్యార్థులతో నిండిపోయి కనిపిస్తాయి.
దీనికి కారణం పేదరికానికి చిరునామా అయిన రోహతాస్ జిల్లాలో ఇప్పటికీ చాలా ఊర్లకు కరెంటు సదుపాయం లేకపోవడమే. సాసారాంలో ఒక్క రైల్వే స్టేషన్‌కు తప్ప చుట్టుపక్కల ఊళ్లన్నీ రాత్రి వేళ చీకట్లోనే మగ్గిపోతున్నాయి.
సాసారాం రైల్వే స్టేషన్లో మాత్రమే 24గంటల కరెంట్ ఉంటుంది. దీంతో ఆయా గ్రామాల్లో చదువులపై ఆసక్తిగల పిల్లలంతా ఈ సౌకర్యాన్ని అనుకూలంగా మలుచుకున్నారు. 2002 సంవత్సరం నుంచి ఇలా విద్యార్థులంతా కలిసి రైల్వే స్టేషన్ లైట్ల కింద చదువుకోవడం మొదలైంది. ఛత్తీస్ గఢ్ కేడర్ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఇటీవల తన ట్విటర్ లో సాసారాం రైల్వే జంక్షన్ లో ఫ్లాట్ ఫారాలపై సాగుతోన్న చదువుల ప్రహాసనం తాలుకూ ఫొటోలను పోస్ట్ చేయడంతో మరోసారి అది వైరల్ న్యూస్‌గా మారింది.