Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులు ఎవరు..?
- ఎవరిపై ఎఫ్ఐఆర్?
- ఎంత మందిని అరెస్టు చేశారు? : యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్న
- విచారణ నేటికి వాయిదా
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ ఘటనపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ''నిందితులు ఎవరు. ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంత మందిని అరెస్టు చేశారనే దానిపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయండి'' అని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది. లఖింపూర్ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సిఎస్ పాండా సీజేఐ ఎన్వి రమణకు మంగళవారం లేఖ రాసిన విషయం విదితమే. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఈ ఘటనలో పాల్గొన్న దోషులకు శిక్ష పడేలా కేంద్ర హౌం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరారు. దీనిపై సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది. జస్టిస్ ఎన్వి రమణ విచారణ ప్రారంభిస్తూ తనకు ఇద్దరు న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సిఎస్ పాండా లేఖ రాశారనీ, ఆ అంశంపైనే విచారణ జరుపుతామని అన్నారు. మీరు ఎవరి తరఫున హాజరవుతున్నారు (వాదనలు వినిపించేందుకు) అని సీనియర్ న్యాయవాది విజరు హన్సారియాను సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అడిగారు. అందుకు అతను స్పందిస్తూ తాను దేశ పౌరుల జీవితం, స్వేచ్ఛ కోసం బార్ సభ్యుడిగా వాదనలు వినిపిస్తానని అన్నారు. ఇద్దరు న్యాయవాదులు తనకు లేఖ రాశారనీ, దీనిని పిటిషన్‌గా నమోదు చేసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించినట్టు జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. కానీ మిస్ కమ్యూనికేషన్ వల్ల అది సుమోటోగా మారిందనీ, అయితే అదేమీ పెద్ద విషయం కాదన్నారు. న్యాయవాది శివ కుమార్ త్రిపాఠి ఎక్కడ అని సీజేఐ ప్రశ్నించగా, అతను అందుబాటులోకి రాలేదని కంట్రోల్ రూమ్ పేర్కొంది. అయితే విచారణ ప్రారంభమైనప్పటికీ లేఖ రాసిన ఇద్దరు న్యాయవాదులు అందుబాటులోకి రాకపోకపోవడంతో పిటిషన్‌పై విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం కొన్ని కేసుల విచారణ తరువాత లఖిపూర్ ఖేరీ ఘటనకు సంబంధించిన సుమోటో పిటిషన్‌పై మళ్లీ విచారణ ప్రారంభమైంది. న్యాయవాది శివ కుమార్ త్రిపాఠి వాదనలు వినిపిస్తూ ''కోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వ పరిపాలన నిర్లక్ష్యంతోనే రైతులు మరణించారు'' అని పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని తాము అభ్యర్థిస్తున్నామని అన్నారు. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన ప్రధాన సమస్య అనీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అవసరమైన చర్యలు యూపీ ప్రభుత్వం తీసుకోలేదని వివరించారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ''మీకు కావాల్సిన ఉపశమనం ఏంటీ'' అని ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని కేంద్ర హౌం మంత్రత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలనీ, రైతులు బాధపడుతున్నారనీ, ప్రభుత్వం చర్యలతో రైతులు భయపడుతున్నారని న్యాయవాది శివ కుమార్ త్రిపాఠి పేర్కొన్నారు.
జస్టిస్ హిమాకోహ్లీ జోక్యం చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని అన్నారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) గరిమ ప్రసాద్ వాదిస్తూ ఇది దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొన్నారు. వెంటనే సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ జోక్యం చేసుకొని పది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఏఏజీ గరిమా ప్రసాద్ స్పందిస్తూ విచారణ కోసం సిట్, న్యాయ కమిషన్ ఏర్పాటు చేశామనీ, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ రమణ మీరు దానిని సరిగా చూడటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయనీ, ఎఫ్ఐఆర్ సరిగ్గా నమోదు చేయలేదనీ, కమిషన్ వివరాలు ఏమిటి? ప్రశ్నించారు. దీనికి ఏఏజీ సమాధానం ఇస్తూ న్యాయ విచారణ కమిటికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. మళ్లీ సీజేఐ జోక్యం చేసుకుని హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల పరిస్థితి ఏమిటి? ప్రశ్నించారు. దీనికి తాను వివరాలు తీసుకుంటాననీ, శుక్రవారం తెలుపుతానని ఏఏజీ పేర్కొన్నారు. దీనిపై సీజేఐ ఎన్వి రమణ సూచనలను పొందాలనీ, హైకోర్టులో ఏం జరిగిందో నమోదు చేయాలనీ, శుక్రవారం విచారణ చేస్తామని అన్నారు. జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ హత్యకు గురైన వారిలో రైతులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. నిందితులు ఎవరెవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారో, ఎవరిని అరెస్టు చేశారో తాము తెలుసుకోవాలనీ, అందుకోసం దీనిపై స్టేటస్ రిపోర్ట్ నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశించారు. న్యాయవాది అమృత్ పాల్ ఖల్సా వాదనలు వినిపిస్తూ మరణించిన రైతు తల్లి పరిస్థితి విషమంగా ఉన్నదనీ, ఆమెకు ఆరోగ్య సేవలు కూడా అందించటం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. అయితే సాంకేతిక కారణాలతో ఆమె వాయిస్ సరిగా వినబడలేదు. అలాగే ఆమెకు సర్వీస్ నిలిచిపోయింది. దీంతో ఆమె ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణకు ఫోన్లో సమాచారం పంపింది. ఆమె నుంచి వచ్చిన సమాచారాన్ని సీజేఐ ఎన్వి రమణ చదివి వినిపించారు. 'మరణించిన రైతు లవ్‌ప్రీత్ సింగ్ తల్లి పరిస్థితి విషమంగా ఉన్నది. ఆమెకు ఆరోగ్య సదుపాయాలకు కూడా ప్రభుత్వం కల్పించటం లేదు' అని ఆమె పేర్కొన్నట్టు తెలిపారు. దీనిపై ఆ రైతు తల్లికి వెంటనే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్య సౌకర్యాలు అందించాలనీ, చిన్న ఆస్పత్రిలో కాకుండా అన్ని సౌకర్యాలు ఉండే పెద్ద ఆస్పత్రిలో వైద్య సేవలు అందించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకొని ఆమెకు అందించిన వైద్య సదుపాయాలు గురించి తమకు శుక్రవారం చెప్పాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.