Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పష్టత లేని కమిషన్ : ఎస్కేఎం
- ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
- బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి వరుణ్ గాంధీ ఔట్
న్యూఢిల్లీ : లఖింపూర్ ఘటనపై అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ నియమించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హౌం మంత్రిత్వ శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ అవనీష్ కుమార్ అవస్థీ ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి రెండు నెలల్లోగా కమిషన్ తన విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిషన్ వ్యవధిలో ఏదైనా మార్పు చేయాల్సి అది ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయబడతాయని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య జ్యుడిషీయల్ కమిషన్ తమ డిమాండ్లలో భాగం కాదనీ, దేశంలోని రైతుల్లో విశ్వాసాన్ని కలిగించదని ఎస్కేఎం పేర్కొంది. ప్రజల ఒత్తిడి పెరగడంతో పాటు సుప్రీం కోర్టు విచారణ కారణంగా లఖింపూర్ ఖేరి రైతుల మారణకాండపై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ యూపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని ఎస్కేఎం పేర్కొంది. ఉత్తర్వులో అటువంటి కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, లేదా లక్ష్యం గురించి ఏమీ ప్రస్తావించలేదని తెలిపింది. లఖింపూర్ ఖేరీ ఘటనలు నిరసనకారులను భయపెట్టే ఉద్దేశంతో.. హత్య చేయబడ్డాయా? లేదా? అనే దానిపై విచారణ జరగాలని డిమాండ్ చేసింది. జారీ చేసిన నోటిఫికేషన్లో కేంద్ర మంత్రి బహిరంగ సభలో చేసిన బహిరంగ బెదిరింపులు గురించి ప్రస్తావించలేదని తెలిపింది. ఆదివారం, ఆ తరువాత జరిగిన భయంకరమైన పరిణామాల్లో కేంద్ర మంత్రి, అతని కుమారుడి పాత్ర గురించి ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పేర్కొంది. నోటిఫికేషన్ కమిటికి రెండు నెలల సమయం ఇస్తుందనీ, గడువును కూడా పొడిగించవచ్చని సూచిస్తుందని ఎస్కేఎం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కమిషన్ న్యాయ విచారణ సమయంవృథా, వాస్తవ సంఘటనలను ఆధారాలు లేకుండా చేయడం, బాధితులకు న్యాయం వాయిదా వేయడమేనని స్పష్టమవుతుందని ఎస్కేఎం పేర్కొంది.
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
ఎంత మంది నిందితులను అరెస్టు చేశారో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాత ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కార్ల కాన్వారులో ఉన్న ఆశిష్ పాండే, లవ్ కుశ్లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేశారు. లఖింపూర్ ఖేరీ మారణకాండలో ఇప్పటివరకు చేసిన అరెస్టుల వివరాల కోసం సుప్రీం కోర్టు సీజేఐ ధర్మాసనం ఆదేశించినప్పటికీ, ఆశిష్ మిశ్రా పరారీలో ఉన్నాడనీ, అతనిని పట్టుకోవడానికి యూపీ పోలీసు మూడు బృందాలు ప్రయత్నిస్తున్నాయని సమాచారం. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశామనీ, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామనీ, అయితే ఆశిష్ మిశ్రా ఆచూకీ దొరకలేదని యూపీ పోలీసులు చెబుతున్నారు.
జాతీయ కార్యవర్గం నుంచి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఔట్
లఖింపూర్ ఖేరీ ఘటనను ఖండించిన కొన్ని గంటల తరువాత బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని ఆ పార్టీ ి జాతీయ కార్యవర్గం నుండి తప్పించారు. గురువారం ప్రధాని మోడీతో సహా బీజేపీ 80 మందితో కూడిన జాతీయ కార్యవర్గాన్ని ఆపార్టీ ప్రకటించింది. అయితే ఈ 80 మందిలో వరుణ్ గాంధీ లేరు. ఆయన కంటే జూనియర్లు సైతం ఆ కమిటీలో ఉన్నారు. కానీ ఆయనను పేరు మాత్రం జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుల జాబితాలో వరుణ్ గాంధీ పేరు, అతని తల్లి, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మేనకా గాంధీ పేరు కూడా లేదు. వరుణ్ గాంధీ గతంలో కూడా రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర మాజీ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ రైతులకు మద్దతు ఇచ్చారు. ఆయనకు కూడా ఈ కమిటీ చోటు దక్కలేదు.
కేంద్ర మంత్రి కార్యక్రమానికి మీడియా అనుమతి నిరాకరణ
కేంద్ర మంత్రి అజరు మిశ్రా జైలు అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కాని మీడియాను అనుమతించలేదు. ఆ కార్యక్రమానికి వెళ్లిన మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్ కు పంజాబ్ కాంగ్రెస్ మార్చ్ చేపట్టింది. అయితే మార్చ్ యూపీ-హర్యానా సరిహద్దు షాజహాన్ పూర్ వద్దకు చేరుకునేసరికి అక్కడ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ, ఇద్దరు రాష్ట్ర మంత్రులు, మరికొంత మంది ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.
ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్టు చేయాలి : ఎస్కేఎం
ప్రధాన నిందితుడు కనిపించకుండా పోవడానికి పోలీసులు అనుమతించారనేది వాస్తవమనీ, హౌం మంత్రిత్వ శాఖ మంత్రి కుటుంబంలో ఇదంతా జరగటం నమ్మశక్యం లేదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పేర్కొంది. ఇది ఉత్తరప్రదేశ్, దేశంలో శాంతిభద్రతల స్థితిని ప్రతిబింబిస్తుందని స్పష్టం చేసింది. రైతుల మారణహౌమానికి పాల్పడిన వారిని రక్షించడానికి యోగి, మోడీ ప్రభుత్వాలు ప్రయత్నించడం తగదని ఎస్కేఎం హెచ్చరించింది. ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
రైతులపై ఆశిష్ దాడిని స్పష్టం చేస్తూ బయటపడ్డ మరో వీడియో
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై దాడికి సంబందించిన అసలు రికార్డింగ్‌తో సహా మరింత బాధ కలిగించే వీడియో ఫుటేజ్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చింది.ఇది లఖింపూర్ ఖేరిలో ఆశిష్ మిశ్రా, అతని అనుచరులు పాల్పడిన హత్య ఉద్దేశాన్ని స్పష్టంగా చూపిస్తుంది.ఒక చిన్న వీడియో క్లిప్‌లో రైతులు హత్యాకాండ జరిగిన ప్రదేశం నుంచి తప్పించుకున్నప్పుడు, బందోబస్తులో ఉన్న పోలీసులతో రైతులు మాట్లాడటం కూడా కనిపిస్తుంది.పోలీసులు ఆశిష్ మిశ్రా,అతని సహచరులను అరెస్టు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఇంకా వేచి ఉన్నామని పేర్కొంది. మోడీ ప్రభుత్వంలో హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగించడంతో తన నైతికత స్వభావాన్ని చూపించాలని కూడా ఎస్కేఎం వేచి ఉందని తెలిపింది.
అతనిని హౌం వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగిస్తున్న నేపథ్యంలో లఖింపూర్ ఖేరి రైతుల ఊచకోతలో న్యాయం కోసం ఆశ లేదని పేర్కొంది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవి నుంచి తప్పించాలని రాష్ట్రపతిని ఎస్కేఎం కోరింది. రైతులపై హింసను ప్రేరేపిస్తూ లాఠీలు, కర్రలతో దెబ్బకు దెబ్బ తీయాలని బీజేపీ కార్యకర్తలను ఆదేశిస్తూ ఖట్టర్ వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా కొనసాగించడం దారణమన్నారు.