Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతలపై 40 శాతం పెరిగిన దాడులు : ఎన్సీఆర్బీ రిపోర్టు
- పలు రాష్ట్రాల్లో రైతు ఉద్యమంపై దాడులు
న్యూఢిల్లీ : దేశంలో రైతులపై దాడులు 40 శాతం పెరిగాయి. దేశ వ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో మూడేండ్ల తరువాత మళ్లీ (2020) రైతులపై దాడుల కేసులు ఎగబాకాయి. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ ఆందోళన సందర్భంలో వివిధ రాష్ట్రాల్లో రైతులపై దాడులు జరుగుతున్నాయి. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రైతులపై దాడులు పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ప్రకారం దేశంలో అంతకుముందు కంటే 2020లో దాదాపు 40 శాతం పెరిగాయి. వ్యవసాయ చట్టాలపై ఏడాది కాలంగా జరుగుతున్న నిరసనల కారణంగా దాడులు పెరిగినట్టు అధికారులు తెలిపారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా రైతులపై 1,579 దాడులు జరగగా, 2020లో 2,188 దాడులు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. ఇండియన్ పినల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్లు 147 నుంచి 151 వరకు కేసులు నమోదు చేయబడ్డాయి. అవి రైతులపై దాడులు, అనుమతి నిరాకరించినా సమావేశాలు ఏర్పాటు, లఖింపూర్ ఖేరీ, కర్నాల్, సింఘూ, ఘాజీపూర్ వంటి ఘటనలపై కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఇటీవల జరిగిన హింసలో పోలీసులు నమోదు చేసిన మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ఐపీసీ సెక్షన్ 147, 148, 149, హత్య, నేరపూరిత కుట్ర కింద అభియోగాలు మోపింది. నివేదిక ప్రకారం రైతులపై దాడులు బీహార్లో అత్యధిక సంఖ్యలో (1,286)నమోదయ్యాయి. మహారాష్ట్ర (279), కర్నాటక (148) తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 142 కేసులు నమోదు కాగా, గుజరాత్లో 80 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో అరెస్టయిన వ్యక్తుల సంఖ్య 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారు 3,000 మంది, 30-45 సంవత్సరాల వయస్సు వారు 2,500 మంది ఉన్నారు. మెట్రో నగరాల్లో పాట్నా (బీహార్), అహ్మదాబాద్ (గుజరాత్) మాత్రమే ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రైతుల ఘటనలను నివేదించాయి. హర్యానాలో 34 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్సీఆర్బీ సీనియర్ అధికారి ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ 'రైతు ఘటనలు' అనేవి ఆయా రాష్ట్రానికి స్వంతగా ఉంటాయనీ, అవి రైతుల ఆందోళన, భూ సేకరణ నిరసనలు, నీరు, భూ సంబంధిత సమస్యలపై ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు.