Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఖేరి నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదు?
- మిగతా నిందితుల పట్ల ఇలానే వ్యవహరిస్తున్నారా?
- దేశానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? : సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఆగ్రహం
- రాష్ట్రప్రభుత్వ చర్యలు, పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి
- సాక్ష్యాలను భద్రపరచాలని యూపీ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం
- కారు నడిపిన విధానం, ఆరోపణలు నిజమే : హరీశ్ సాల్వే, యూపీ ప్రభుత్వ న్యాయవాది
- విచారణ 20 కి వాయిదా
న్యూఢిల్లీ : ఎనిమిది మంది మరణించిన లఖింపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పోలీసులు చేసిన దర్యాప్తు పట్ల అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్య కేసు నమోదైయిన నిందితుడిని అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర హత్య కేసుల్లో నిందితుల పట్ల కూడా ఇలానే వ్యవహరిస్తున్నారా? దేశానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ప్రశ్నించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాటల్లోనే కనిపిస్తుందనీ, చర్యల్లో లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది. న్యాయ విచారణ కమిషన్‌తో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు, ఎఫ్ఐఆర్ నమోదు వంటి అంశాలపై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలు చేసిందనీ, అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాము సంతృప్తి చెందలేదని అన్నారు.
నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి స్పందించిన సాల్వే ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు పోలీసులు సమన్లు జారీ చేశారని తెలిపారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకొని అన్ని హత్య కేసుల్లో నిందితుల పట్ల ఇలానే వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించింది. ''తాము కేసు మెరిట్స్ చూడటం లేదు. ఐపీసీ సెక్షన్ 302 కింద ఆరోపణలు (హత్యా నేరం). ఇతర కేసుల్లో ఇతరులతో వ్యవహరించే విధంగానే అతడిని కూడా చూడండి'' అని సీజేఐ పేర్కొన్నారు. ''ఇది ఎనిమిది మందిని దారుణంగా హత్య చేసిన కేసు. అలాంటి సందర్భంలో పోలీసులు సాధారణంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. అందుకు స్పష్టమైన ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఎందుకు అరెస్టు చేయలేదు?'' ప్రశ్నించింది.
కారు నడిపిన విధానం, ఆరోపణలు నిజమేః హరీష్ సాల్వే
ఆశిష్‌పై నమోదైన కేసు తీవ్రమైనదని సీజేఐ ఎన్వి రమణ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ ''నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను తన కారుతో కొట్టి.. చంపిన ఆశిష్ మిశ్రాను హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. అయితే తాను ఇప్పుడు తాను రాలేననీ, తనకు సమయం కావాలని ఆశిష్ మిశ్రా అడిగాడు. అయితే పోలీసులు శనివారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని చెప్పారు'' అని ధర్మాసనానికి తెలిపారు. ఒకవేళ ఆ వ్యక్తి రాకపోతే, చర్యలు తీసుకుంటామని సాల్వే అన్నారు. ''పోస్ట్‌మార్టంలో బుల్లెట్ గాయాలు కనిపించలేదు. అందుకే సీఆర్పీసీ 160 కింద నోటీసు పంపించారు. కానీ కారు నడిపిన విధానం, ఆరోపణలు నిజమే. నేను కూడా ఆరోపణలు నిజమని చెబుతున్నా. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదైంది'' అని అన్నారు. దీనికి సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ స్పందిస్తూ బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఇలా వ్యవహరిస్తారా? తీవ్రమైన మరణం, తుపాకీ గాయానికి గురైనప్పుడు దేశంలోని ఇతర నిందితుల పట్ల కూడా అదే విధంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించింది. పోస్ట్‌మార్టం నివేదికలో తుపాకీ కాల్పుల గాయమేమీ కనిపించలేదని సాల్వే పట్టుబట్టినప్పుడు, ధర్మాసనం జోక్యం చేసుకొని ''కాబట్టి నిందితుడిని అదుపులోకి తీసుకోకపోవడానికి ఇదే కారణమా?'' అని ప్రశ్నించింది. అందుకు సాల్వే స్పందిస్తూ ''బహుశా అతను దుర్దేశపూరితంగా అయిన ఉండొచ్చు. తప్పించుకుపోయి ఉండొచ్చు'' అని అన్నారు.
అధికారుల్లో సీరియస్‌నెస్ ఏదీ..?
విచారణ జరుగుతున్న తీరును గమనిస్తే, అధికారులు సీరియస్‌గా ఉన్నట్టు అనిపించటం లేదని సీజేఐ అన్నారు. ''చర్యలు లేవనీ, కేవలం మాటలు మాత్రమే ఉన్నాయి. పంపుతున్న సందేశమేంటీ?'' అని అసహనం వ్యక్తం చేశారు. ''ఇది ఎనిమిది మంది దారుణ హత్యకు సంబంధించింది. నిందితులందరిపై చట్టం ప్రకారం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి''జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. రెండు రోజుల్లో లోపాలను పరిష్కరిస్తామని ధర్మాసానికి సాల్వే పేర్కొన్నారు. ''మేం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వివరాలను చూశాం. డీఐజీ, ఎస్పీ, సర్కిల్ అధికారులు ఉన్నారు. వారందరూ స్థానిక వ్యక్తులే. స్థానిక అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు'' అని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
సీబీఐ వల్ల పరిష్కారం కాదు..
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు హరీష్ సాల్వే స్పందిస్తూ ''అది పూర్తిగా మీ చేతులో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి అభ్యర్థననున ఏమీ చేయలేదు. దయచేసి దీన్ని మళ్లీ విచారించండి. దీని పురోగతిపై మీకు సంతృప్తి లేకపోతే, అప్పుడు కేసును సీబీఐకి అప్పగించండి'' అని పేర్కొన్నారు. ఈ సమయంలో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ జోక్యం చేసుకొని ''మీ (సాల్వే) పై మాకు గౌరవం ఉన్నది. సమస్య సున్నితత్వం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. దీనిపై మేం వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ కేసులో ఉన్న వ్యక్తుల దృష్ట్యా సీబీఐ దీనికి పరిష్కరం కాదని మీకు తెలుసు. అందుకు కారణాలు కూడా మీకు తెలుసు'' అని పేర్కొన్నారు.
సాక్ష్యాలను నాశనం చేయకుండా చూడాలి..
ఈ కేసు చాలా తీవ్రమైనదనియూపీ ప్రభుత్వ న్యాయవాది హరీష్ సాల్వే అన్నారు. సంతృప్తికరమైన చర్యలు తీసుకుంటామనీ, ప్రత్యామ్నాయ ఏజెన్సీ ద్వారా విచారణ జరుపుతామని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఈ కేసును మరొక ఏజెన్సీ స్వాధీనం చేసుకునే వరకు సాక్షులను రక్షించడానికి, సాక్ష్యాలు నాశనం కాకుండా చూసేందుకు డీజీపీ హామీ కోరండి'' అని ధర్మాసనం పేర్కొంది. సాక్ష్యాలు, సంబంధిత సామాగ్రిని భద్రపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతానని సాల్వే హామీ ఇచ్చారు. '' దసరా సెలవుల తరువాత ఈ కేసును విచారిస్తాం. దీని పురోగతి ఎలా ఉంటుందో చూద్దాం. సంబంధిత అధికారుల కారణంగా ఈ కేసులో బాగా విచారణ నిర్వహించబడిందో లేదో మాకు తెలియదు'' అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
మీడియా పరిమితిని దాటొద్దు
న్యాయవాది అగ్నిష్ ఆదిత్య వాదనలు వినిపిస్తూ ''సీజేఐ లఖింపూర్ బంధువులను కలిశారని టైమ్స్ నౌ చేసిన ట్విట్‌ను ప్రస్తావించారు. దీనికి సీజేఐ స్పందిస్తూ ఇదంతా టీవి విషయాలని పేర్కొన్నారు. ''నేను కోర్టులో ఉన్నాను. లక్నో ఎలా వెళ్లగలను'' అన్ని ప్రశ్నించారు. జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకొని ''భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తీకరణలను మీడియా ఎలా అధిగమిస్తుందో చూడండి. సీజేఐ దయతో ఉన్నారు. లేకపోతే దీనిని కోర్టు ధిక్కారణగా పరిగణించేదే'' అని పేర్కొన్నారు. ''మేము మీడియా స్వేచ్ఛను గౌరవిస్తాం, కానీ పరిమితిని దాటడానికి ఇది మార్గం కాదు'' అని జస్టిస్ హిమాకోహ్లీ పేర్కొన్నారు. ''మనమందరం అలాంటి ట్వీట్ల బాధితులం. చాలా అసంబద్ధం. ఇది ధిక్కారంగా పరిగణించడానికి అర్హమైనది'' అని న్యాయవాది హరీశ్ సాల్వే అన్నారు. దీనిపై జస్టిస్ ఎన్వి రమణ జోక్యం చేసుకొని ''ఇలాంటి ప్రజా జీవితంలో భాగం. దాన్ని అలా ఉండనివ్వండి. కేసు విచారిద్దాం'' అని పేర్కొన్నారు. దసరా సెలవుల తరువాత కేసు విచారణ చేస్తామనీ, అప్పటి వరకు సాక్ష్యాలను భద్రపర్చాలని యూపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది.
'లఖింపూర్' కేసులో సుప్రీంకోర్టుది 'విశేషమైన జోక్యం'
- ప్రముఖ న్యాయవాది దుశ్యంత్ దవే ప్రశంసలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన యూపీలోని లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టు వ్యవహరిస్తున్న తీరును ప్రముఖ న్యాయవాది దుశ్యంత్ దవే ప్రశంసించారు. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం 'చెప్పుకోదగిన రీతిలో జోక్యం' చేసుకున్నదని వివరించారు. నిజంగా ఇది (సుప్రీంకోర్టు) సిటిజెన్స్ గార్డియన్ అని నిరూపించిందన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పైనా ఆయన ప్రశంసలు కురిపించారు. గత నలుగురు సీజేఐ లలాగా కాకుండా గత కొన్ని నెలలుగా ఎన్వీ రమణ విశేషమైన పని చేశారని దుశ్యంత్ అన్నారు. గత రెండు రోజులుగా లఖింపూర్ ఖేరీ కేసుపై జరుగుతున్న వాదనలు సుప్రీంకోర్టులో శుక్రవారం ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్‌తో ఇంటర్వ్యూలో భాగంగా దుశ్యంత్ దవే పై వ్యాఖ్యలు చేశారు. కాగా, లఖింపూర్ ఖేరీ ఘటనపై యూపీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై యూపీ పోలీసులు, ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తుపై ఎన్వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.