Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ దెబ్బకు అంతా కకావికలం
- భారత్‌లో 24.8మంది విద్యార్థులపై ప్రభావం : ఐరాస సాంస్కృతికశాఖ వెల్లడి
- 70శాతం మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్ లేదు..
- దాంతో ఆన్లైన్ క్లాసులకు దూరం..
- ఆర్థికసంక్షోభంతో స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్న తల్లిదండ్రులు
న్యూఢిల్లీ : కోవిడ్ సంక్షోభం భారత్‌లో విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. పాఠశాలలు మూతపడిన నేపథ్యంలో కోట్లాది మంది ఆన్లైన్ క్లాసులు వినలేకపోయారని, దాంతో సమాజంలో విద్యాపరమైన అసమానతలు పెరగడానికి దారితీసిందని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక శాఖ ఏజెన్సీ ఒక నివేదికలో తెలిపింది. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవటం కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిందని నివేదిక పేర్కొంది. గత ఏడాది మార్చిలో మోడీ సర్కార్ లాక్డౌన్ ప్రకటించిన వెంటనే, దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి.
ఇక అప్పటి నుంచి ఇప్పటివరకూ విద్యారంగం కోలుకోనంతగా నష్టపోయిందని, దాదాపు 24.8కోట్ల మంది విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమయ్యారని నివేదిక అంచనావేసింది. నాణ్యమైన విద్య అతిపెద్ద సవాల్‌గా మారుతుందని భారత్‌ను ఐరాస హెచ్చరించింది. ఇందులో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్య
పాఠశాలకు దూరమైన మొత్తం విద్యార్థుల్లో 70శాతం మందికి స్మార్ట్ఫోన్లు లేవు. ఆన్లైన్ క్లాసులు వినడానికి మరే ఇతర సాంకేతిక పరికరాలు సౌకర్యాలు వారికి లేవు. ముఖ్యంగా గ్రామాల్లో విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు విందామంటే, వారికి సరైన ఇంటర్నెట్ అందుబాటులో లేదు. దీనివల్ల సామాజికంగా వెనుకబడిన, పేద కుటుంబాల విద్యార్థులు నేడు విద్యలో వెనుకపడే పరిస్థితి ఏర్పడింది. ముందు ముందు విద్యలో అంతరాలకు దారితీసిందని నిపుణులు భావిస్తున్నారు.
ఆర్థిక అస్థిరత
ఇంటర్నెట్ ఖర్చులు భరించలేక పోయాయని సర్వేలో పాల్గొన్న దాదాపు 40శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. లాక్డౌన్, కరోనా నేపథ్యంలో నగరాల్లో ఉపాధి దెబ్బతిని అనేకమంది గ్రామాలబాట పట్టారు. ఇది అనేక కుటుంబాల్లో ఆర్థిక అస్థిరతకు దారితీసింది. పిల్లల్లో పౌష్టికాహార లోపం, బాల్య వివాహాలు పెరగడానికి లాక్డౌన్ కారణమైందని అధ్యయనంలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ప్రయివేటు స్కూల్స్
కరోనా సంక్షోభం దెబ్బకు ప్రయివేటు స్కూల్స్ తీవ్రంగా నష్టపోయాయి. పేద కుటుంబాల పిల్లల్ని ఎంతోమంది నేడు ప్రయివేటు స్కూల్స్‌లో చదువుతున్నారు. అలాంటి స్కూల్స్ ఒక్కసారిగా మూతపడటం, ఆన్లైన్ విద్యను పొందలేకపోవటం ఆ పిల్లల్ని విద్యలో వెనుకపడేట్టు చేసింది. మరోవైపు పిల్లల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దెబ్బతిని స్కూల్ ఫీజులు కట్టలేకపోయారు. ఉద్యోగాల్లో కోత, వేతనాల్లో కోతతో ప్రయివేటు స్కూల్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ రంగంలో ఆధారపడ్డ 30శాతం మందికి ఉపాధి కరువైంది. భారత్ మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. స్వాతంత్య్రం అనంతరం ఇంతటి ఆర్థికమాంద్యం ఎప్పడూ రాలేదని నిపుణులు భావిస్తున్నారు.
ఆన్లైన్ విద్యకు 3 కోట్లమంది దూరం : కేంద్ర విద్యాశాఖ వెల్లడి
కోవిడ్ సంక్షోభం వల్ల దాదాపు మూడు కోట్లమంది విద్యార్థులు ఆన్లైన్ విద్యకు దూరమయ్యారని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. విద్యకు నోచుకోని విద్యార్థులు ఒక్క బీహార్లోనే 1.4మంది ఉన్నారని తేలింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమర్పించిన నివేదికలో ఈ విషయాల్ని కేంద్రం పేర్కొంది. డిజిటల్ క్లాసులకు నోచుకోని విద్యార్థుల వివరాలు రాష్ట్రాల వారీగా, జార్ఖాండ్‌లో 32.5లక్షలు, కర్నాటకలో 31.3లక్షలు ఉన్నారని నివేదికలో తెలిపారు. మధ్యప్రదేశ్, జమప్మూకాశ్మీర్లో 70శాతం మంది విద్యార్థులు డిజిటల్ క్లాసులు పొందలేకపోయారు. దేశంలో మొత్తం విద్యావ్యవస్థను కోవిడ్ దెబ్బకొట్టింది. 26.45కోట్లమంది విద్యార్థులు, 96.87లక్షల టీచర్లు, 15.07లక్షల పాఠశాలలపై ప్రభావం పడింది.