Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12న ''షహీద్ కిసాన్ దివస్''
- హర్యానా ముఖ్యమంత్రి క్షమాపణలు
- కేంద్ర మంత్రిని అరెస్టు చేయండి :ఎస్కేఎం
న్యూఢిల్లీ : 11లోగా కేంద్ర మంత్రి తొలగించడం, అరెస్టు చేయడం వంటి తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే, 18న దేశవ్యాప్తంగా రైల్ రోకో నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది. 18న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్‌రోకో కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. 12 ''షహీద్ కిసాన్ దివస్''గా నిర్వహిస్తామని ఎస్కేఎం పేర్కొంది. 12 న టికోనియాలో జరిగిన లఖింపూర్ ఖేరీ రైతుల మారణకాండలో ఐదుగురు అమరవీరుల సంస్మరణ సభను ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. రైతుల మరణకాండకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకునేలా మోడీ, యోగి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు రావాలని కోరింది. 12న గురుద్వారాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రార్థన సమావేశాలను నిర్వహించాలనీ, శ్రద్ధాంజలి సమావేశాలను నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 12న సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించాలని సూచించింది. శాంతిని ప్రేమించే పౌరులందరూ ఈ కొవ్వొత్తుల ప్రదర్శనల్లో చేరాలని, లేదా ఐదుగురు అమరవీరులకు నివాళిగా తమ ఇండ్ల వెలుపల ఐదు కొవ్వొత్తులను వెలిగించాలని పిలుపు ఇచ్చింది.
హర్యానా సీఎం క్షమాపణ
రైతులపై హింసను ప్రేరేపిస్తూ పార్టీ కార్యకర్తలను ఆదేశించిన ప్రకటనలకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొన్నారు. తన పర్యటన కార్యక్రమంలో పాల్గొనడాన్ని నిరసిస్తూ రైతులు ఇప్పటికే నిరసన ప్రకటించినందున శనివారం కైతల్‌లో తన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగం బీజేపీ నాయకుల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందనీ, రైతుల శాంతియుత నిరసనలను హింసాత్మకంగా మార్చాలనీ, తద్వారా రైతులను అణచివేయాలని ప్రయత్నిస్తుందని ఎస్కేఎం పేర్కొంది. ఉద్యమాన్ని అణచివేసే మునుపటి వ్యూహాలన్నీ విజయవంతం కాలేదని తెలిపింది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ శక్తులు రైతులను హింసాత్మక మార్గాల ద్వారా అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయనీ, రైతుల ఉద్యమానికి ఈ వ్యూహాల గురించి పూర్తిగా తెలుసని పేర్కొంది. దాన్ని నుంచి తమను తాము కాపాడుకుంటామని తెలిపింది. ప్రజాస్వామ్య, శాంతియుత మార్గాల ద్వారా మరిన్ని గ్రామాల్లోని ఎక్కువ మంది రైతులకు బీజేపీ రైతు వ్యతిరేక, అప్రజాస్వామిక, హింసాత్మక మనస్తత్వం గురించి అవగాహన కల్పించబడుతుందని వివరించింది. అన్ని డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు ఉద్యమం మరింత బలోపేతం చేయబడుతుందని ఎస్కేఎం తెలిపింది.
కేంద్ర మంత్రిని అరెస్టు చేయండి
లఖింపూర్ ఖేరీ రైతుల మారణకాండలో నిందితులకు రక్షణగా యూపీలో బీజేపీ ప్రభుత్వ ఉండటం పట్ల ఎస్కేఎం తీవ్ర ఆందోళన చెందుతోంది. యోగి ప్రభుత్వానికి వదిలేస్తే న్యాయం రాజీ పడుతుందనేది ఎల్లప్పుడూ ఆందోళన కలిగించే విషయమనీ, అజరు మిశ్రా టెని మోడీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగటం వల్ల అది స్పష్టం అవుతుందని ఎస్కేఎం పేర్కొంది. కేంద్ర మంత్రి అజరు మిశ్రా టెనిని తక్షణమే తొలగించాలనీ, రైతులపై కుట్ర, శత్రుత్వం, ద్వేషం, అసమ్మతి, హత్యలను ప్రోత్సహించినందుకు అరెస్టు చేయాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. అక్టోబర్ 20 వరకు కేసు విచారణ వాయిదా వేయడంతో నిరాశకు గురిచేసిందని, అయితే సుప్రీం కోర్టు లేవనెత్తిన అంశాలతో ఎస్కేఎం ఏకీభవిస్తుందని తెలిపింది. అక్కడ జరుగుతున్న దర్యాప్తు, సిట్, చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలపై సుప్రీం కోర్టు ప్రశ్నించడాన్ని ఎస్‌కెఎం మద్దతు ఇస్తుందని తెలిపారు.
కాగా లోక్‌నీతి సత్యాగ్రహ పాదయాత్ర భగవాన్‌పూర్ హాత్ నుంచి బయలుదేరి 26 కిలోమీటర్లు దాటి ఛాప్రా జిల్లాలోని జలాల్పూర్ చేరుకుంది. అక్కడ నుంచి బనియాపూర్కు చేరుకుంది. అక్కడ ఇంటర్ కాలేజీ ఆఫ్ బనియాపూర్‌లో భారీ సమావేశం జరిగింది. 18 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రలో ఇప్పటి వరకు ఎనిమిది రోజుల పాటు సాగింది. జలాల్పూర్ నుంచి బయలుదేరిన యాత్ర ఛాప్రా జిల్లాలోని మాఝీఘాట్ వైపు వెళుతుంది. గాంధీ జయంతి నాడు చంపారన్ నుంచి వారణాసికి బయలుదేరే పాదయాత్ర ఇప్పుడు దాదాపు 140 కిలోమీటర్లు మేర సాగింది. ఈ యాత్ర బీహార్-ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్నది. శనివారం ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టనున్నది.