Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల ఆధారిత చెల్లింపుల్లో అనేక సమస్యలు
- సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయం 'నరేగా' (ఉపాధి హామీ పనులు) పథకాన్ని అల్లకల్లొలం చేసింది. కుల ఆధారిత చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని ఈ ఏడాది మొదట్లో కేంద్రం ప్రకటించగా, సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా అనేకమంది వ్యవసాయ కూలీలు, కార్మికులు ఇబ్బందిపడ్డారు. ఈ పథకంలో జరిగే చెల్లింపులకు సంబంధించి పూర్వపు విధానాన్నే అమలుజేయాలని వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు కేంద్రాన్ని కోరాయి. కొత్త విధానంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తటంతో కేంద్రం పునరాలోచనలో పడిందని, ఒకే ఖాతా ద్వారా చెల్లింపులు జరపాలనే ఆలోచన చేస్తోందని కేంద్ర ప్రభుత్వంలోని అధికార వర్గాలు మీడియాకు తెలిపాయి. నరేగా పనుల నిమిత్తం ఉపాధి పొందిన ఎస్సీ, ఎస్టీ, ఇతరులకు వేరు వేరుగా వేతనాల చెల్లింపు ఖాతాలను తెరవాలని ఈ ఏడాది మొదట్లో కేంద్రం నిర్ణయించింది. కుల ఆధారిత చెల్లింపుల విధానానికి తెరలేపింది. ఎస్సీ, ఎస్టీ, ఇతరులు..అనే మూడు కేటగిరీల వారీగా వేతన చెల్లింపు జాబితా రూపొందించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే కొత్త విధానం అమల్లోకి వచ్చాక అనేక సమస్యలు తలెత్తటం మొదలైంది. ఉదాహరణకు కర్నాటకలో ఒక సామాజిక వర్గానికి ముందుగా వేతనాలు రావటం, మిగతా వారికి ఆలస్యం కావటం చర్చనీయాంశమైంది. అయితే నిధుల వ్యయంలో పారదర్శకత కోసమే ఇదంతా చేశామని ఇప్పుడు కేంద్రం చెబుతోంది. తిరిగి పూర్వపు చెల్లింపు విధానం 'సింగిల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్'(ఎఫ్టీఓ) తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ తాజాగా వెల్లడించింది.