Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఘటన నుంచి ఎన్నార్సీ వరకు..
- బెంగాల్లో పలు రాజకీయ, ప్రస్తుత అంశాలపై ప్రజల క్రియేటివిటీ
కోల్‌కతా : బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా దుర్గా మండపాల వద్ద ప్రజలు పలు రకాల థీమ్స్‌తో తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారు. దేశంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పలు అంశాలపై తమదైన శైలిలో మండపాల వద్ద భావాలను, ఆలోచనలను చిత్రాల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. యూపీలోని లఖింపూర్ ఖేరీలో రైతులపై హింసాత్మక ఘటన మొదలుకొని పలు రాజకీయ, ప్రస్తుత అంశాలపై తమ భావాలను తెలియజేస్తున్నారు. ఒక మండపం దగ్గర.. రైతు కాళ్ల మీద నుంచి ఎస్యూవీ కారు దూసుకెళ్లినట్టు చూపించారు. ఇంకో దగ్గర సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా ఒక థీమ్‌ను ప్రదర్శించారు. ముఖ్యంగా, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ధర్నాలతో పాటు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్నార్సీ), లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించిన థీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా పలు మండపాల వద్ద కనిపించడం గమనార్హం. దీంతో ఈ థీమ్స్ అక్కడికి వచ్చే ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.