Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ బోనస్‌లపై పోరాటాలు
- పశ్చిమ బెంగాల్లో పలు రంగాలకు చెందిన వర్కర్స్ హర్షం
కోల్‌కతా : కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పోరాటాలతో సాధించే కార్మిక సంఘం సీఐటీయూ పశ్చిమ బెంగాల్లో వారికి అండగా నిలుస్తున్నది. ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని టీ గార్డెన్స్ నుంచి దక్షిణ ప్రాంతంలోని ప్రభుత్వ రంగ కోల్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) వరకు ఇలా ప్రతి రంగంలోని కార్మికుల డిమాండ్ల కోసం పోరాడుతూ పురోగతిని సాధిస్తున్నది. పశ్చిమబెంగాల్లో పండుగ సీజన్ సందర్భంగా కార్మికులకు బోనస్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి కారణంగా యాజమాన్యాల తీరుతో పండుగ సీజన్ బోనస్ కార్మికులకు అందడం కష్టంగా మారింది. దీంతో రాష్ట్రంలోని పలు రంగాల కార్మికులు దానిని క్లెయిమ్ చేసుకోవడానికి పోరాడుతున్నారు. ఈ విషయంలో సంబంధిత రంగంలోని యాజమాన్యంతో చర్చలు, పోరాటాలతో సీఐటీయూ కార్మికులు డిమాండ్లను సాధిస్తున్నారు. దీంతో సీఐటీయూ పోరాటాలపై రాష్ట్రంలోని పలు రంగాల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీ గార్డెన్స్
సీఐటీయూ సహకారంతో టీ గార్డెన్ వర్కర్స్ బోనస్ విషయంలో ఈ సారి భారీ విజయాన్ని సాధించారు. రాష్ట్రంలో దూవార్స్ ప్రాంతం, కొండ ప్రాంతాల్లోని టీ గార్డెన్ వర్కర్స్ ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే 20 శాతం బోనస్‌ను పొందుతుండటం గమనార్హం. అయితే, ప్రభుత్వ ఆదేశాలున్నప్పటికీ సింక్టమ్ టీ గార్డెన్ ఓనర్స్ 20 శాతం బోనస్ ఇవ్వడం నిరాకరించారని సీఐటీయూ కార్యకర్త గౌతమ్ ఘోష్ తెలిపారు.
బస్సు కార్మికులు
రాష్ట్రంలోని కమర్షియల్ బస్ వర్కర్స్ 12 శాతం బోనస్‌ను ఒక్క వాయిదాలోనే పొందడానికి తీవ్రంగా పోరాడుతున్నారు. సీఐటీయూ పట్టు ఉన్న అన్ని జిల్లాల్లో బస్సు కార్మికుల పరిస్థితి మాత్రం చక్కగా ఉన్నది. అయితే, ఇతర ప్రాంతాల్లో మాత్రం కార్మికులను నియమ, నిబంధనల పేరుతో యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సుభాశ్ ముఖోపాధ్య తెలిపారు. ఈ కార్మికుల కోసం బోనస్ డిమాండ్ విషయంలోనూ బస్సు ఓనర్స్‌తో సీఐటీయూ పోరాడిందనీ, ప్రస్తుతం పరిస్థితి మాత్రం సానుకూలంగానే ఉన్నదని చెప్పారు.
వస్త్ర కార్మికులు
వ్యవస్థీకృత రంగంలోని వస్త్ర కార్మికులు ఈ ఏడాది కూడా బోనస్‌ను పొందుతు న్నారని వెస్ట్ బెంగాల్ టైలరి ంగ్ అండ్ గార్మెంట్ వర్కర్స్ యూనియన్‌కు చెందిన అసదుల్లా గయెన్ తెలిపారు.
జూట్ వర్కర్స్
జూట్ (జనపనార)కు ప్రసిద్ధి గాంచిన ఈ రాష్ట్రంలో సంబంధిత కార్మికులు ఈ ఏడాది 8.33 శాతం బోనస్‌ను పొందబోతున్నారని సీఐటీయూ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ అనంది సాహు తెలిపారు. కాగా, లాక్డౌన్ సమయంలో కార్మికుల వేతన బకాయిలను రద్దు అయ్యాయనీ, పండుగ తర్వాత ఈ రంగంలోని కార్మికుల కోసం వేతన విషయంలో పోరాటాలుంటాయని ఆమె చెప్పారు.
ప్రభుత్వ రంగం
ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)కు చెందిన కార్మికులు ఈ ఏడాది అదనంగా నాలుగువేల రూపాయలను పొందనున్నారు. ఇక సెయిల్ ఉద్యోగులు ఈ సారి రూ.21 వేలు, ట్రైనీలు రూ. 19వేలు పండుగ బోనస్‌ను అందుకోనున్నారని స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ లలిత్ మిశ్రా తెలిపారు. కాగా,రాష్ట్ర సర్కారు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సారి బోనస్‌ను రూ. 4,500కు తగ్గించడం గమనార్హం.గత వామపక్ష పాలనలో ప్రభుత్వరంగ సంస్థల్లోని కార్మికులకు 30రోజుల వేతనం బోనస్‌గా లభించే దని పలువురు కార్మిక సంఘాల నాయకులు గుర్తు చేశారు.
గృహ కార్మికులు
రాష్ట్రంలోని గృహకార్మికులు ఒక్క నెల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, రాష్ట్ర రాజధాని కోల్‌కతాతో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ ఫార్ములా పని చేస్తుందని గృహ కార్మికుల యూనియన్‌కు చెందిన తరుణ్ భరద్వాజ్, ఇంద్రజిత్ ఘోష్‌లు తెలిపారు.