Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా ఐదో రోజూ ధరలకు రెక్కలు
- పెట్రోల్‌పై 30, డీజీల్‌పై 35 పైసలు పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి ఊపిరిసల్పనీయకుండా చేస్తున్నాయి. వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దేశంలో వరుసగా ఐదో రోజూ చమురు ధరలు పెరిగాయి. దీంతో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు కొత్త రికార్డులను నమోదు చేశాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పెంచిన రేట్ల ప్రకారం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు పెరిగి దాని ధర రూ. 103.84గా నమోదైంది. అలాగే, లీటర్ డీజీల్‌పై 30 పైసలు ఎగబాకి దాని ధర రూ. 92.47కు పెరిగింది. దేశ ఆర్థిక వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 109.83కి ఎగబాకింది. ఇక్కడ డీజీల్ ధర సెంచరీ మార్కును దాటి పరుగులు పెడుతున్నది. ప్రస్తుతం ముంబయిలో లీటర్ డీజీల్ ధర రూ. 100.29గా ఉన్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.27గా, డీజీల్ ధర రూ. 96.93గా నమోదైంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.52, డీజీల్ ధర రూ. 95.58గా ఎగబాకింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46కు చేరుకోగా, డీజీల్ ధర రూ. రూ. 98.15కి చేరి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చమురు ధరలు షాకిస్తున్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా రూ. 112.38గా నమోదైంది. ఇక్కడ డీజీల్ ధర రూ. 101.54గా ఉన్నది. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలనూ ఇంధన ధరలు హడలెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.02కు ఎగబాకింది. అలాగే, ఇక్కడ డీజీల్ ధర సెంచరీ మార్కును దాటి రూ. 100.89కి పెరిగింది.