Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దసరా రోజు ప్రధాని మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మల దహనం
- కార్యాచరణ ప్రణాళిక ఖరారు
- ఉత్తరప్రదేశ్‌లో 72 జిల్లాల్లో షహీద్ కిసాన్ యాత్ర
- 26న లక్నోలో భారీ కిసాన్ మహా పంచాయత్
- ప్రధాని మోడీ స్పందించరేమీ..?: ఎస్కేఎం
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ రైతుల మారణకాండలో న్యాయం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. అందుకనుగుణంగా అక్టోబర్ 12 నుంచి 26 వరకు కార్యాచరణ ప్రణాళికలను సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ప్రకటించారు. శనివారం నాడిక్కడ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్కేఎం నేతలు రాకేశ్ తికాయత్, హన్నన్ మొల్లా, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్, జోగేంద్ర సింగ్ ఉగ్రహాన్, హర్పాల్ సింగ్ బిలారి, సురేష్ కౌత్, అభిమన్యు కోహార్ మాట్లాడారు. కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా టెనిని కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలనీ, అశాంతి వ్యాప్తి చేయడం, హత్య, కుట్ర ఆరోపణలపై అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా, అతని సహచరుల (వీరిలో సుమిత్ జైస్వాల్, అంకిత్ దాస్ పేర్లు బయటపడ్డాయి)ను హత్య ఆరోపణలు కింద వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరి అమరవీరులకు నివాళులర్పిస్తూ దేశవ్యాప్తంగా అక్టోబర్ 12న ''షహీద్ కిసాన్ దివస్'' నిర్వహించాలని పిలుపు ఇచ్చారు. ఆ రోజున లఖింపూర్ ఖేరిలోని టికోనియాలో జరిగే సంస్మరణ సభకు హాజరై అమరవీరులకు నివాళులర్పించాలని ఉత్తరప్రదేశ్, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఎస్కేఎం నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ రోజున గురుద్వారా, దేవాలయం, మసీదు, చర్చి, ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో, టోల్ ప్లాజా, ఆందోళన శిబిరాల్లో తమ రైతుల కోసం ప్రత్యేక ప్రార్థన సమావేశాలు, అమరవీరుల కోసం నివాళి సమావేశాలు నిర్వహించాలని అన్ని రైతు సంఘాలకు పిలుపు ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలనీ, ఆ సాయంత్రం తమ ఇండ్ల బయట ఐదుగురు అమరవీరుల జ్ఞాపకార్థం ఐదు కొవ్వొత్తులను వెలిగించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
డిమాండ్లు అంగీకరించకపోతే..
కేంద్ర హౌం సహాయ మంత్రిని పదవి నుంచి తొలగించడం, అరెస్టు చేయడం, అలాగే ఆయన కుమారుడు, అతని అనుచరులను అరెస్టు చేయడం వంటి తమ ప్రధాన డిమాండ్లను 11వ తేదీ లోపు అంగీకరించకపోతే, దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అందుకు సంబంధించిన ఆందోళన కార్యక్రమాన్ని ఎస్కేఎం నేతలు ప్రకటించారు. ఐదుగురు అమరవీరుల అస్తికలుతో లఖింపూర్ ఖేరి నుండి షహీద్ కిసాన్ యాత్ర ప్రారంభమవుతుందనీ, అస్తికలు పట్టుకొని సాగే ఈ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలకు, దేశంలోని ప్రతి రాష్ట్రానికి వెళ్తుందని తెలిపారు. ఆయా జిల్లాల్లో, రాష్ట్రాల్లో పవిత్రమైన, చారిత్రక ప్రదేశంలో యాత్ర ముగుస్తుందని వివరించారు. దసరా సందర్భంగా (అక్టోబర్ 15న) రైతు వ్యతిరేక ప్రభుత్వానికి చిహ్నంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, స్థానిక నాయకుల (యోగి ఆదిత్యనాథ్, మనోహర్ లాల్ ఖట్టర్) దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపు ఇచ్చారు. అక్టోబర్ 18న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైల్‌రోకో నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్26న లఖింపూర్ ఘటనకు వ్యతిరేకంగా లక్నోలో భారీ కిసాన్ మహా పంచాయితీ నిర్వహిస్తామని ఎస్కేఎం నేతలు తెలిపారు.
రైతు ఉద్యమంపై కుట్రలో భాగమే ...
లఖింపూర్ ఖేరీ మారణకాండ దేశ రైతు ఉద్యమ చరిత్రలో బాధాకరమైన అధ్యాయంగా గుర్తుండిపోతుందని ఎస్కేఎం నేతలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు బయటకొచ్చిన అన్ని వీడియోలు ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం నిజాన్ని దేశానికి వెల్లడించాయని తెలిపారు. లఖింపూర్ ఘటనను వేరుగా చూడలేమనీ, కొనసాగుతున్న రైతు ఉద్యమంపై జరుగుతున్న పెద్ద కుట్రలో భాగమని స్పష్టం చేశారు. ఈ సంఘటన అకస్మాత్తుగా జరగలేదనీ, ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్రలో భాగంగానే జరిగిందని విమర్శించారు. ''కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా టెని నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా తనకు తానుగానే ప్రకటించుకున్నాడు. మొదట రైతులను బెదిరించాడు. తరువాత నిరసన తెలుపుతున్న రైతులను ఉసిగొల్పడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతని కుమారుడు, అతని గూండా సహచరులు నిరసన నుంచి తిరిగి వెళ్తున్న రైతులను వాహనాలతో తొక్కించారు'' అని విమర్శించారు. రైతులను వాహనాలతో తొక్కించడం వల్ల నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారని తెలిపారు. ఈ దారుణ హత్య కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల ముఖాలు కూడా దేశం ముందు బహిర్గతమవుతున్నాయని చెప్పారు. ఈ ఘటన కేంద్రంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ అధికారంలో ఉన్న బీజేపీ స్వభావాన్ని పూర్తిగా బహిర్గతం చేసిందని అన్నారు. ఈ హింసోన్మాదంలో బీజేపీ నాయకుల ప్రమేయం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, ఆ పార్టీ (బీజేపీ) తన నాయకులు, గూండాలపై ఎలాంటి చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేదని విమర్శించారు. ఈ చారిత్రాత్మక రైతు ఉద్యమం నేపథ్యంలో బీజేపీ క్షేత్రస్థాయిల్లో తన స్థానాన్ని కోల్పోయిన తరువాత ఇప్పుడు హింసకు దిగినట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు. ఈ హింసకు శాంతియుత, ప్రజాస్వామ్య ప్రజా ఉద్యమం ద్వారా ప్రతిస్పందిస్తామని ఎస్కేఎం నేతలు స్పష్టం చేశారు. ఈ మారణకాండ, ప్రభుత్వం అసంతృప్తి చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారోద్యమాన్ని చేపడతామని పేర్కొన్నారు.
రైతులపై ప్రభుత్వం హింసాత్మక విధానం
ఆందోళన చేసే రైతులపై ప్రభుత్వం హింసాత్మక విధానాన్ని అవలంబించిందని పేర్కొన్నారు. కానీ తాము హింసా మార్గాన్ని ఎంచుకోమనీ, తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని ఎస్కేఎం నేతలు స్పష్టం చేశారు. అయితే కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు తమ ఉద్యమాన్ని నిర్మూలించేందుకు అనేక వ్యూహాలతో ప్రయత్నిస్తుందని అన్నారు. ''ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పదేపదే కించపరస్తూ ఖలిస్తానీ, పాకిస్తాన్, చైనా, రాజద్రోహులు, మావోయిస్టులనే ముద్రలు వేసేందుకు ప్రయత్నించింది. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు గత కొన్ని నెలలుగా వారు కొత్త ఆట ఆడటం ప్రారంభించారు. హింసను ఆశ్రయించింది.
ఇది ప్రమాదకరం. మేము శాంతియుతంగా సమాధానం ఇస్తాం. ఇది మా ఉద్యమానికి బలం. మా డిమాండ్లు నెరవేరే వరకు మా ఆందోళన కొనసాగుతుంది. వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు'' అని పేర్కొన్నారు. బీజేపీ హింసాత్మక చర్యలతో తమ ఆందోళనలను తొలగించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. లఖింపూర్‌లో ఇంత జరిగితే ప్రధాని మోడీ కనీసం స్పందించలేదని విమర్శించారు. ''లఖింపూర్ సంఘటన ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, ప్రజల గొంతును మూసివేయడానికి జరిగే ప్రయత్నం. ఈ విధానానికి వ్యతిరేకంగా ఎస్కేఎం గట్టిగా నిలబడుతుంది. అలాగే గొంతు పెంచడం కొనసాగుతుంది'' అని ఎస్కేఎం నేతలు పేర్కొన్నారు. విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు స్పందించిన రాకేశ్ తికాయత్ ''రైతులపై వాహనాల కాన్వారు దూసుకెళ్లిన తరువాత చోటు చేసుకున్న ఘటన చర్యకు ప్రతిచర్యలో భాగమే జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తుల చనిపోవడాన్ని నేరంగా, వారి హత్యకు పాల్పడిన వారిని నిందితులుగా పరిగణించం. ఎందుకంటే రైతులపై దూసుకెళ్లిన ఎస్యూవీ వాహనంపై స్పందించిన వారిగా మాత్రమే పరిగణిస్తాం. లఖింపూర్ ఘటనలో రైతులు, బీజేపీ కార్యకర్తల ప్రాణాలు కోల్పోయినందుకు తమకు బాధగా ఉంది. ఇది దురదృష్టకరం, న్యాయం జరుగుతుందని మేం ఆశిస్తున్నాం'' అని తికాయత్ అన్నారు.