Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనవసర భయాలు సృష్టించారు : కేంద్ర మంత్రి ఆర్కె సింగ్
న్యూఢిల్లీ : దేశంలో బొగ్గు కొరత లేదనీ, ఈ అంశంపై అనవసర భయాలు సృష్టించారని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కె సింగ్ ప్రకటించారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లోని అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉందని వార్తలో నేపథ్యంలో ఆదివారం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేవలం గెయిల్ (జిఎఐఎల్), టాటా నుంచి సమాచార లోపంతో ఇలాంటి ఏర్పడినట్టు తెలిపారు. 'విద్యుత్ సంక్షోభం ఎదుర్కోబోతున్నట్లు అనవసర భయాందోళనలు సష్టించారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ గ్యాస్ సరఫరా కూడా తగ్గదు. విద్యుత్ అవసరమైన వారు కోరితే వారికి సరఫరా చేస్తాం' అని ఆర్కే సింగ్ వెల్లడించారు. దేశంలో విద్యుత్ సంక్షోభానికి కారణమయ్యే సరఫరా, వినియోగం మధ్య ఎలాంటి అగాధం లేదని స్పష్టం చేశారు. విద్యుత్ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ అందించాలని ఇప్పటికే గెయిల్ సిఎండిని ఆదేశించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఎన్‌టిపిపి, బిఎస్ఇఎస్, విద్యుత్ మంత్రిత్వశాఖ అధికారులతో తన నివాసంలో సమావేశం తరువాత ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందంటూ కొన్ని సంస్థలు వినియోగదారులకు తప్పుడు సమాచారాన్ని పంపాయి, ఈ సంస్థలను హెచ్చరించినట్లు చెప్పారు. దేశంలోని 135 థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 106 కేంద్రాల వద్ద బొగ్గు కొరత తీవ్రంగా ఉందని, కొన్ని రోజుల్లో ఈ కేంద్రాలు మూతపడడం ఖాయమని వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ఢిల్లీ ముఖ్యమంతి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్‌లు కేంద్రానికి లేఖ కూడా రాసారు. దీనిపై కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ మూడు నాలుగు రోజుల్లో పరిస్థితులు అదుపులోకి వస్తాయని కూడా చెప్పారు. అయితే తాజాగా ఆదివారం విద్యుత్‌శాఖ మంత్రి మాత్రం దేశంలో బొగ్గు కొరతలేనది, అవన్నీ అనవసర భయాందోళనలేనని చెప్పడం విశేషం.
ఆక్సిజన్ విషయంలోనూ ఇదే చెప్పారు : ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి
దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పతికి సరిపడినన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రకటించడాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఖండించారు. చేతిలో ఉన్న సంక్షోభాన్ని గుడ్డి కళ్లతో చూడలేకపోతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి ఆర్కె సింగ్ ప్రకటన తరువాత సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్యలో కోవిడ్ రెండో దశ విజృంభిస్తున్న సమయంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఇదే విధంగా కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. 'ఆక్సిజన్ సంక్షోభం ఉన్న సమయంలోనూ, వాళ్లు ఎలాంటి సంక్షోభం లేదని చెప్పారు' 'ఇప్పుడు బొగ్గు పరిస్థితి కూడా అలాంటిదే. ఈ రోజు మనం సంక్షోభంలో ఉన్నాం' అని సిసోడియా పేర్కొన్నారు. బొగ్గు సంక్షోభం, కొరత గురించి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా కేంద్ర మంత్రి ఈ విధంగా ప్రకటనచేయడాన్ని 'బాధ్యతరహిత్యం' గా విమర్శించారు. 'సంక్షోభం గురించి దేశంలోని ముఖ్యమంత్రులంతా కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. వీటి మధ్య ఈ రోజు విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ఈ ఆరోపణలు తోసిపుచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి లేఖ రాయకూడదని చెప్పారు' అని సిసోడియా పేర్కొన్నారు.