Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండోర్‌లో ఓ వర్గం కుటుంబంపై ఆర్ఎస్ఎస్ దాడి!
- బాధిత కుటుంబంపైనే కౌంటర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలో ఒక ముస్లిం కుటుంబంపై జరిగిన దాడి రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. కాంపెల్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది శనివారం రాత్రి ఇనుపరాడ్లు పట్టుకొని 8మంది సభ్యులున్న ముస్లిం కుటుంబంపై దాడికి తెగబడ్డారు. గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాలని, లేదంటే చంపేస్తామని ఆ కుటుంబాన్ని బెదిరించారు. విచక్షారహితంగా కొట్టారు. కుటుంబంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇంతవరకూ పోలీసులు నిందితుల్ని పట్టుకోలేదు. మతపరమైన నినాదాలు చేస్తూ వారు వెళ్లిపోయారని బాధితులు తెలిపారు. ఈ బెదిరింపులు, దాడులతో ఆ గ్రామంలో నివసిస్తున్న బాధిత ముస్లిం కుటుంబం కడు దయనీయమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఘటనపై బాధితుల ఫిర్యాదుమేరకు ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, నిందితుల నుంచి కూడా ఫిర్యాదు తీసుకోవటం వివాదాస్పదమైంది. బాధిత ముస్లిం కుటుంబంపై కౌంటర్ ఎఫ్ఐఆర్ను నమోదుచేశారు.
ఈ ఘటనపై ఇండోర్ పోలీసులు చెబుతున్న కథనం ఈ విధంగా ఉంది. ముస్లిం కుటుంబం రెండేండ్ల క్రితం ఇండోర్‌కు సమీపంలోని కాంపెల్ ప్రాంతానికి చేరుకుంది. ప్యూడే గ్రామపరిధిలో వ్యవసాయ పనిముట్ల వర్క్‌షాప్‌ను నడుపుతూ జీవనం సాగిస్తోంది. ఇండోర్ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యూడే గ్రామంలో శనివారం రాత్రి 8గంటలకు ఈ దాడి జరిగింది. కుటుంబంలోని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో షారూక్ లోహార్ నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, 9మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశామని పోలీసులు చెప్పారు. ఐపీసీలోని 323, 294..తదితర సెక్షన్ల కింద ఆరోపణలు నమోదుచేశామని ఎస్ఐ విశ్వజీత్ తోమార్ అన్నారు. అయితే ఘటనకు సంబంధించి ఇంకా ఎవర్నీ అరెస్టు చేయలేదన్నారు.
అయితే బాధిత ముస్లిం కుటుంబంపై వికాస్ సింగ్ అనే దుకాణాదారు చేసిన ఫిర్యాదుమేరకు కౌంటర్ ఎఫ్ఐఆర్ నమోదైంది. ట్రాక్టర్ ట్రాలీ నిర్మాణం కోసం ఆ ముస్లిం కుటుంబానికి రెండు నెలల క్రితం రూ.75వేలు ఇచ్చానని, తన పని ఎంతకీ చేయకపోవటమేగాక...ఇచ్చిన డబ్బు విషయంలో గొడవ జరిగిందని, ఇదే విషయమై దాడిచేయాల్సి వచ్చిందని వికాస్ సింగ్ పోలీసులకు చెప్పాడట. తనకు ఆర్ఎస్ఎస్తో ఎలాంటి సంబంధమూ లేదని అతడు మీడియాకు తెలిపాడు. అయితే ఇండోర్‌లో ఇటీవల ముస్లింలపై దాడులు పెరిగాయని, వాటిని కప్పిపుచ్చడానికి అనేక అవాస్తవ కథనాలు అల్లుతున్నారని బాధిత ముస్లిం తరఫు న్యాయవాది చెబుతున్నారు. గాజులు అమ్ముకొనే తస్లీం అలీపైన ఇండోర్‌లో ఇలాగే కొంతమంది దాడిచేయగా, పోలీసులు బాధితుడిపైన్నే కౌంటర్ ఎఫ్ఐఆర్ దాఖలుచేయటం చర్చనీయాంశమైంది.