Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల హత్య ప్రస్తావనలేని రెండో ఎఫ్ఐఆర్
- రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన కాంగ్రెస్
- హిందూ వర్సెస్ సిక్కు యుద్ధంగా మార్చే ప్రయత్నం : వరుణ్ గాంధీ
- బాధిత రైతులను ప్రధాని మోడీ పరామర్శించరా? : ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ : యూపీలోని లఖింపూర్ మారణకాండకు కేంద్ర బిందువుగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించిన లఖింపూర్ ఖేరీ హింసాకాండకు సంబంధించి ఆశిష్ మిశ్రాను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) ఉపేంద్ర అగర్వాల్ నేతత్వంలోని తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్, శనివారం 11 గంటల పాటు విచా రించించింది. ఆ తరువాత అరెస్టు చేసిన విషయం తెలి సిందే. డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. 'విచారణ సమయంలో సహకరించకపోవడం, కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానాలే ఇవ్వకపోవడం, తప్పించుకునే విధంగా సమాధానాల కారణంగానే అరెస్టు చేశాం' అని చెప్పారు. మిశ్రాను శనివారం రాత్రి అరెస్టు చేసిన తరువాత వైద్య పరీ క్షలు నిర్వహించారు. జ్యుడీషియల్ మేజిస్ట్రేటు ముందు హాజరుపరిచిన ఆశిష్ మిశ్రాను ప్రస్తుతానికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
తర్వాత ఆయనను జిల్లా జైలుకు తరలిస్తారు. ఆశిష్ మిశ్రాను కస్టడీకి తీసుకోవాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం లఖింపూర్ ఖేరీలోని కోర్టులో దరఖాస్తు దాఖలు చేయనున్నారు. అయితే ఈ కేసులో తదుపరి వాదనలు వినిపించడానికి నిందితుల తరఫు న్యాయవాది సోమవారం కోర్టు ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తున్నది. కోర్టు ముందు తన వాదనను వినిపించడానికి న్యాయవాదికి మూడు రోజుల సమయం ఇచ్చారు.
రెండో ఎఫ్ఐఆర్..
కాగా, రైతులపై జరిగిన మారణకాండ గురించి రెండో ఎఫ్ఐఆర్లోనూ ప్రస్తావించలేదు. లఖింపూర్ ఖేరీ ఘటనపై నమోదైన రెండో ఎఫ్ఐఆర్లో వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇతర శక్తులు (బ్యాడ్ ఎలిమింట్స్) ఎస్యూవీ వాహనంలో ఉన్న బీజేపీ కార్యకర్తలపై దాడి చేశాయని పేర్కొన్నారు. కానీ రైతుల పైకి వాహనాలు ఎక్కించడం, కారులో ఆశిష్ ఉండటం గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. రెండో ఎఫ్ఐఆర్లో ''ఒక పేరు తెలియని అల్లరి (అన్ నేమ్డ్)'' గురించి మాత్రమే ప్రస్తావించారు. సుమిత్ జైస్వాల్ ఫిర్యాదు మేరకు టికొనియా పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 324 (ప్రమాదకరమైన ఆయుధాలు, మార్గాల వల్ల గాయాలు) వంటి అభియోగాలు మోపారు.
రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన కాంగ్రెస్
లఖింపూర్ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను అపాయింట్మెంట్ కోరింది. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ నాయకులు ఏకె ఆంటోనీ, మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, ప్రియాంక గాంధీ వాద్రా, అధిర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్ లు అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత రాష్ట్రపతిని కలుస్తారు.
బాధిత రైతులను ప్రధాని మోడీ పరామర్శించరా? : ప్రియాంక గాంధీ
లఖింపూర్ రైతు బాధితులను ప్రధాని మోడీ ఎందుకు పరామర్శించరని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఆదివారం వారణాసిలో జరిగిన ''కిసాన్ న్యాయ ర్యాలీ''లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''ఆందోళన చేస్తున్న రైతులను ప్రధాని మోడీ 'ఆందోళన్ జీవి', 'తీవ్రవాదులు'గా పిలిచారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వారిని పోకిరి వాళ్లు అని పోల్చి బెదిరిం చడానికి ప్రయత్నించారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి (అజరు కుమార్ మిశ్రా).. నిరసన తెలుపుతున్న రైతులను రెండు నిమిషాల్లో దారికి వచ్చేలా చేస్తానని అన్నారు'' అని విమర్శించారు. ''ముఖ్యమంత్రి యోగి కేంద్ర మంత్రిని కాపాడుతారు. ప్రధాని మోడీ 'అమత్ మహౌ త్సవ్' ప్రదర్శనను చూడటానికి లక్నో వస్తారు. కానీ, బాధితు లను పరామర్శించడానికి లఖింపూర్ మాత్రం వెళ్లరు'' అని ఆమె అన్నారు. లఖింపూర్ ఖేరీ ఘటన సాధారణమైన నేరం కాదనీ, విషాదకమైనదని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య నిరసనల పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా జరిగిందని ఆరోపించారు.
రైతులు అవమానాలు ఎదర్కొంటున్నారు : అఖిలేష్ యాదవ్
''రైతులు అన్నదాతలు. వారు నేడు అవమానాలు ఎదుర్కో వాల్సి వస్తున్నది. బీజేపీ నేతలు రైతులను తీవ్రవాదులని పిలుస్తారు. బీజేపీ అనేకసార్లు అవమానించినప్పటికీ రైతులు తమ ఆందోళన నుంచి మాత్రం వెనక్కి తగ్గలేదు. అందుకు నేను వారిని అభినందించాలనుకుంటున్నాను'' అని ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. ''మేము అధికారంలో ఉన్న వ్యక్తుల పనిని చూశాం. లఖింపూర్‌లో వారి చర్యను చూశాం. వాహనాలను రైతుల మీదకు ఎక్కించారు. చట్టాన్ని దిగజార్చడానికి సన్నాహాలూ జరిగాయి. రైతులను, చట్టాన్ని ధ్వంసం చేయగల వారు రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కగలరు'' అని ఆయన విమర్శించారు.
హిందూ వర్సెస్ సిక్కు యుద్ధంగా మార్చే ప్రయత్నం : వరుణ్ గాంధీ
లఖింపూర్ ఖేరీని హిందూ వర్సెస్ సిక్కుల యుద్ధంగా మార్చే ప్రయత్నం జరుగుతున్నదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శించారు. ఒక మతపరమైన కథనాన్ని అల్లడానికి ప్రయత్నిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక అనైతిక, తప్పుడు విధానం మాత్రమేనని అన్నారు. మనం జాతీయ ఐక్యత కంటే ఈ చిన్న రాజకీయ లాభాలను చూడకూడదని ఆయన తెలిపారు. లఖింపూర్ ఘటనకు న్యాయం జరగాలనీ, దానికి మతపరమైన అర్థాలు తీసుకురావద్దని హితవు పలికారు. నిరసన తెలిపే రైతులను ఖలిస్తానీ అనడం దారుణమని వరుణ్ అన్నారు. సరిహద్దుల్లో పోరాడి రక్తం చిందించిన ఈ గర్వించదగిన కుమారుల తరాలను అవమానించడమనేనని విమర్శిం చారు. ఈ తప్పుడు ప్రతిచర్యతో, మన జాతీయ ఐక్యతకూ చాలా ప్రమాదకరమని చెప్పారు.
నేడు మహారాష్ట్ర బంద్
లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనకు వ్యతిరేకంగా నేడు మహారాష్ట్రలో బంద్‌కు వికాస్ అఘాడీ కూటమి పిలుపునిచ్చింది. మహారాష్ట్రలోని శివసేన, కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లతో కూడిన మహారాష్ట్ర వికాస్ అఘాడీ సోమవారం బంద్ నిర్వహించనున్నది. 12 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజలు రైతులకు మద్దతుగా నిలవాలని రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పిలుపునిచ్చారు. ఒక్కరోజు పనులను ఆపి బంద్‌లో పాల్గొనాలని ప్రజలను ఆయన కోరారు. కాగా, బంద్‌లో భాగంగా అత్యవసర సేవలు మినహా ప్రతీదీ క్లోజ్ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.