Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాగ్‌రాజ్‌లో కిసాన్ మజ్దూర్ భారీ పంచాయత్
- పంజాబ్‌లో 'చెతావనీ' ర్యాలీ
- కేంద్ర మంత్రి అజరుమిశ్రాను తొలగించాలని డిమాండ్
- హర్యానాలో రైతులపై కేసులు
- యూపీలో అడుగుపెట్టిన లోక్‌నీతి యాత్ర
- కార్యాచరణ అమలుకు వివిధ రాష్ట్రాల్లో సన్నాహాలు
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా విషయంలో మోడీ సర్కార్‌కు కిసాన్ మహా పంచాయతీలు అల్టిమేటం జారీ చేశాయి. అజరు మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒధిగి తర్హార్ గ్రామంలో ఆదివారం మజ్దూర్ కిసాన్ పంచాయత్ జరిగింది. రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇసుక కార్మికులు, రాతి క్వారీ కార్మికులు సహా వేలాది మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ పంచాయత్‌కు మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావడం విశేషం. లఖింపూర్ ఖేరీ రైతుల మారణకాండ తరువాత తూర్పు యూపీలో ఇదే మొదటి పంచాయత్. బీజేపీ ప్రభుత్వాల విధానాల ఫలితంగా రాతి క్వారీ, ఇసుక గని కార్మికులు, వ్యవసాయ కార్మికులకు జీవనోపాధి కోల్పోవడం గురించి పంచాయత్‌లో నేతలు మాట్లాడారు.
అలాగే మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, రైతులకు ఎంఎస్పీ హామీ చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం నుంచి టికోనియాలోని అక్టోబర్ 12న జరిగే సం స్మరణ సభలో వేలాది మంది ప్రజలు పాల్గొనాలని పంచాయత్ నిర్ణయించింది.
పంజాబ్‌లోని బర్నాలాలో ''చేతవానీ ర్యాలీ'' జరిగింది. రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ర్యాలీలో ఎస్కేఎం నేతలు మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలనీ, పంజాబ్‌లో రైతు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి అజరు మిశ్రా తొలగింపుపై మోడీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
రైతుల హత్యలను ఖండించిన అంతర్జాతీయ సమాజం
లఖింపూర్ ఖేరీ రైతుల ఊచకోతపై దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా స్పందనలు వెలువడుతున్నాయి. రైతుల హత్యలను అంతర్జాతీయ సమాజం ఖండించింది. బ్రిటన్, కెనడాల్లోని పార్లమెంట్ సభ్యులు ఈ ఘటనను తప్పుబట్టారు. ఆయా దేశాల్లో ప్రజలు నిరసనలు చేపట్టారు.
హర్యానాలోని నారిన్గఢ్లో రైతులపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బీజేపీ ఎంపీ నయాబ్ సింగ్ సైనీ కారు రైతులపైకి దూసుకెళ్లడంతో ఒక రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఘటనకు సంబంధించి రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చండీగఢ్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న 40 మంది రైతులపై పోలీసులు కేసులు పెట్టారు. చేయని నేరాలకు సంబంధించి కూడా రైతులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు చాలా ఉత్సాహంగా ఉన్నారనీ, అయితే నేరస్థులు విషయానికి వస్తే బీజేపీ అంత ఉత్సాహం చూపడం లేదని ఎస్కేఎం ఆరోపించింది.
ఇటివలి ఎస్కేఎం పిలుపునిచ్చిన కార్యాచరణ ప్రణాళిక అమలుకు వివిధ రాష్ట్రాల్లో సన్నాహాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో 52 జిల్లాల్లో అక్టోబర్ 12, 15, 18 తేదిల్లో రైతులను ఎస్కేఎం సమీకరించనున్నది. ఈ నెల 15న కనీసం 5,000 గ్రామాల్లో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, నరేంద్ర సింగ్ తోమర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి వారి దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని ఎస్కేఎం నిర్ణయించింది. రైల్వేలైన్లు ఉన్న జిల్లాల్లో అక్టోబర్ 18న రైల్‌రోకో చేపట్టనున్నారు. కర్ణాటకలో 12న శ్రద్ధాంజలి సమావేశాలతో పాటు 10 ప్రాంతీయ కిసాన్ మహాపంచాయత్‌లను నిర్వహించనున్నారు. అదే రోజు బీహార్‌లో రాష్ట్రవ్యాప్తంగా షహీద్ కిసాన్ దివాస్ జరుపుకుంటారు. ఆ రోజు కొవ్వొత్తులు మార్చ్‌లు, శ్రద్ధాంజలి సభలు నిర్వహి స్తారు. పాట్నాలో సాయంత్రం 5.30 గంటలకు అసెంబ్లీ స్టేషన్ గొలంబర్ వద్ద కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ నుంచి బుద్ధ స్మృతి పార్క్ వరకు జరుగుతుంది. అక్కడ సంతాప సభ జరుగుతుంది. అదేవిధంగా, 15, 18 తేదీల్లో బీజేపీ నాయకుల దిష్టిబొమ్మల దహనం, రైల్ రోకో కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
యూపీలో అడుగు పెట్టిన లోక్‌నీతి యాత్ర
చంపారన్ నుంచి వారణాసి వరకు జరిగే పాదయాత్ర తొమ్మిదో రోజుకు చేరుకుంది. లోక్‌నీతి సత్యాగ్రహ పాదయాత్ర బీహార్‌లో దాదాపు 150 కిలోమీటర్లు పూర్తి చేసిన తరువాత ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నది. యూపీలో మరో 200 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరుగుతుంది. అక్టోబర్ 20న వారణాసి నగరానికి చేరుకునే ముందు బల్లియా, ఘాజీపూర్, బెనారస్‌ల గుండా యాత్ర సాగుతుంది.
బీజేపీ నేతలకు వ్యతిరేకంగా స్థానిక నల్ల జెండాలతో నిరసనలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని ఎల్లెనాబాద్‌లో బీజేపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభానికి వ్యతిరేకంగా నిరసన జరిగింది. అదేవిధంగా, బివానీలో బీజేపీ శిక్షణా శిబిరానికి అలాంటి నిరసన సెగే తగిలింది.