Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చిపై దాడి కేసులో లేని అరెస్టులు
- బాధితులపైనే కౌంటర్ కేసు నమోదు
డెహ్రాడూన్ : రూర్కీ దాడి బాధితులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఈనెల 3న ఉత్తరాఖండ్ రూర్కీ పట్టణంలోని ఒక చర్చిపై సంఫ్‌ుపరివార్ మూకలు దాడికి పాల్పడిన విషయం విధితమే. బాధితులు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోకపోవడంతో ఈ ఆదివారం చర్చి ప్రాంగణమంతా నిశ్శబ్ధ వాతావరణం ఆవరించింది. ఇదే సమయంలో దాడి కేసుల్లో ఇప్పటి వరకు నిందితుల్లో ఒకరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, కౌంటర్ ఫిర్యాదు నేపథ్యంలో బాధితులపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చర్చిలో అక్రమంగా మతమార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చట్టపరమైన సాయం అందించేందుకు ఒక లాయర్ కోసం ఎదురుచూస్తున్నామని చర్చి నిర్వాహకురాలు ప్రియో సాధన లాన్సే చిన్నకుమార్తె ఏవా లాన్సే తెలిపారు. 200 మందితో కూడిన విహెచ్పి, భజరంగ్‌దళ్, బిజెపి యువజన విభాగానికి చెందిన కార్యకర్తలు చర్చిలోకి ప్రవేశించి ఇనుప రాడ్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురుకి గాయాలు కాగా, ఒక మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటన జరిగి వారానికి పైగా గడిచినా ఇంత వరకు అరెస్టులు జరగకపోవడం గమనార్హం. '' ఆ భయంకరమైన దాడి తర్వాత మా ప్రాణాల కోసం భయపడుతున్నాం. మా ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. అయినా కూడా అందరిలో విపరీతమైన భయం నెలకొంది'' అని ఏవా తెలిపారు. చర్చి వద్ద కూడా ఉన్న పోలీసులు ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళ్తున్నారనే దానిపై నిఘా ఉంచారు. ది వైర్‌తో సాధన లాన్సే మాట్లాడుతూ చర్చిపై దాడి పట్ల తాము చాలా బాధపడుతున్నామని అన్నారు. '' సంఫ్‌ుపరివార్ గూండాల దాడికి మా చర్చి ఒక లక్ష్యంగా ఉంటుందని అనుకున్నాం.. అయితే ఇంత భారీ సంఖ్యలో 200 మంది వచ్చి దాడికి పాల్పడుతారని ఊహించలేదు'' అని పేర్కొన్నారు. కాగా, చర్చి నిర్వాహకులపై మహిళ ఇచ్చిన ఫిర్యాదులో ఆధారాలు లేవని, దీన్ని మూసేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు చర్చిపై దాడి కేసుల్లో ఇంతవరకూ అరెస్టులు చేయకపోవడంపై ఉత్తరాఖండ్ డిజిపి అశోక్‌కుమార్ స్పందిస్తూ.. ఎఫ్ఐఆర్లో నమోదైన వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని, ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. దాడి ఘటనపై పోలీసులు పారదర్శకంగా విచారణ చేయడంతో పాటు దోషులను చట్టపరంగా శిక్షించాలని ఏవా డిమాండ్ చేశారు.