Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో స్థానంలో శివసేన
- మూడు, నాలుగు స్థానాల్లో వైసీపీ, టీడీపీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 42 ప్రాంతీయ పార్టీలకు సంబంధించి 2019-20 సంవత్సరంలో వచ్చిన ఆదాయంలో టిఆర్ఎస్ అగ్రభాగాన నిలిచింది. రెండోస్థానంలో శివసేన ఉండగా, మూడు, నాలుగు స్థానాల్లో వైసీపీ, టీడీపీ నిలిచాయి. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ ఆఫ్ డమెక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రిపోర్టు విడుదల చేసింది. 2019-20 ఏడాదికి సంబంధించి 42 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ వ్యయాలను విశ్లేషిస్తూ నివేదిక విడుదల చేసింది.
ఐదు పార్టీలదే అధిక మొత్తం
మొత్తం 42 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఆదాయం రూ.877.35 కోట్లు కాగా అందులో ఐదు పార్టీలకే రూ.516.48 కోట్లు దక్కాయి. వీటిలో టిఆర్ఎస్కు రూ.130.46 కోట్లు (14.86 శాతం), శివసేనకు రూ.111.40 కోట్లు (12,89శాతం), వైసిపికి రూ.92.73 కోట్లు (10.56 శాతం), టిడిపికి రూ.91.53 కోట్లు (10.43 శాతం), బిజెడికి రూ.90.35 కోట్లు (10.29 శాతం) వచ్చాయి. అయితే టిఆర్ఎస్ కేవలం రూ.21.18 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. అత్యధికంగా రూ.109.27 కోట్లు (83.76 శాతం) మిగులుతో ప్రాంతీయ పార్టీల్లో ప్రథమ స్థానంలో టిఆర్ఎస్ ఉంది.
శివసేన తనకు వచ్చిన ఆదాయంలో రూ.99.37 కోట్లు వ్యయం చేసింది. వైసిపి రూ. 37.83 కోట్లు వ్యయం చేసి రూ.54.90 కోట్ల మిగులుతో ఉంది. టిడిపి రూ.108.84 కోట్లు వ్యయం చేసింది. రాబడి కన్నా 17.31 కోట్లు ఎక్కువగా వ్యయం చేసి లోటు బడ్జెట్‌తో టీడీపీ ఉంది. ఎంఐఎంకు రూ.1.68 కోట్లు రాబడి రాగా రూ.65 లక్షలు వ్యయం చేయగా 1.03 కోట్లు మిగిలింది. అన్నాడిఎంకెకు రూ.89.06 కోట్ల ఆదాయం రాగా, రూ.28.83 కోట్లు వ్యయం చేయగా రూ.60.77 కోట్లు మిగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ తనకు వచ్చిన రూ.49,65 కోట్లలో రూ. 38.87 కోట్లు వ్యయం చేయగా రూ.10.77 కోట్లు మిగులు చూపింది.
ఆదాయానికి మించిన వ్యయం చేసిన పార్టీల్లో టిడిపి
ఆదాయానికి మించి వ్యయం చేసిన పార్టీల్లో టిడిపితోపాటు బిజెడి, డిఎంకె, ఎస్పి, జెడిఎస్‌తో పాటు మరో 13 పార్టీలున్నాయి. బిజెడికి రూ.90.35 కోట్లు ఆదాయం రాగా రూ.186.13 కోట్లు వ్యయం చేయగా, డిఎంకె 64.90 కోట్ల ఆదాయం రాగా, రూ. 71. 03 కోట్లు ఖర్చు చేసింది. ఎస్సి రూ. 47.27 కోట్లు ఆదాయం రాగా రూ.55.69 కోట్ల వ్యయం చేసి లోటు బడ్జెట్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల పార్టీలు వైసిపి, టిడిపి, టిఆర్ఎస్ ఆదాయాలు గతం కంటే తగ్గాయి.