Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలతో ఆదివారం జరిగిన 13వ రౌండ్ భారత్, చైనా సీనియర్ మిలటరీ కమాండర్ల స్థాయి చర్చలు ప్రతిష్టంభనతో ముగిశాయి. మిలిగిన ప్రాంతాల్లో వివాదాల పరిష్కారానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేశామని భారత ఆర్మీ సోమవారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలపగా, ఇదే సమయంలో భారత్ అసమంజసమైన, అవాస్తమైన డిమాండ్లు చేస్తోందని చైనా మిలటరీ తన ప్రకటనలో పేర్కొంది. తాను చేసిన నిర్మాణాత్మక సూచనలకు చైనా అంగీకారం తెలపలేదని, వారి నుంచి ముందుచూపు ప్రతిపాదనలు కూడా రాలేదని, ఫలితంగా మిగిలిన వివాదాస్పద ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి తీర్మానం లేకుండానే సమావేశం ముగిసిందని పేర్కొంది. ధ్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ.. స్టేటస్కోను మార్చేందుకు చైనా చేపట్టిన ఏకపక్ష చర్యల కారణంగా వాస్తవధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయని సమావేశంలో భారత్ అధికారులు స్పష్టం చేసినట్లు భారత ఆర్మీ ప్రకటన పేర్కొంది. మిలిగిన ప్రాంతాల్లో కూడా శాంతి, ప్రశాంతతలను పునరుద్ధరించాలంటే చైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పామని తెలిపింది.
సరిహద్దుల్లో ప్రశాంతయుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నామని వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి పిఎల్ఎ సీనియర్ కల్నల్ లాంగ్ షావోవా పేర్కొన్నారు. అయితే భారత్ అసమంజసమైన, అవాస్తవమైన డిమాండ్లను ముందుకు తెస్తోందని, దీని వలన చర్చలు మరింత ప్రతిష్టంభన దిశగా వెళుతున్నాయని అన్నారు. తమ దేశ సార్వభౌమత్వానికి కట్టుబడి ఉన్నామని, సరిహద్దు పరిస్థితులపై తప్పుగా అంచనాలు వేయొద్దని భారత్‌ను కోరుతున్నామన్నారు. సరిహద్దులకు సంబంధించి ఇరుదేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇతర అవగాహనలకు కట్టుబడి ఉండాలని అన్నారు.