Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,132 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా 193 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,39,71,607 చేరగా, మరణాల సంఖ్య 4,50,782కు పెరిగింది. ప్రస్తుతం 2,27,347 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 3,32,93,478 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98 శాతానికి చేరింది. మరణాల రేటు 1.33 శాతంగా ఉంది. ఇదిలావుండగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 95,19,84,374 టీకాలు వేశారు. ఆదివారం ఒక్కరోజే 46,57,679 టీకా మోతాదులు వేశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందనీ, పేద దేశాలకు టీకాలు అందించాల్సిన ఆవశ్యకతను ధనిక దేశాలు గుర్తించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 23,87,57,668 కరోనా కేసులు నమోదయ్యాయి. 48,69,524 మరణాలు సంభవించాయి. నిత్యం దాదాపు ఐదు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదుకావడంతో పాటు 5 వేల మందివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు కరోనా కేసులు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలు టాప్-3లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, ఇరాన్, అర్జెంటీనా, స్పెయిన్, కొలంబియా, ఇటలీ, జర్మనీ దేశాలు ఉన్నాయి.