Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: దేశంలో నిత్యం ఏదోఒక చోట మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు అధికమయ్యాయి. వ్యవసాయ పొలం వద్ద తుపాకితో బెదిరించి మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివరాల్లోకెళ్తే.. యూపీలోని జెవార్ ప్రాంతంలోని ఓ దళిత మహిళపై నలుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో సదరు మహిళ పశువులకు మేత కోసం స్థానికంగా వున్న వ్యవసాయ పొలం దగ్గరగా ఉన్న అడవిలోకి వెళ్ల్లింది. ఈ క్రమంలోనే ఆదే ప్రాంతానికి చెందిన నలుగురు ఆమెను తుపాకితో బెదిరించి.. లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి.. స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకునీ, పరిశీలించారు.ఈ ఘటనపై జెవార్ పోలీసు స్టేషన్ ఆఫీసర్ ఉమేష్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. సంఘటన స్థలాన్ని పరిశీలించమనీ, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. బాధితురాలిని వైద్యం నిమిత్తం జెవార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని తెలిపారు. అయితే, మెరుగైన చికిత్స కోసం అక్కడి వైద్యులు జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేయడంతో అక్కడికి తరలించామని చెప్పారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందనీ, త్వరలోనే ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని పేర్కొన్నారు. కాగా, నలుగురు నిందితులు పరారీలో ఉన్నారనీ, వారిలో అదే గ్రామానికి చెందిన మహేంద్ర కూడా ఉన్నారని తెలిపారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు మత్తుకు బానిసలయ్యారని తెలిసిందన్నారు.