Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అటవీ సంరక్షణ చట్టం-1980కి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అహేతుకమైన, రాజ్యాంగ విరుద్ధ సవరణలను భూమి అధికార్ ఆందోళన్ తీవ్రంగా ఖండించింది. ఈ సవరణలను నిరసిస్తూ నవంబర్ 12న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు భూమి అధికార్ ఆందోళన్ సోమవారం నిర్వహించిన కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. వేలాదిమంది ఈ ఆందోళనల్లో పాల్గొంటారని తెలిపింది. సంబంధిత అధికారులు, సంఘాలతో సంప్రదింపులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేయాలని తీర్మానించింది. ఈ సమావేశానికి ఏఐయూఎఫ్డబ్ల్యూపీ నేత ఆశోక్ చౌదరి అధ్యక్షత వహించారు. దొడ్డిదారిలో అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించేందుకు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రక్రియను తుంగలో తొక్కే విధంగా ఉందని హన్నన్ మొల్లా విమర్శించారు. అటవీ సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టే ఉద్దేశం దీని వెనుక ఉందని, తద్వారా అడవులపై ఆధారపడి జీవించే వారి హక్కులు తిరస్కరణకు గురౌతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సవరణలు ఆదివాసీలకు జరిగిన చారిత్రక అన్యాయాలను గుర్తించిన అటవీ హక్కుల చట్టం-2006ను కాలరాసేవిధంగా ఉందని మొల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశోక్ చౌదరి మాట్లాడుతూ అటవీ సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చిన 1980 నాటి నుంచి తమ హక్కుల కోసం ఆందోళనలు, పోరాటాలు చేశారని, తద్వారా అటవీ హక్కుల చట్టం వచ్చిందని అన్నారు. ఈ ప్రతిపాదిత సవరణలు ప్రజల హక్కులు, ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎఐకెఎస్ నేత విజూ కృష్ణన్ మాట్లాడుతూ, అటవీ భూములను కార్పొరేట్లకు అప్పగించడం ద్వారా ఆయిల్ పామ్లు, తోటల పెంపకాన్ని అనుమతులు ఇవ్వడమే కేంద్ర ప్రభుత్వ అజెండా అని పేర్కొన్నారు. వాతావరణ మార్పులను పరిష్కరించేందుకు ఇది ఏ మార్గాన్ని చూపదని, ఆదివాసీ ప్రజలు అడవులను రక్షించే సంప్రదాయాలను కలిగి ఉన్నారని అన్నారు. దూరదృష్టి లేని విధానాలు ప్రకృతిని మరింత దెబ్బతీయడంతో పాటు ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని స్పష్టం చేశారు.