Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ సర్టిఫికెట్ల పై కేంద్రం, కేరళ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు
తిరువనంతపురం : కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ల మీద ప్రధాని మోడీ బొమ్మ ఉండటంపై కేరళ హైకోర్టు స్పందించింది. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానం కోరింది. కోవిడ్-19పై జాతీయ ప్రచారం మోడీకి మీడియా క్యాంపెయిన్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తూ సమాచార హక్కు కార్యకర్త ఒకరు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. మోడీ బొమ్మ లేకుండా వ్యాక్సిన్ సర్టిఫికేట్లు జారీ చేయాలని కేంద్రాన్ని తాను అభ్యర్థించినట్టు పిటిషనర్ తెలిపారు. అయితే, కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు వివరించారు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ల మీద మోడీ బొమ్మ ఉండటం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే, పిటిషనర్ పలు అభ్యంతరాలను లేవనెత్తారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి పీ.బీ సురేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కోరింది. కాగా, వ్యాక్సిన్ సర్టిఫికేట్ల మీద మోడీ బొమ్మ ఉండటాన్ని దేశవ్యాప్తంగా నిపుణులు, విశ్లేషకులు తప్పుబట్టారు. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత ప్రధాని మోడీ తన బొమ్మను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఏడాదిలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కూడా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల మీద మోడీ బొమ్మ ఉండటంపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఎలక్షన్ కమిషన్ జోక్యంతో ఎన్నికలు జరిగిన ఆ ఐదు రాష్ట్రాల్లో మోడీ బొమ్మ లేకుండానే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు జారీ అయ్యాయి.