Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు నిల్వలు తగ్గిపోవటంతో ఆందోళనలో వివిధ రాష్ట్రాలు
- మహారాష్ట్రలో 13 విద్యుత్ కేంద్రాలు బంద్.. ఢిల్లీలో కోతలు
- విద్యుత్‌ను పొదుపుగా వాడండి : మహారాష్ట్ర విజ్ఞప్తి
- బడా కార్పొరేట్ల వద్ద బొగ్గు నిల్వలు!
- వాటిని కొనిపించాలన్నదే కేంద్రం వ్యూహం
న్యూఢిల్లీ : దేశంలో బొగ్గు కొరత లేదని కేంద్రం చెబుతున్నా..రాష్ట్రాలు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాస్తవ పరిస్థితులకు, కేంద్రం చెబుతున్నదానికి పొంతన కుదరటం లేదు. కరోనా రెండో వేవ్‌కు ముందు ఆక్సీజన్ విషయంలో కేంద్రం ఇలాగే అందర్నీ మభ్యపెట్టిందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యానించటం మీడియాలో ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో బొగ్గు కొరత లేదని కేంద్ర మంత్రులు ఓ వైపు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్...తదితర రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. బొగ్గు కొరత కారణంగా మహారాష్ట్రలో 13 థర్మల్ విద్యుత్ యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయిందని సోమవారం వార్తలు వెలువడ్డాయి.
మనదేశ విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 70శాతం బొగ్గు ద్వారానే తయారవుతోంది. ఇందులో కొంతవరకు దేశీయ మైనింగ్, మరికొంత దిగుమతుల ద్వారా బొగ్గు సమకూరుతోంది. ఈనేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే బొగ్గును అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కేంద్రానిదే. అయితే దేశంలోని బడా కార్పొరేట్ల వద్ద బొగ్గు నిల్వలు భారీగా ఉన్నాయని, వీటిని తప్పనిసరిగా కొనే పరిస్థితి కల్పించటమే కేంద్రం అసలు లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు. దేశాన్ని శాసిస్తున్న కార్పొరేట్లు బొగ్గు కొనుగోలు వ్యాపారంలో ఉన్నారని, ఇప్పుడు వారు కావాలనే కృత్రిమ కొరతను తెచ్చిపెట్టారనే విమర్శలున్నాయి. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరిగాయన్న సాకుతో...భారీ లాభాల్ని పోగేసుకోవాలన్నదే కార్పొరేట్ల వ్యూహమని నిపుణులు చెబుతున్నారు.
ఎంత మొత్తుకున్నా ఇవ్వట్లేదు : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యుత్ సంక్షోభంపై సీరియస్‌గా చర్చిస్తోంది. తాము ఎంత మొత్తుకున్నా..కేంద్రం నుంచి సరైన స్పందన రావటం లేదని సీఎం కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ''పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు'' అని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతమున్న నిల్వలు రెండు మూడు రోజులకే సరిపోతాయని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. ప్రతిరోజూ 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేవారమని, అదిప్పుడు సగానికి పడిపోయిందని అన్నారు.
రూ.20తో ఒక యూనిట్ కొనాలి..
దేశంలో బొగ్గు కొరత ఏర్పడుతుందనే సంకేతాల నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ముందస్తు చర్యలు మొదలయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే కోతలు కూడా మొదలయ్యాయి. భారీ ధరలను వెచ్చించి కరెంటు కొనుగోలు చేయడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చుతుందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో 3300 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ తెలిపింది. విద్యుత్ కొరతను ఎదుర్కోవాలంటే ప్రయివేట్ నుంచి కొనుగోలు తప్పదని మహారాష్ట్ర విద్యుత్ పంపిణీ ఎండీ విజరు సింఘాల్ మీడియాకు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు విద్యుత్‌ను పొదుపుగా వాడాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేవలం ఒకటిన్నర రోజుకు సరిపడా విద్యుత్‌ను తయారుచేయగల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని తెలిపింది.